ఎలా తింటున్నారు

మహిళలు మానసికంగా ఎంత బలంగా ఉన్నా... శారీరకంగా కాస్త బలహీనంగా ఉంటారు. దీనికి సమతులాహారాన్ని తీసుకోకపోవడం, తిండి వేళలు పాటించకపోవడం వంటి చాలా కారణాలే ఉన్నాయి.

Published : 27 Apr 2024 01:18 IST

మహిళలు మానసికంగా ఎంత బలంగా ఉన్నా... శారీరకంగా కాస్త బలహీనంగా ఉంటారు. దీనికి సమతులాహారాన్ని తీసుకోకపోవడం, తిండి వేళలు పాటించకపోవడం వంటి చాలా కారణాలే ఉన్నాయి. సాధారణంగా శక్తి ఉత్పత్తి కావాలంటే... ఇంధనం అవసరం. మనకు అది ఆహారం ద్వారా అందుతుంది. అదెలాగో చూద్దామా!

టిఫిన్‌ తినడం లేదా... రోజులో వ్యక్తులకు అవసరమైన కీలకమైన పోషకాలు అల్పాహారం నుంచే అందుతాయట. కానీ పని ఒత్తిడితో దాన్ని మానేయడం వల్ల నిస్సత్తువ, అలసట వంటివి దరిచేరతాయి. ఫలితంగా ఆ ప్రభావం మధ్యాహ్న భోజనం, సాయంత్రం తినే స్నాక్స్‌పై పడి మితిమీరి తినే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఫలితంగా మధుమేహం, అధిక బరువు వంటి సమస్యల ముప్పు పొంచి ఉందట. అందుకే దోశ, ఇడ్లీ, పోహా, గుడ్డు, పాలు... ఇలా ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకోవాలి. దాంతో పాటు ఓ పండో, జ్యూసో తాగితే మేలట. రాత్రి పూట మాత్రం ఆహారాన్ని కాస్త మితంగా తీసుకోవడం మంచిది.

 పిట్టలా తినండి...  ఆకలి వేయకపోయినా... కొందరు ఏదో ఒకటి తరచూ తినడానికి అలవాటు పడుతుంటారు. ఇంకొందరు ఒత్తిడిలోనూ అతిగా తినేస్తుంటారు. మీకూ ఈ అలవాటు ఉంటే మానుకోండి. అంతేకాదు, ఒకేసారి పెద్ద మొత్తంలో తినొద్దు. పిట్టలా రోజుకి ఆరేడు సార్లు తక్కువ మోతాదులో తింటే సరి. దీనివల్ల థైరాయిడ్‌ ఇబ్బందులే కాదు, అధికబరువు, బీపీ, షుగర్‌ వంటివన్నీ నియంత్రణలో ఉంటాయి. ఇది పాటించినా మానుకోలేకపోతున్నారంటే... జంక్‌ఫుడ్‌ స్థానంలో మీ ఫ్రిజ్‌లో పండ్లు, నట్స్‌ వంటివి పెట్టేయండి. చిరుతిళ్లు అందుబాటులో లేకపోతే... ప్రత్యామ్నాయాల వైపు చూస్తాం కదా! ఫలితంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పోషకాలూ అందుతాయి.

 ఆకలి అనుకుని... శరీరం డీహైడ్రేట్‌ అయినప్పుడు కలిగే భావనను చాలామంది ఆకలిగా పొరబడుతుంటారట. దీంతో అవసరం లేకపోయినా తినడం మొదలుపెడతారు. ఇది అధిక బరువుకి కారణం అవుతుంది. ఇలా కాకూడదంటే ఆకలి అనిపించినప్పుడు ముందు ఓ గ్లాసు మంచినీళ్లు తాగండి. ఇది జీర్ణశక్తితో పాటు ఇతర అవయవాల పని తీరునీ మెరుగుపరుస్తుంది. ఫలితంగా రోజంతా చురుగ్గా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్