WhatsApp: వాట్సప్‌ బ్యాకప్‌.. ఇక గూగుల్‌ అకౌంట్‌ స్టోరేజీ లిమిట్‌లోనే!

WhatsApp: ఇకపై వాట్సప్‌లో మీడియా బ్యాకప్‌ మొత్తం గూగుల్‌ అకౌంట్‌ స్టోరేజీలో చేరనుంది. ఒకవేళ అదనపు స్టోరేజీ అవసరం పడితే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

Published : 16 Nov 2023 02:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సప్‌ చాట్‌ హిస్టరీ, వీడియో, ఫొటోలు.. ఇలా మీడియా మొత్తాన్ని పరిమితితో సంబంధం లేకుండా బ్యాకప్‌ చేస్తుంటాం. ఫోన్‌ మార్చేటప్పుడు.. వాట్సప్‌ను మళ్లీ ఇన్‌స్టాల్‌ చేయాల్సి వచ్చినప్పుడు ఈ బ్యాకప్‌ ఉపయోగపడుతుంది. ఇంతకాలం ఈ బ్యాకప్‌ను గూగుల్‌ స్టోరేజీతో నిమిత్తం లేకుండా వినియోగించుకుంటున్న ఆండ్రాయిడ్‌ యూజర్లకు బ్యాడ్‌న్యూస్‌. ఇకపై వాట్సప్‌ నుంచి మీరు బ్యాకప్‌ చేసే మొత్తం డేటా.. గూగుల్‌ క్లౌడ్ స్టోరేజీ పరిమితిలోకి వచ్చి చేరనుంది.

ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ వాట్సప్‌లోని డేటాను అన్‌ లిమిటెడ్‌గా బ్యాకప్‌ చేసేవారు. ఈ డేటా మొత్తం గూగుల్‌ క్లౌడ్ స్టోరేజీతో సంబంధం లేకుండా విడిగా స్టోర్‌ అయ్యేది. దీంతో ఎంత మొత్తంలో బ్యాకప్‌ చేసినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఇకపై ఈ డేటా మొత్తం గూగుల్‌ అకౌంట్‌లో స్టోరేజ్‌ పరిమితిలోకి రానుంది. అంటే గూగుల్‌ అందిస్తున్న ఉచిత 15జీబీ పరిమితిలో వచ్చి చేరనుందన్నమాట. దీంతో వాట్సప్‌ చాట్‌లు, మీడియా బ్యాకప్‌ గూగుల్‌ స్టోరేజ్‌లో స్పేస్‌ తీసుకుంటే.. ఆ మేర ఇతర మీడియా స్టోరేజీల కోసం కేటాయించిన స్థలాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే గూగుల్‌ స్టోరేజీ పరిధిలోకి వచ్చే గూగుల్ ఫోటోస్‌, గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్‌లోని డేటా తొలగించాల్సి వస్తుంది.

ఉపాధ్యాయుల శిక్షణకు ఏటా 1 బి.డాలర్లు వెచ్చించాలి: నారాయణమూర్తి

ప్రస్తుతం గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ ఫొటోలు, జీమెయిల్‌.. ఇలా అన్నింటికీ కలిపి 15జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజీని గూగుల్‌ అందిస్తుంది. ఒకవేళ ఆ పరిమితి సరిపోకపోతే అదనపు స్టోరేజ్‌ కోసం గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిందే. ప్రస్తుతం నెలకు రూ.130 లేదా ఏడాదికి రూ.1,300 చెల్లించి 100జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ని గూగుల్‌వన్‌ అందిస్తోంది. ఇప్పటికే ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులో వచ్చిన ఈ స్టోరేజీ మార్పులు.. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌ బీటా యూజర్లకు అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది నాటికి మొత్తం ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని