బాస్‌ వివాహేతర సంబంధం.. అతడితో చెప్పాలా? వద్దా?

నేను ఓ సంస్థలో ఐదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాను. మా బాస్ కూడా మహిళే. ఈ ఐదేళ్లలో తనతో మంచి స్నేహబంధం ఏర్పడింది. ఎంతలా అంటే తన ఇంట్లో ఏ అకేషన్‌ ఉన్నా తను నన్ను ఆహ్వానిస్తుంటారు. అలా ఆమె భర్త కూడా నాకు మంచి ఫ్రెండ్‌ అయ్యారు. నన్నో తోబుట్టువులాగా పలకరిస్తుంటారు.

Updated : 22 Apr 2024 16:59 IST

(Representational Image)

నేను ఓ సంస్థలో ఐదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాను. మా బాస్ కూడా మహిళే. ఈ ఐదేళ్లలో తనతో మంచి స్నేహబంధం ఏర్పడింది. ఎంతలా అంటే తన ఇంట్లో ఏ అకేషన్‌ ఉన్నా తను నన్ను ఆహ్వానిస్తుంటారు. అలా ఆమె భర్త కూడా నాకు మంచి ఫ్రెండ్‌ అయ్యారు. నన్నో తోబుట్టువులాగా పలకరిస్తుంటారు. అయితే మా బాస్‌కు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ఈమధ్యే నాకు మూడో వ్యక్తి ద్వారా తెలిసింది. ఈ విషయం ఆమె భర్తకు తెలియదు. అతనికి ఇలా అన్యాయం జరుగుతుండడంతో నా మనసు మథనపడుతోంది. మా బాస్‌ అక్రమ సంబంధం గురించి నేను ఆమె భర్తతో చెప్పనా? వద్దా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ బాస్‌కి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని మీకు తెలిసిందంటున్నారు. దీనివల్ల ఆమె భర్తకు అన్యాయం జరుగుతుందని మీరు బాధపడుతున్నారు. అయితే మీ బాస్‌, ఆమె భర్తతో మీకున్న అనుబంధం వల్ల.. ఈ విషయం మిమ్మల్ని బాధించి ఉండచ్చు. కానీ ముందుగా మీరు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన అంశాలన్నీ పూర్తిగా మీ బాస్‌ వ్యక్తిగతమైనవి. ఆమె వైవాహిక బంధంలో, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా దానికి మీరు బాధ్యులు కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది మీకు సంబంధం లేని అంశం కూడా! మీ బాస్‌ ఎవరితో మాట్లాడాలి? ఎలా ఉండాలనేది ఆమె వ్యక్తిగతం. ఆమె బయటి సంబంధాల గురించి తన భర్తకు చెప్పాలా? వద్దా? అనేది కూడా ఆమె సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం.

ఓ బంధాన్ని నిలబెట్టాలన్న మీ ఆలోచన మంచిదే కావచ్చు.. కానీ ఈ విషయంలో మీరు అతిగా ఆలోచిస్తున్నారనిపిస్తోంది. అలాగే మీ బాస్‌ వివాహేతర సంబంధం గురించి మీకు తెలిసింది కూడా మూడో వ్యక్తి ద్వారానే! దానికి తగ్గ కచ్చితమైన ఆధారాలు కూడా మీ వద్ద లేవు. అలాంటిది తొందరపడి ఈ విషయాన్ని ఆమె భర్తతో చెప్పడం వల్ల వాళ్లిద్దరి మధ్య కలతలకు కారణమైన వారవుతారు. ఒకవేళ ఇందులో నిజం లేకపోతే మీరే దోషిగా నిలబడాల్సి రావచ్చు. కాబట్టి, మీ బాస్‌ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకుండా తనకు ప్రైవసీ ఇవ్వడం ముఖ్యమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్