ఆ అమ్మాయిలు తిరిగొస్తారా?

దేశంలో రాజకీయ, ఆర్థిక, మత పరమైన సమస్యలు, అలజడులు ఎక్కడ చెలరేగినా... మొదట బాధితులయ్యేది మహిళలే. నైజీరియాలో ఈ సమస్య మరింత ఎక్కువ. తీవ్రవాద గ్రూపులు, మతపరమైన ఘర్షణలు, అంతర్గత రాజకీయ కుమ్ములాటల్లో నిత్యం వందల మంది ఆడపిల్లలు అదృశ్యమవుతుంటారు.

Published : 26 Apr 2024 02:03 IST

దేశంలో రాజకీయ, ఆర్థిక, మత పరమైన సమస్యలు, అలజడులు ఎక్కడ చెలరేగినా... మొదట బాధితులయ్యేది మహిళలే. నైజీరియాలో ఈ సమస్య మరింత ఎక్కువ. తీవ్రవాద గ్రూపులు, మతపరమైన ఘర్షణలు, అంతర్గత రాజకీయ కుమ్ములాటల్లో నిత్యం వందల మంది ఆడపిల్లలు అదృశ్యమవుతుంటారు. అలా 2014 ఏప్రిల్‌ 14న ఈశాన్య నైజీరియాలోని బోకో హరామ్‌ అనే ఉగ్రవాద సంస్థ చిబోక్‌లోని పాఠశాల వసతి గృహం నుంచి 276 మంది విద్యార్థినులను కిడ్నాప్‌ చేసింది. అదృష్టవశాత్తూ 57 మంది ట్రక్‌ నుంచి దూకి తప్పించుకున్నారు. మిగిలిన వారి ఆచూకీ తెలియలేదు. దీంతో తమ పిల్లల్ని రక్షించమంటూ, ఇందుకు అవకాశం ఉన్న ప్రతి మార్గాన్నీ ప్రభుత్వం వినియోగించుకోవాలని కోరుతూ... ‘బ్రింగ్‌ బ్యాక్‌ అవర్‌ గర్ల్స్‌’ ఉద్యమం మొదలైంది. దీన్ని అప్పటి నైజీరియా విద్యా మంత్రి ఒబియేజిలి ఎజెక్వేసిలీ ప్రారంభించారు. నైజీరియా ప్రజలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ మద్దతు కూడగట్టుకుంది. హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్‌ అయ్యి... ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని చేరుకుంది. దీంతో ‘బాలికల గౌరవాన్ని కాపాడండి. భద్రత కల్పించండి’ అంటూ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్‌ ఒబామాతో సహా పలువురు ప్రపంచ నాయకులు ‘బ్రింగ్‌ బ్యాక్‌ అవర్‌ గర్ల్స్‌’ మూమెంట్‌కి అండగా నిలబడ్డారు. దీంతో అక్కడి ప్రభుత్వంలో కదలిక మొదలై పలు చర్యలను తీసుకుంది. 2017లో తీవ్రవాదులకు మిలియన్‌ డాలర్లు ముట్టచెప్పి 82 మందిని విడుదల చేయించగలిగింది. తరవాత ఒకరిద్దరు తప్పించుకుని బయటపడ్డారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా... ఇంకా సమస్య మిగిలే ఉంది. ఇప్పటికీ 82 మంది ఆచూకీ తెలియలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 14కి ఈ సంఘటన జరిగి పదేళ్లవుతున్నా... నిరసనకారులు తమ పోరాటాన్ని ఆపలేదు. అయితే, తమ ప్రయత్నం కిడ్నాప్‌ అయిన అమ్మాయిల్ని కాపాడటమే కాదు... అంతర్జాతీయ స్థాయిలో చర్చకు అవకాశం కల్పించడం, మహిళల్లో చైతన్యం కలిగించడం, లైంగిక హింస నిరోధానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కూడా అంటారు ఒబియేజిలి. తాజాగా పదేళ్ల తరవాత... గర్భిణిగా ఉన్న లిడియా సైమన్‌ ఆమె ముగ్గురు పిల్లలనూ రక్షించారు. దీంతో మరోసారి ఈ ఉద్యమానికి సామాజిక మాధ్యమాల్లో స్పందన కనిపిస్తోంది. ఇది స్త్రీలకు మెరుగైన జీవితాన్ని అందించేంత బలంగా మారాలని మనమూ కోరుకుందాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్