close
ఇంటర్వ్యూ
ఉదయభాను విషయంలో వార్నింగ్‌లు వచ్చాయి

ఆ సాంగ్‌ చేస్తుంటే అక్క చనిపోయిందని ఫోన్‌ వచ్చింది

డ్యాన్స్‌ అంటే ధమ్‌ రిధమ్‌.. ఆ రెండూ అతనిలో  ఉన్నాయి.
డ్యాన్స్‌ అంటే మాస్‌.. క్లాస్‌ ఆ రెండూ అతను చూపిస్తాడు.
డ్యాన్స్‌ అంటే రచ్చ రచ్చ అని ఆయన నిరూపించాడు. 
ఉదయించే భాస్కరుడు  వెలిగిస్తాడు.. ఉర్రూతలూగించే ఈ బాబా భాస్కర్‌ డ్యాన్స్‌తో అందరి హృదయాలను గెలుస్తాడు. తెలుగు, తమిళ భాషల్లో 200లకు పైగా చిత్రాలకు నృత్యాలు సమకూర్చిన ఆయన ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదాగా సంగతులు పంచుకున్నారు.

ఎవరైనా తమ పేరు పక్కన తల్లిదండ్రుల పేర్లు పెట్టుకుంటారు కానీ, మీరేంటి మీ తమ్ముడి పేరు పెట్టుకున్నారు?
బాబా భాస్కర్: న్యూమరాలజీ ప్రకారం తమ్ముడి పేరు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు అందుకే పెట్టుకున్నా. ఇంకో విషయం ఏంటంటే.. సాయిబాబాని నా తమ్ముడిగా భావిస్తా. అందుకే ఆయన పేరు పెట్టుకున్నా. (మధ్యలో ఆలీ అందుకుని.. రజనీకాంత్‌ బాబా చూసి ఆ పేరు పెట్టుకున్నారేమో అనుకున్నాం... నవ్వులు)

రజనీకాంత్‌తో ఏదైనా పాట చేశారా?
బాబా భాస్కర్: అసిస్టెంట్‌గా  ఉండగా ‘శివాజీ’లో ఓ పాట చేశా. మాస్టర్‌ అయ్యాక.. మాస్టర్‌గా ‘రోబో’కు పనిచేశా. అందులో కిలిమంజారో పాట కోసం ఐశ్వర్యారాయ్‌ను చూసుకోవడానికి ఒక అసిస్టెంట్‌ కావాలి.. రజనీసర్‌ను చూసుకోవడానికి ఇంకో అసిస్టెంట్‌ కావాలి. ఇక అది గ్రూప్‌ డ్యాన్స్‌ కదా ఆ మొత్తం గ్రూప్‌ను చూసుకోవడానికి నేనైతే బాగుంటుందని రాజు సుందరం నన్ను తీసుకెళ్లారు. 

మీరు ఎవరెవరి దగ్గర అసిస్టెంట్‌గా చేశారు?
బాబా భాస్కర్: నేను ఐదుగురు మాస్టర్ల దగ్గర అసిస్టెంట్‌గా చేశా, శివ శంకర్‌, దినేశ్‌, కల్యాణ్‌, చివరిగా రాజు సుందరం దగ్గర చేశా. 

మాస్టర్‌గా మీ తొలి చిత్రం ఏది?
బాబా భాస్కర్: ధనుష్‌ నటించిన ‘తిరివిలియాడం’. ఆయనతో ఎక్కువ సినిమాలు చేశా. నాపై ఆయనకు నమ్మకం ఉంది. ఇప్పటివరకూ దాదాపు 200లకు పైగా పాటలకు డ్యాన్స్‌ కంపోజ్‌ చేశా.

చిరంజీవి సినిమాకు డ్యాన్స్‌ మాస్టర్‌గా చేయలేదా?
బాబా భాస్కర్: నేను మాస్టర్‌ అయ్యే సమయానికి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. దాంతో కుదరలేదు. అయితే, అసిస్టెంట్‌గా ‘స్టాలిన్‌’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ చిత్రాలకు పనిచేశా. 

మీకు బాగా పేరు తీసుకొచ్చిన చిత్రం?
బాబా భాస్కర్: సూర్య నటించిన ‘సింగం’ చిత్రానికి నాకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వచ్చింది. అందులో ‘ఊల్లే ఉలేలే.. ప్రేమ చీమ కుట్టేలే’పాట కంపోజ్‌ చేశా. నాకు నా తల్లిదండ్రులు దైవంతో సమానం. ఇప్పుడు నా భార్య కూడా. ఎందుకంటే నాతో నడిచి కష్టాలు పడి, నా ఫీలింగ్స్‌ను అర్థం చేసుకుంది. నా తొలి అవార్డు నా తండ్రి తీసుకోవాలని కోరుకున్నా. అలాగే జరిగింది.

మీ సొంతూరు ఏది?
బాబా భాస్కర్: నేను పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే. నాన్న రాజకీయాల్లో ఉండేవారు. వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు. కొంతకాలం కిందట కన్నుమూశారు. నాకు ముగ్గురు అక్కలు.. ఒక తమ్ముడు. ఇద్దరు అక్కలకు పెళ్లయింది. మరో అక్క చనిపోయారు. తమ్ముడు బిల్డర్‌గా పనిచేస్తున్నాడు. నాకు ఇద్దరు పిల్లలు.

మీరు ఏం చదువుకున్నారు?
బాబా భాస్కర్: నేను తొమ్మిదో తరగతి ఫెయిల్‌. 

కొరియోగ్రాఫర్‌గా ఉంటూ సడెన్‌గా డైరెక్షన్‌ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?
బాబా భాస్కర్: నాకు సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే నేనెప్పుడూ సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక విభాగంలో ఉండాలని అనుకున్నా. కొరియోగ్రఫీ చేస్తూనే దర్శకత్వం వహించాలనుకున్నా. కొత్తకొత్త విషయాలను నేర్చుకోవాలని అనుకుంటా.

బాబా భాస్కర్‌ గడ్డం ఎందుకు పెంచుతారు? 
బాబా భాస్కర్: ఇలాంటి విషయాలపై నేను పెద్దగా శ్రద్ధ పెట్టను. నేను గడ్డం పెంచుకుని తిరుగుతుంటే నాన్న ‘ఏంటిరా ఈ వేషం. శుభ్రంగా షేవ్‌ చేసుకోవచ్చు కదా’ అని అనేవారు. దాంతో నేను నడుచుకుంటూ తిరుపతి వెళ్లి  గుండు చేయించుకుని వచ్చే వాడిని. మళ్లీ ఏడాది వరకూ నా జట్టు గురించి అస్సలు పట్టించుకునే వాడిని కాదు. ఇప్పటికీ అదే జరుగుతుంది. 

ఇండస్ట్రీలో పైకి రావాలంటే.. ఎదుటి వాడిని తొక్కాలి.. లేదా మొక్కాలి.. మీరు ఏ టైపు?
బాబా భాస్కర్: రెండూ కాదు. నా పని ఏదో నాది. నా క్యారెక్టర్‌ను నేను మార్చుకోలేదు. అలా మార్చుకుని ఉంటే ఇప్పటికి నేను 1000కు పైగా పాటలు చేసి ఉండేవాడిని. చాలా మందికి నా క్యారెక్టర్‌ నచ్చలేదు. మనం ఏంటో మనం తెలుసుకుని వెళ్లాలి.  మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాష్‌ హీరోగా ‘కుప్పత్తిరాజా’ సినిమా తీశా. అందులో ‘మనం నలుగురి కోసం ఉండాలి.. లేదా మనకోసం నలుగురు ఉండాలి’ ట్రైలర్‌లో ఇదే నా మొదటి డైలాగ్‌. సినిమా యావరేజ్‌గా ఆడింది. 

