World Heart Day: ఆర్థిక ఒత్తిడికి దూరంగా ఉండాలంటే.. ఇలా చేయడం ఒక్కటే మార్గం!

ఆర్థిక ఒత్తిడి దీర్ఘకాలం పాటు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి దూరంగా ఉండాలంటే దీర్ఘ‌కాలిక ఆర్థిక ప్ర‌ణాళిక అవ‌స‌రం 

Published : 29 Sep 2022 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు పెద్ద వయసు ఉన్న వారిలో మాత్రమే గుండెపోటు వచ్చేది. నేడు చిన్నా, పెద్దా తేడా లేకుండా గుండె జబ్బుల బారిన పడడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి అధిక కొలస్ట్రాల్‌, రక్తపోటు, అనియంత్రిత చక్కెర స్థాయిలు వంటి అనేక కారణాలు ఉన్నాయి. దీర్ఘకాల ఒత్తిడి, అధిక రక్తపోటు, కొలస్ట్రాల్‌ కారణాలు అవుతున్నాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందువల్ల చాలామందిలో గుండెపోటు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి.. అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి దీర్ఘకాలం పాటు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి దూరంగా ఉండడం అవసరం.

నెల వచ్చే సరికి ఎన్నో ఖర్చులు.. రోజువారీ అవసరాలు, రుణాల ఈఎంఐలు, పిల్లల స్కూల్‌ ఫీజులు, పెద్ద వయసు తల్లిదండ్రులు ఉంటే వారి బాధ్యత, ఆరోగ్య పరమైన ఖర్చులు ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో! సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే నెలవారీ జీతం నుంచి ఒక్క రూపాయి కూడా పొదుపు చేయలేం. భవిష్యత్తుకు భరోసానిచ్చే పెట్టుబడులకూ మళ్లించలేం. దీంతో భవిష్యత్‌ గురించి ఆందోళన మొదలవుతుంది. అదీ కాకుండా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అయితే ఈ ఒత్తిడి మరీ ఎక్కువవుతుంది. దీంతో ఇటు ఆర్థిక ఆరోగ్యం దెబ్బతినడం మాత్రమే కాకుండా అటు శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ దెబ్బతిని గుండెపోటు వంటి క్లిష్టమైన అనారోగ్యాల బారినపడే అవకాశం పెరుగుతుంది. ఈ పరిస్థితులు రాకూడదంటే ఏం చేయాలి?

సమతుల్యత ఉండాలి..

శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తీసుకునే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇందుకోసం ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. భవిష్యత్‌ అవసరాలకు తగిన పెట్టుబడులు చేయాలి.  

ఆర్థిక ప్రణాళిక.. 

ఆర్థిక ఒత్తిడి నుంచి బయట పడాలంటే ఆర్థిక స్థిరత్వం అవసరం. ఒక ప్రణాళిక లేకుండా దీన్ని సాధించడం దాదాపు అసాధ్యం. కాబట్టి ముందు ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక ఉంటే స్పష్టత ఉంటుంది. ఆదాయం, ఖర్చుల నిర్వహణలో సమతుల్యత ఉండేలా చూసుకోవచ్చు. నగదు ఎక్కడ ఖర్చవుతుందో తెలుస్తుంది.. కాబట్టి అనవసరమైన ఖర్చులకు కత్తెర వేయవచ్చు. నెలవారీ పొదుపును ఇతర ల‌క్ష్యాలతో పాటు, పదవీ విరమణ జీవితాన్ని ఆర్థికంగా సురక్షితం చేసుకునే పెట్టుబడుల వైపు మరల్చడం సులభం అవుతుంది. అత్యవసర నిధి, బీమా వంటి వాటిని ఏర్పాటు చేసుకోవడం, వాటిని క్రమానుగతంగా సమీక్షించుకోవడంలో ఆర్థిక ప్రణాళిక సాయపడుతుంది.

అప్పు వద్దు.. 

క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరగడం, సులభంగా రుణాలు లభించడంతో దేనికీ వెనకడుగు వేయడం లేదు. రుణం తీసుకుని కొనేస్తున్నారు. సమయానికి చెల్లింపులు చేయకపోతే వర్తించే అత్యధిక వడ్డీలతో ఈ అప్పులు భారమై చెల్లింపులు చేయలేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలా జరగకూడదంటే సాధ్యమైనంత వరకు అప్పుల జోలికి పోకపోవడమే మంచిది. ఇప్పటికే రుణం తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తున్న వారు సాధ్యమైనంత త్వరగా ఇలాంటి అప్పులను తీర్చేయండి. ఆస్తి కొనుగోలు కోసం అప్పు చేస్తుంటే సమయానికి ఈఎంఐలు చెల్లించగలమా అనేది ప్రాక్టికల్‌గా లెక్కించి.. ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. 

