గదిలో ఒంటరిగా.. అశ్లీల వీడియోలు చూస్తున్నాడు..!

మా అబ్బాయి ఈ మధ్య ఎక్కువగా ఫోన్‌లోనే గడుపుతున్నాడు. కొన్నిరోజుల క్రితం వాళ్ల స్కూల్ ప్రిన్సిపల్‌ కొంతమంది స్టూడెంట్స్‌ని కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేశారు. అందులో మా అబ్బాయి కూడా ఉన్నాడు. ఎందుకు చేశారని అడిగితే స్కూల్‌లో గొడవ పడడం వల్ల తీసేశారని చెప్పాడు.

Updated : 05 Apr 2024 15:39 IST

మా అబ్బాయి ఈ మధ్య ఎక్కువగా ఫోన్‌లోనే గడుపుతున్నాడు. కొన్నిరోజుల క్రితం వాళ్ల స్కూల్ ప్రిన్సిపల్‌ కొంతమంది స్టూడెంట్స్‌ని కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేశారు. అందులో మా అబ్బాయి కూడా ఉన్నాడు. ఎందుకు చేశారని అడిగితే స్కూల్‌లో గొడవ పడడం వల్ల తీసేశారని చెప్పాడు. కానీ, మరో టీచర్‌ని అడిగితే ఫోన్లలో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు ఒకరికొకరు పంచుకుంటున్నారని, పనిష్‌మెంట్ కింద సస్పెండ్ చేశారని చెప్పారు. ఈ మధ్య గదిలో ఒక్కడే ఎక్కువగా గడుపుతున్నాడు. ఫోన్‌కు పాస్‌వర్డ్‌ కూడా పెట్టుకున్నాడు. ఈ విషయాలేవీ నా భర్తకు తెలియవు. ఆయనకు తెలిస్తే వాడిని విపరీతంగా కొడతారు. ఈ పరిస్థితిని ఎలా డీల్‌ చేయాలో అర్థం కావడం లేదు. ఈ వయసులో పిల్లలకు సెక్స్‌ ఎడ్యుకేషన్‌ గురించి చెప్పడం మంచిదా? కాదా? ఒకవేళ చెప్పాలంటే ఎలా చెప్పాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. పేరెంటింగ్‌లో భాగంగా ‘సెక్స్‌ ఎడ్యుకేషన్‌’ గురించి చెప్పడం ఎంతో అవసరం. కౌమార వయసులో పిల్లలకు లైంగిక అంశాలకు సంబంధించిన సరైన సమాచారం తెలియడం లేదని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది. ఈ క్రమంలో పేరెంట్స్‌గా మీరు ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చిన్నారులకు శారీరక, మానసిక భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను మొదటగా చెప్పాల్సి ఉంటుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు ఈ విషయాలను వాయిదా వేయడం లేదా ఉద్దేశపూర్వకంగా చర్చించకపోవడం చేస్తుంటారు. కొంతమంది తరగది గదిలో టీచర్లే ఆ అంశాల గురించి చెబుతారని తేలిగ్గా తీసుకుంటారు.

లైంగిక విద్య అనేది నిరంతర ప్రక్రియ. మన దేశంలో చాలామంది దీనిని నిషిద్ధ అంశంగా భావిస్తుంటారు. లైంగిక విద్య అంటే కేవలం శృంగారం, కలయికకు సంబంధించిన అంశాలు మాత్రమే కాదు.. వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలు కూడా ఉంటాయి. సాధారణంగా పిల్లలు కౌమారంలోకి అడుగుపెట్టేసరికి వారి హార్మోన్లలో విపరీతమైన మార్పులు వస్తుంటాయి. ఈ క్రమంలో కొత్త అనుభవాలను పొందడానికి ఉవ్విళ్లూరుతుంటారు. ఆ ఉత్సాహంతోనే సంబంధిత సమాచారం కోసం ఆసక్తిగా వెతుకుతుంటారు. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు ఇలాంటి అవసరాలను సులభంగా తీరుస్తున్నాయి. ఇందులో భాగంగానే మీ అబ్బాయి గదిలో ఒంటరిగా ఎక్కువసేపు ఉంటున్నాడని అర్థమవుతోంది. అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్యకరమైన సమాచారానికి, అలవాట్లకు బానిసయ్యే ప్రమాదం ఉంది.

ఈ క్రమంలో సాధారణంగా ఇలాంటి అంశాలు పిల్లలతో నేరుగా మాట్లాడడం కంటే ఏదైనా పని చేసేటప్పుడు మాట్లాడడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ అబ్బాయితో సాధ్యమైనంత మేరకు క్యాజువల్‌గా మాట్లాడడానికి ప్రయత్నించండి. సాధారణంగా ఈ వయసులో శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పుల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక ఫ్రెండ్ మాదిరిగా తెలియజేయాలి. వయసు రీత్యా వచ్చే మార్పులను అర్ధం చేసుకుని, సరైన దారిలో నడవాల్సిన అవసరం గురించి అర్ధమయ్యేలా వివరించాలి. సాధ్యమైనంతవరకు మీ దంపతులిద్దరూ ఈ చర్చల్లో భాగస్వాములు కావాలి. అలాగే అతను చెప్పే విషయాలను కూడా జాగ్రత్తగా వినండి. అతని అభిప్రాయాలను కూడా ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. ఇలా మీరు చెప్పాలనుకున్న విషయాలను సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉందని భావిస్తే కొన్ని క్లినిక్‌లలో లైంగిక విద్యకు సంబంధించిన పాఠాలు చెబుతుంటారు. మీ అబ్బాయికి వాటి ద్వారా అయినా ఈ విషయాల గురించి అర్ధమయ్యేలా చెప్పించవచ్చు. అలాగే పిల్లలు అశ్లీల కంటెంట్‌ చూడకుండా పేరెంటల్‌ కంట్రోల్‌ ఫీచర్స్‌ని తల్లిదండ్రులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మీ అబ్బాయి అంశంలో కూడా వీటిని ప్రయత్నించి చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్