చాలా మంది డబ్బుల కోసం పని చేస్తారు.. మీరేంటి అవార్డులు వస్తే చాలనుకుంటారట!
బాబా భాస్కర్: సినిమా, సినిమా చరిత్ర అనే పుస్తకాలు ఉన్నాయనుకోండి. సినిమా పుస్తకంలో నా పేరు వచ్చింది. కానీ, చరిత్రలో చివరిలోనైనా నా పేరు ఉండాలన్నది నా కల. ఇప్పటివరకూ నాకు ఐదు అవార్డులు వచ్చాయి. అది నాకు దక్కిన గుర్తింపు. ఒకవేళ నేను పోయినా, నా బిడ్డలు ఆ అవార్డులను చూసి, ‘ఇది నా తండ్రి సంపాదించినవి’ అనుకోవాలి. అంటే మనం పోయినా, ఆ అవార్డుల రూపంలో బతికి ఉంటామని తెలుసుకున్నా. 

పెళ్లికి ముందు గిఫ్ట్ ఇచ్చిన మీరు ఆ తర్వాత ఒక్క గిఫ్ట్‌ కూడా ఇవ్వలేదని మీ భార్య కంప్లయింట్‌ చేశారు నిజమేనా?
బాబా భాస్కర్: అలా అంటారేంటి సర్‌.. ఒక పాప.. ఒక బాబుని గిఫ్ట్‌గా ఇచ్చాను కదండీ!(నవ్వులు) దాని కన్నా పెద్ద గిఫ్ట్‌ ఏముంటుంది. 

అసలు మీది లవ్‌ మ్యారేజా.. అరేంజ్డ్‌ మ్యారేజా!
బాబా భాస్కర్: లవ్‌ కమ్‌ రన్నింగ్‌ మ్యారేజ్‌. అంటే ప్రేమించి అమ్మాయిని పట్టుకుని రన్నింగ్‌. (నవ్వులు) నా పెళ్లి హైదరాబాద్‌ బిర్లామందిర్‌లో జరిగింది. నా భార్య కూడా డ్యాన్సర్‌. ఇద్దరం ప్రేమించుకున్నాం. ఏడు నెలల పాటు వెంటపడి ప్రపోజ్‌ చేస్తే, నన్ను ‘అన్నయ్యా...’ అని పిలిచింది. ఈ మాట విన్న ఎవరైనా అక్కడికక్కడే చచ్చిపోతారు. కానీ, బాబా భాస్కర్‌ను కసి పెంచింది అదే! అంతే, మూడు నెలలు తిరిగే సరికి.. ‘అన్నయ్యా..’ అని పిలిచిన నోటితోనే.. ‘ఐ లవ్‌ వ్యూ’ అని పిలిచేలా చేశా. మొదట్లో నాకు తెలియక తను ఎప్పుడు ఫోన్‌ చేసినా, ‘బాగున్నావా’, ‘భోజనం చేశావా’, ‘నిద్రపోయావా’, ‘ఎక్కడ ఉన్నావ్‌’ ఇవే ప్రశ్నలు.. తను ఏం చెప్పినా ‘ఆఁ తర్వాత.. తర్వాత’ అని అంటుండేవాడిని. అప్పటి నుంచి తను పట్టించుకోవడం మానేసింది. దీంతో నేనొక ప్లాన్‌ వేశా. అది కాస్తా ఫలించింది. ఎంతలా అంటే తను నాతో హైదరాబాద్‌ వచ్చేటప్పుడు తన బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకొచ్చింది. ఎందుకంటే, ఇప్పుడు కనుక వీడిని పెళ్లి చేసుకోకపోతే మనల్ని వదిలేసి వెళ్లిపోతాడని అనుకుంది. అమ్మాయిలు మనం ఏది చెబితే దానికి రివర్స్‌ అంటూ ఉంటారు. తను పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నేను కెరీర్‌ గురించి మాట్లాడేవాడిని. ‘లేదు మనం తప్పకుండా పెళ్లి చేసుకోవాలి’ అని చెప్పేది. దాంతో అమీర్‌పేట్‌లో ఆటో ఎక్కి రాత్రి 9గంటలకు బిర్లా మందిర్‌కు వెళ్లాం. అప్పటికే తలుపులు మూసేశారు.దీంతో ఆ పక్కనే చిన్న అమ్మవారి గుడి ఉంటే పసుపు కొమ్ము మెడలో కట్టేశా. తన కళ్ల వెంట ఒకటే నీళ్లు. నాకు ఒక్క చుక్క కూడా రాలేదు. పెళ్లయిన తర్వాత తనని మా ఇంటికి తీసుకెళ్తే, బయటకు పొమ్మన్నారు. దీంతో తనని తీసుకుని వేరే కాపురం పెట్టా. తను ప్రెగ్నెంట్‌ అని తెలిసిన తర్వాత అందరూ నెమ్మదిగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఇప్పుడు అంతా హ్యాపీయే.

మీరు షూటింగ్‌కు వెళ్లిన ప్రతి దేశంలో మీ పాస్‌పోర్ట్‌ పోతుందట!
బాబా భాస్కర్: ‘రోబో’ కోసం బ్రెజిల్‌ వెళ్లాల్సి వచ్చింది. దాదాపు ఏడు విమానాలు మారి చివరకు సావోపోల్‌ నుంచి బయలు దేరాం. విమానంలో నా ఎదురుగా సీటుకు ఉన్న పౌచ్‌లో నా పాస్‌పోర్ట్‌ పెట్టి దిగేటప్పుడు తీసుకోవచ్చులే అని ప్రశాంతంగా కూర్చొన్నా. సడెన్‌గా ఒక అమ్మాయి ఒంటి నిండా నగలు, చేతికి ఉంగరాలు పెట్టుకుని వచ్చింది. అందరి దృష్టి తనపైనే ఉంది. నేను కూడా తనని చూస్తూ ఉండిపోయాను. అయితే తను ఒక ట్రాన్స్‌జెండర్‌. ఆమె విమానం దిగి వెళ్తుంటే నేను కూడా ఆమెను చూస్తూ విమానం దిగి వెళ్లిపోయా. బయటకు వచ్చి సగం దూరం వెళ్లిన తర్వాత పాస్‌పోర్ట్‌ మర్చిపోయానన్న సంగతి గుర్తుకొచ్చింది. ఈ విషయం మా చిత్ర బృందానికి చెబితే అందరూ నన్ను కోపంగా చూశారు. ఆ తర్వాత అక్కడకు మన దేశ రాయబారి ఒకరు ఐశ్వర్యారాయ్‌ను చూడటానికి వస్తే, నా గురించి ఆయనకు చెప్పారు. మరుసటి రోజు ఆయన నాకు పాస్‌పోర్ట్‌ ఇప్పించారు. కానీ, నా కారణంగా చిత్ర బృందం చాలా అప్‌సెట్‌ అయింది. 

గురువుకు మనం చాలా గౌరవం ఇస్తాం. అలాంటి మీకు గురువైన రాజుసుందరంతో గొడవ పడ్డారా?
బాబా భాస్కర్: నా గురువంటే నాకు ఇప్పటికీ గౌరవమే. దేవుడు, తల్లిదండ్రులు తర్వాత గురువే. నేను డ్యాన్స్‌ నేర్చుకునే సమయంలో శివ శంకర్‌ మాస్టర్‌కు అన్ని పనులు చేసి పెట్టేవాడిని. అలాగే రాజు సుందర్‌ మాస్టర్‌ అంటే ప్రేమ. మా పరిచయం మొదట గొడవతోనే మొదలైంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆయన  ఎక్కడికి వెళ్లినా నన్ను తీసుకెళ్లేవారు. ఐదేళ్ల పాటు ఇద్దరం కలిసి ప్రయాణించాం. ‘నీ గోల్‌ ఏంటి?’ అని ఆయన అడిగితే ‘నేను ఎప్పటికైనా మాస్టర్‌ అవ్వాలి. మీ కన్నా ఒక మెట్టు పైన ఉండాలి’ అని చెప్పేవాడిని.  ఆయన కింద నుంచి పైకి ఒక లుక్‌ ఇచ్చారు. అప్పటి నుంచి  ఏ విషయమైనా కొట్టి చెప్పేవారు. అయినా, ఆనందంగా నేర్చుకున్నా. ఎవరు చెప్పారో.. ఏం చెప్పారో నామీద లేనిపోనివి ఆయనకు చెప్పారు. దాంతో అప్పటి నుంచి ఆయన నన్ను రావొద్దని, తన కళ్లకు కనిపించవద్దని చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పటికీ చెబుతున్నా ‘మాస్టర్‌.. మీరంటే నాకు ప్రేమ గౌరవం’

ముగ్గురు అక్కల్లో ఒకామె చనిపోతే చూడటానికి కూడా వెళ్లలేదట. 
బాబా భాస్కర్: నేను గొప్ప డ్యాన్స్‌ మాస్టర్‌ని కావాలని నా తండ్రి, అక్క అనుకునేవాళ్లు. మొదట్లో 80మంది ఉన్న డ్యాన్స్‌ గ్రూప్‌లో నేను చివరి వాడిని. ఒక్కో లైన్‌ దాటుకుంటూ హీరో పక్కన డ్యాన్సర్‌గా ఉండాలంటే చాలా కష్టపడాలి. నేను నిత్యం అందుకోసం కష్టపడుతుంటే వాడిని. ‘రేయ్‌ ఇక్కడ పల్టీ కొట్టాలి ఎవరు కొడతారు’ అంటే టక్కున నేను లేచే వాడిని. అలాగే, పై నుంచి దూకాలన్నా, డప్పు కొట్టాలన్నా పాటలో ప్రత్యేకంగా ఏది చేయాలన్నా ముందు నేను ఉండేవాడిని. అలా నేను అనుకున్న రోజు వచ్చింది. నాగార్జున-సౌందర్య కలిసి నటించిన ఒక సినిమాలో ఆయన పక్కనే డ్యాన్సర్‌గా కనిపించే అవకాశం వచ్చింది. నేను సంతోషంలో ఉన్నా. రిహార్సల్స్‌ కూడా చేశాం. షూటింగ్‌ వెళ్తున్నామనగా, ‘అక్క చనిపోయింది’ అంటూ ఇంటి నుంచి ఫోన్‌. ఏం చేయాలో అర్థం కాలేదు. నా అక్క చనిపోయినా, నాతోనే ఉంటారని నాకు నమ్మకం. అందుకే అమ్మకు ఫోన్‌ చేసి, ‘అమ్మా.. అక్క ఎప్పుడూ నాతోనే ఉంటారు. నేను ఇప్పుడు చేయబోయే పాట నా భవిష్యత్‌కు, నా లక్ష్యాన్ని చేరుకునేది’ అని బాధతోనే చెప్పా. ఆతర్వాత నాగ్‌సర్‌ పక్కన ఆ పాట చేసి మంచి పేరు తెచ్చుకున్నా. 

రజనీకాంత్‌ మీకు గోల్డ్‌ చైన్‌ గిఫ్ట్‌ ఇచ్చారట!
బాబా భాస్కర్: రజనీ సర్‌ సాంగ్‌ సగం వింటారు. మిగిలిన సగం డ్యాన్స్‌ మాస్టర్‌ చెప్పే ‘వన్‌.. టూ.. త్రీ.. ఫోర్‌.. వన్‌.. టూ.. త్రీ.. ఫోర్‌..‌’  ఇలా కౌంట్‌ని వింటారు. అలా ఒకరోజు చెబుతుంటే నాకు విపరీతమైన దగ్గు వచ్చింది. ‘భాస్కర్‌ పర్వాలేదా.. చెప్పగలరా’ అని కేర్‌ తీసుకుని అడిగేవారు. ఒక రోజు నేను ఒక షాప్‌ ముందు సిగరెట్‌ తాగుతూ ఉన్నా. రజనీసర్‌ కారులో అటువైపు నుంచే వెళ్లారట. అప్పుడు ఆయన మేనేజర్‌ ఫోన్‌ చేసి, ‘భాస్కర్‌.. ఏంటి సిగరెట్‌ తాగుతున్నావట. సర్‌ చూశారు..’ అనగానే చేతిలో ఉన్న సిగరెట్‌ అక్కడే పడిపోయింది. ‘సర్‌ ఎక్కడ ఉన్నారు’ అని అడిగితే, ‘ఇప్పుడు ఇంటికి వచ్చారు. రేపు నిన్ను ఒకసారి రమ్మన్నారు’ అని చెబితే, ‘పాట చేసే అవకాశం ఇస్తారేమో అనుకున్నా. సాంగ్‌ చేసేటప్పుడు ఆయనను కనిపెట్టి పాట చేసినందుకు గిఫ్ట్‌గా నా మెడలో గోల్డ్‌చైన్‌ వేశారు. 

శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ చేస్తున్నప్పుడు సాంగ్‌ మధ్యలో ఆస్ప్రతికి వెళ్లాల్సి వచ్చిందట!
బాబా భాస్కర్: చిరంజీవి సర్‌ పక్కన నేను చేస్తున్నా. విపరీతమైన చెమటలు పట్టి, నీరసం అయిపోయా. వెంటనే ఆస్పత్రికి వెళ్లా. ఫాస్ట్‌గా సెలైన్‌ ఎక్కించుకుని మళ్లీ వచ్చేశా. సినిమా అంటే అంత పిచ్చి.

మీరు ఏదైనా మూమెంట్‌ చెప్పినప్పుడు ‘ఈ స్టెప్‌.. అవసరమా’ అని ఎవరైనా అన్నారా?
బాబా భాస్కర్: దేవుడి దయ వల్ల ఇప్పటివరకూ ఎవరూ అలా అనలేదు. కానీ, పేకప్‌ చెప్పడానికి ముందు ఏదైనా కష్టమైన స్టెప్‌ ఇస్తే మాత్రం. ‘ఇప్పుడు ఇంత కష్టమైన స్టెప్‌ అవసరమా’ అని అనేవారు. నేను మాత్రం కచ్చితంగా చేయాలి అంటే రిహార్సల్స్‌ చేసి వెళ్లి, డ్యాన్స్‌ చేసేవారు.

ఒక యాంకర్‌ కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవారట ఎవరా యాంకర్‌? ఆమె విషయంలో మీ వైఫ్‌ కూడా వార్నింగ్‌ ఇచ్చారట! 
బాబా భాస్కర్: (నవ్వులు) తప్పుడు సమాచారం. అయితే ఉదయభాను విషయంలో మాత్రం మా ఆవిడ వార్నింగ్‌ ఇచ్చింది.(నవ్వులు) మేమిద్దరం కలిసి ‘ఢీ2’కు యాంకరింగ్ చేశాం. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అందరూ అనుకునేవాళ్లు. అలాంటిది ఏమీ లేదు. ఇద్దరం గాడ్‌ అండ్‌ డెవిల్‌లా ఉండేవాళ్లం. నేను గాడ్‌.. తను డెవిల్‌(నవ్వులు). స్టేజ్‌పై మా మధ్య జరిగే సరదా గొడవలు నా భార్యకు వేరేలా అర్థమయ్యేవి. ‘ఏంటీ ఎప్పుడూ ఆ అమ్మాయితో కలిసి ఉంటావు. చేతులు పట్టుకుంటావు’ అని అడిగేది. సాధారణంగా ఏదైనా షోకు డ్యాన్స్‌ చేసేటప్పుడు చేతులు పట్టుకుంటాం. దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటే మనం ఏమీ చేయలేం. నేను కాస్త ఓవరాక్షన్‌ చేస్తున్నానని మా ఆవిడ సరదాగా వార్నింగ్‌ ఇచ్చిన మాట వాస్తవం(నవ్వులు) అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు.

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం

శివ శంకర్‌మాస్టర్‌: గాడ్‌
రాజు సుందరం: గ్రేట్‌ 
డ్యాన్స్‌: ప్రాణం
వైఫ్‌: భార్య గురించి చెప్పడానికి మాటలు లేవు. వాళ్లు దేవుడుకన్నా గొప్పవాళ్లు. (ఈ షోకు వచ్చినప్పుడు నా భార్య ఇలాగే చెప్పమంది.. నవ్వులు)
బిర్లా టెంపుల్‌: లైఫ్‌ ఛేంజ్‌
ఉదయ భాను: గుడ్‌
ధనుష్‌: ఫైటర్‌
బాబా: తమ్ముడు 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.