అత్యవ‌స‌ర నిధి..

అనుకోకుండా సంపాద‌న ఆగిపోయినా.. ఏ కారణం చేత‌నైనా సంపాద‌న త‌గ్గినా కుటుంబ ఖ‌ర్చుల‌కు ఇబ్బంది కలుగకుండా, ఈఎంఐ చెల్లింపులు ఆగిపోకుండా ఈ మొత్తం ఉపయోగపడుతుంది. అందువ‌ల్ల ఇప్పటి వ‌ర‌కు అత్యవసర నిధి ఏర్పాటు చేయ‌క‌పోతే.. వెంటనే ఏర్పాటు చేయండి. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు కుటుంబ ఖర్చులకు సరిపోయే మొత్తం ఈ నిధిలో ఉండేలా చేసుకోవాలి. ఒకవేళ మీకు రుణ ఈఎంఐలు ఉంటే వాటిని కూడా చేర్చి అత్యవసర నిధిని లెక్కించండి. ఇందుకోసం కేటాయించిన మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టొచ్చు. 

బీమా.. 

మీ కుటుంబ రక్షణకు అవసరమైన జీవిత, ఆరోగ్య బీమాలు కచ్చితంగా ఉండాలి. ఆధారిత కుటుంబ సభ్యులు ఉన్న వారు టర్మ్ బీమా తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రస్తుత వార్షిక ఆదాయానికి క‌నీసం 15-20 రెట్లు హామీ మొత్తం ఉండాలి. కనీసం 60 ఏళ్లు వచ్చే వరకు పాలసీ కొనసాగించాలి. అలాగే ఆరోగ్య భద్రత కోసం మీతో పాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా ఉండేలా చూసుకోవాలి. మీ కుటుంబ ఆరోగ్య అవసరాలకు సరిపోయేలా కవరేజీ ఉండాలి. అలాగే ఎక్కువ కాలం పునరుద్ధరణకు ఆస్కారం ఉన్న పాలసీని ఎంచుకోవడం మేలు. 

పెట్టుబడులు..

మీ, మీ కుటుంబ సభ్యుల భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు పెట్టుబడులు చేయాలి. లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ప్రాధాన్య పరంగా పెట్టుబడులు చేస్తుండాలి. నష్టభయం, రాబడి, లిక్విడిటీ వంటి వాటిని మీ ఫోర్ట్‌ఫోలియోలో బ్యాలెన్స్‌ చేయాలి. అప్పుడే సమయానికి డబ్బు చేతికంది ఆందోళనలకు దూరంగా ఉండడం సాధ్యపడుతుంది. 

సమీక్షించండి..

ఆర్థిక ప్రణాళిక వేయడంతోనే సరిపోదు. సమీక్షించడం కూడా అవసరమే. పెట్టుబడులను సకాలంలో సమీక్షించడం వల్ల ఆర్థిక సాధనాల పనితీరు మీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒక వేళ ప్రస్తుత పెట్టుబడుల పనితీరు సరిగ్గా లేకపోతే, మరికొంత కాలం వేచిచూడటం.. లేదా విక్రయించడం.. లేదా వేరొక పెట్టుబడిలో పెట్టడం.. వంటి ఆప్షన్లను విశ్లేషించి తెలివైన నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

చివరిగా.. 

సంపాదన ఎంత ఉన్నా ఊహించిన ఖర్చులు వచ్చినప్పుడు.. ఎదుర్కోవడంలో తడబడుతున్నారు చాలామంది. చివ‌రికి రుణం తీసుకోక తప్పడం లేదు. తిరిగి చెల్లించేందుకు సంపాద‌న మొత్తం స‌రిపోతుంది. పొదుపు, పెట్టుబ‌డుల‌కు మాటే ఉండదు. ఆర్థిక అసమానతల వల్ల మానసికంగా ఒత్తిడికి గురై గుండెపోటు వంటి అనారోగ్యాల పాలవుతున్నారు. అయితే ఇలాంటి ఆందోళలను, ఒత్తిడి నుంచి బ‌యట‌పడేందుకు, ఊహించిన పరిస్థితులను, ఖర్చులను సమర్థంగా ఎదుర్కొని ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు.. పొదుపు, మ‌దుపు రెండూ క్రమశిక్షణతో చేయాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని