YouTube: కంటెంట్‌ క్రియేటర్లకు యూట్యూబ్‌ గుడ్‌న్యూస్‌!

YouTube monetization: యూట్యూబ్‌ తన మానిటైజేషన్‌ రూల్స్‌ను సరళీకరించింది. మానిటైజేషన్‌ సాధించేందుకు కావాల్సిన సబ్‌స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. 

Updated : 14 Jun 2023 15:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ (YouTube) కంటెంట్‌ క్రియేటర్లకు (Content creators) గుడ్‌న్యూస్‌ చెప్పింది. యూట్యూబ్‌ పార్టనర్‌ ప్రోగ్రామ్‌కు (YPP) సంబంధించిన నిబంధనలను సవరించింది. మానిటైజేషన్‌కు అర్హత సాధించేందుకు ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. చిన్న క్రియేటర్లు సైతం మానిటైజేషన్‌ టూల్స్‌ను పొందేందుకు వీలుగా ఈ నిబంధనలను మార్చింది. అంటే, ఇకపై తక్కువ సబ్‌స్క్రైబర్ల బేస్‌ ఉన్న క్రియేటర్లు సైతం యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చన్నమాట.

యూట్యూబ్‌లో మానిటైజేషన్‌కు (YouTube monetization rules) అర్హత సాధించాలంటే కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్లు అవసరం. దీంతోపాటు ఏడాదిలో కనీసం 4000 గంటల వీక్షణలు లేదా చివరి 90 రోజుల్లో కనీసం 10 మిలియన్‌ షార్ట్స్‌ వీడియోవ్యూస్‌ ఉండాలి. యూట్యూబ్‌ కొత్త మానిటైజేషన్‌ నిబంధనల ప్రకారం.. ఇకపై 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే సరిపోతుంది. చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేసి ఉండాలి. అలాగే ఏడాదిలో మూడు వేల గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్‌  షార్ట్స్‌ వ్యూస్‌ ఉండాలి. ఈ కనీస అర్హతలు సాధించిన వాళ్లు ఇకపై యూట్యూబ్‌ మానిటైజేషన్‌ ప్రోగ్రామ్‌కు అప్లయ్‌ చేసుకోవచ్చు.

తొలుత కొత్త మానటైజేషన్‌ నిబంధనల్ని అమెరికా, బ్రిటన్‌, కెనడా, తైవాన్‌, దక్షిణ కొరియాలో యూట్యూబ్‌ తీసుకొస్తోంది. త్వరలోనే మిగిలిన దేశాల్లోనూ అమలు చేయనుంది. భారత్‌కు ఎప్పుడు తీసుకొచ్చేదీ మాత్రం తెలియరాలేదు. ఏదేమైనా యూట్యూబ్‌ కొత్త రూల్స్‌ వల్ల చిన్న క్రియేటర్లు సైతం ఇకపై యూట్యూబ్‌ ద్వారా డబ్బులు సంపాదించడానికి వీలు కలుగుతుంది. అలానే సూపర్‌ థ్యాంక్స్‌, సూపర్‌ చాట్‌, సూపర్‌ స్టిక్కర్స్‌ వంటి టిప్పింగ్‌ టూల్స్‌తో పాటు ఛానెల్‌ మెంబర్‌షిప్స్‌ వంటి సబ్‌స్క్రిప్షన్‌ టూల్స్‌ను సైతం పొందేందుకు వీలు పడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని