పిల్లలకి పాలల్లో పంచదార కలపొచ్చా?

నేను వర్కింగ్‌ మదర్‌ని. పాప వయసు ఏడాది. రుచి కోసమని పాలల్లో పంచదార కలిపి తాగిస్తున్నాం. పంచదార మంచిది కాదు, పటిక పంచదార కలపమని కొందరు. రెండూ వద్దని మరికొందరు చెబుతున్నారు. వీటిలో ఏది నిజం?

Updated : 15 Sep 2022 07:05 IST

నేను వర్కింగ్‌ మదర్‌ని. పాప వయసు ఏడాది. రుచి కోసమని పాలల్లో పంచదార కలిపి తాగిస్తున్నాం. పంచదార మంచిది కాదు, పటిక పంచదార కలపమని కొందరు. రెండూ వద్దని మరికొందరు చెబుతున్నారు. వీటిలో ఏది నిజం?

- రమణి, నెల్లూరు 

తీపి, ఉప్పు ఇవి మనం అలవాటు చేసుకునే రుచులు. కొందరికి తక్కువ మోతాదులో ఉన్నా ఎక్కువగా అనిపిస్తే, ఇంకొందరికి ఇవి చిన్నప్పట్నుంచీ అధిక స్థాయిలో తీసుకోవడంవల్ల సాధారణంగా ఉన్నా తక్కువ ఉన్నట్లు అనిపిస్తాయి. పంచదార.. శరీరానికి మరీ ముఖ్యమైన పోషకాలు అందించే ఆహారమైతే కాదు. పంచదార, పటిక పంచదార రెండింటిలో తేడా ఏమీ లేదు. రెండింటి తయారీ విధానం ఒక్కటే. ఆహారపుటలవాట్లు మొదలయ్యేది ఏడెనిమిది నెలల నుంచి రెండుమూడేళ్ల మధ్యనే. పాలలో సహజంగా లాక్టోజ్‌ అనే చక్కెర ఉంటుంది. వాటికి సహజమైన తియ్యదనం ఉంటుంది. వాటినే కాదు, వేటినైనా అలా సహజమైన రూపంలో తీసుకోవడం మేలు. అదనంగా చక్కెర చేర్చడంవల్ల చిన్నప్పట్నుంచీ పిల్లలకు ఎక్కువ మోతాదులో చక్కెర అలవాటు అవుతుంది. అది అధిక బరువుకి దారి తీయొచ్చు. పిల్లలు బరువు తక్కువగా ఉంటే చక్కెరకు బదులు తేనె, బెల్లం, పండ్లు లాంటివి ఆహారంలో భాగం చేస్తే మంచిది. ఐస్‌క్రీమ్‌, మిల్క్‌షేక్‌, జ్యూస్‌లలో కృత్రిమ చక్కెరల్ని చేర్చుతున్నారు. చిన్న పిల్లలే కాదు, పెద్ద పిల్లలూ ఆ రుచికి అలవాటు పడే ప్రమాదం ఉంది. దాంతో అరటి పండ్ల లాంటివీ తియ్యగా అనిపించవు వీళ్లకి. పాలలో పంచదార కలపడంవల్ల చిగుళ్ల సమస్య, దంత క్షయం వంటివీ వస్తాయి. నమిలేందుకు వీలైన ఆహారం, పండ్లు ఇవ్వాలి. అప్పుడు లాలాజలం ఊరి చెడు బ్యాక్టీరియా విడుదల తగ్గుతుంది. నమలడంవల్ల దవడలు బలంగా తయారవుతాయి. దంతాల తీరూ బాగా వస్తుంది. ఇవన్నీ చిన్నప్పట్నుంచీ అలవాటు చేయాలి. భారతీయుల్లో ఊబకాయం సులభంగా వస్తుంది. పిల్లలూ స్కూళ్లలో ఎక్కువ సేపు కూర్చోవడం, గ్యాడ్జెట్లకు అతుక్కుపోవడం వల్ల ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. పెద్దల అలవాట్లే పిల్లలకు వస్తాయి. మీరే ఈ విషయంలో వారికి ఆదర్శంగా ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని