Published : 12 Sep 2021 01:18 IST

ఏకదంతుడికి అరుదైన ఆలయాలు!

తొలిపూజలు అందుకునే ఆది దేవుడిగా, విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిగా, సర్వశుభాలను కలిగించే శివతనయుడిగా... గణనాథుడికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అందుకే ఏ ఆలయానికి వెళ్లినా... మొదట వినాయకుడినే దర్శించుకుంటాం. ఇక, దేశవ్యాప్తంగా ఉన్న గణపతి ఆలయాలకు లెక్కే లేదు. కాణిపాకం, లాల్‌బాగ్‌... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఈ గణేశుడి ఆలయాలు కాస్త ప్రత్యేకం. ఎందుకంటే...


ఇక్కడ స్వామి నరముఖుడు

వినాయకుడు అనగానే... పెద్ద చెవులతో, తొండంతో, బానపొట్టతో, ఏకదంతంతో ఉంటాడని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. కానీ అవేవీ లేకుండా పార్వతీదేవి ఎంతో ఇష్టంగా సృష్టించిన స్వామి నిజరూపాన్ని దర్శించుకోవాలంటే తమిళనాడులోని తిలతర్పణపురి అనే గ్రామంలో స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వరర్‌ ఆలయానికి వెళ్లాలి. ఈ ఆలయానికి బయట ఉండే ఆదివినాయకుడి సన్నిధానంలో స్వామి ఏకదంతుడిగా కాకుండా తన అసలైన రూపంతో నంది ఎదురుగా కొలువై ధ్యానముద్రలో దర్శనమిస్తూ భక్తుల పూజల్ని అందుకుంటున్నాడు. పార్వతీదేవి సృష్టించిన బాలగణపతి తలను శివుడు ఈ ప్రాంతంలోనే ఖండించాడనీ శివపురాణం పేర్కొంటోంది. అందుకే ఈ ఆలయాన్ని ఆదివినాయకుడి ఆలయమని పిలుస్తారు. ఇలా స్వామి మానవరూపంలో దర్శనమిచ్చే ఆలయం ఇదొక్కటేననీ, వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు... మొదట ఇక్కడకు వచ్చి దర్శించుకోవడాన్ని ఓ ఆనవాయితీగా పాటిస్తారనీ చెబుతారు. ముక్తీశ్వరర్‌ను దర్శించుకునే భక్తులకు కాశీ, రామేశ్వరం, గయ వంటి ప్రాంతాలను సందర్శించిన పుణ్యం లభిస్తుందనీ, ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే పితృదేవతలకు మోక్షం లభిస్తుందనీ పురాణాలు చెబుతున్నాయి.


నిమజ్జనం చేయరు

న్ని ఆలయాల్లోలా కాకుండా... వినాయకచవితి ఉత్సవాలు మొదలైతేనే ఆ గుడిలో గణనాథుడు పూజలందుకుంటాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మాత్రమే వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. పైగా ఈ గణేశుడి మరో ప్రత్యేకత ఏంటంటే అది చెక్కతో చేసిన విగ్రహం. ఇదంతా నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం సరిహద్దుల్లో మహారాష్ట్రలోని పాలజ్‌ గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి కర్ర వినాయక దేవాలయం సంగతి. ఎక్కడైనా ఏటా వినాయకచవితి సంబరాలు ముగియగానే వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటారు. కానీ ఈ ఆలయంలోని వినాయకుణ్ని మాత్రం చవితి వేడుకలు పూర్తవ్వగానే ఊరేగింపు జరిపి నీళ్లు చల్లి దాన్ని భద్రపరుస్తారు. మళ్లీ వినాయక చవితికే ప్రతిష్ఠిస్తారు. దాదాపు 70 ఏళ్ల నుంచి ఈ ఆనవాయితే ఇక్కడ కొనసాగుతూ వస్తోందట. ఏటా ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు బారులు తీరుతారు, కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతారు.


ఇరవైనాలుగ్గంటలూ దర్శనమిచ్చే స్వామి

ఆలయాన్నయినా కొన్ని గంటలపాటు మూసేస్తుంటారు. కానీ దక్షిణ కన్నడలోని బెల్తనగడి, కొక్కడలో ఉన్న మహాగణపతి సన్నిధానంలో కొలువైన స్వామిని ఇరవై నాలుగ్గంటలూ దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆలయం అంటూ ఏదీ ఉండదు గనుక! స్వామి ఆరుబయటే పచ్చని పరిసరాల మధ్యే దర్శనమిస్తాడు. సుమారు ఎనిమిదివందల సంవత్సరాల క్రితం పశువుల కాపరులకు స్వామి విగ్రహం కనిపించడంతో ఈ ప్రాంగణానికి తీసుకొచ్చి ఇక్కడున్న చెట్టుకింద ప్రతిష్ఠించారట. ప్రతిరోజూ పూజలు చేస్తూ స్వామికి కీరదోసను నివేదించేవారట. కొన్నాళ్లకు ఆ ప్రాంతంలో ఉండే రైతులకు కీరదోస దిగుబడి బాగా రావడంతో అంతా కలిసి స్వామికి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నారట. అయితే కొందరు రైతులకు స్వామి కలలో కనిపించి ఆలయం కట్టించొద్దనీ... తనని భక్తులు ఇరవై నాలుగ్గంటలూ దర్శించుకోవాలనీ చెప్పాడట. దాంతో భక్తులు అలాగే వదిలేశారట. ఇక్కడ స్వామి కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమని చెబుతారు భక్తులు. తమ కోరికలు తీరినప్పుడల్లా ఇక్కడకు వచ్చి ముడుపులు కట్టడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. ఈ క్షేత్రం ధర్మస్థల నుంచి ఇరవై కిలోమీటర్లు, కుక్కే సుబ్రహ్మణ్యఆలయానికి నలభైఅయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.


నీటిలోంచి  దర్శనమిచ్చే గణపతి

నుగు ఆకారాన్ని పోలిన కొండ మధ్యన నీటిలో ఉండే రాతి విగ్రహం, పదిహేడువందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం... ఇవీ దక్షిణ కర్ణాటకలోని గుడ్డట్టులో కొలువైన మహాగణపతి సన్నిధానం ప్రత్యేకతలు. ఉడిపికి దగ్గరగా ఉండే ఈ మందిరం అరుదైన వినాయకుడి దేవాలయాల్లో ఒకటి. పురాణాల ప్రకారం త్రిపురాసుర అనే రాక్షసుడిని సంహరించేందుకు సిద్ధమైన శివుడు ఆ హడావుడిలో గణపతిని పూజించకుండానే యుద్ధానికి వెళ్లిపోయాడట. ఆ యుద్ధంలో ఓడిపోవడంతో శివుడు ఆగ్రహించి దానికి కారణం విఘ్నాధిపతేనని భావించి తన పుత్రునిపైనే బాణాలను సంధించాడట. దాంతో వినాయకుడు తేనె కొలనులో పడిపోయి అవసరానికి మించి తేనెను స్వీకరించి ఆ వేడిని తట్టుకోలేక విలవిల్లాడిపోయాడట. ఎట్టకేలకు శివుడు విజయం సాధించాక తన కుమారుడి గురించి ఆరాతీసి, విషయం తెలిసి ఈ ప్రాంతంలోని నరసింహతీర్థం అనే కొలనులో ఉంచాడట. చల్లనినీటిలోకి చేరిన వినాయకుడికి సాంత్వన లభించడంతో అక్కడే ఉండేందుకు నిర్ణయించుకున్నాడనీ... అలా స్వామి ఇక్కడ స్వయంభువుగా కొలువయ్యాడనీ ప్రతీతి. కొన్నాళ్ల తరువాత ఆ విగ్రహాన్ని అలాగే వదిలేసి ఆలయం నిర్మించి మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయంలో స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఈ నీటిలో ఉండే విగ్రహానికి కూడా అన్నిరకాల అర్చనలు చేసి హారతులు ఇస్తారు. ఈ ఆలయంలో చేసే పూజలు కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ వినాయకుడికి రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. అదేవిధంగా రోజూ స్వామికి వెయ్యి కుండల నీటితో చేసే అభిషేకాన్ని చూసేందుకూ, చేయించుకునేందుకూ భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. చల్లని నీటిలో ఉండే స్వామి తన చల్లని చూపులతోనే కోరిన కోరికలు తీర్చే భక్తసులభుడిగా పూజల్ని అందుకుంటున్నాడు.


మట్టి నుంచి ఉద్భవించిన స్వామి

ముద్రం, పచ్చని చెట్లూ, కొండల మధ్య వెలసి... కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా దర్శనమిస్తున్నాడు గణపతిపులె వినాయకుడు. మహారాష్ట్ర,  రత్నగిరి జిల్లాలోని కొంకణ్‌ తీరప్రాంతంలో గణపతిపులె అనే ప్రాంతంలో దర్శనమిచ్చే ఈ స్వామి మట్టినుంచి స్వయంభువుగా ఉద్భవించినట్లు చెబుతారు.  సుమారు నాలుగువందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. స్వామి వల్లే ఈ ప్రాంతానికి కూడా గణపతి పులె అనే పేరు వచ్చిందనీ... తాము సురక్షితంగా ఉండటానికి గణపతి అనుగ్రహమే కారణమనీ ఈ ఊరి ప్రజల నమ్మకం. దేశంలోని అష్ట గణపతుల దేవాలయాల్లో ఒకటైన ఈ క్షేత్రంలోని స్వామిపైన ఫిబ్రవరి నుంచి నవంబరు వరకూ తొలి సూర్యకిరణాలు పడతాయనీ... ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవనీ అంటారు. ఈ మందిరానికి వచ్చే భక్తులు స్వామిని దర్శించుకోవడానికే కాదు... కొండచుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయడానికీ ఎంతో ఆసక్తి చూపిస్తారు.


సువర్ణ పంచముఖ గణపతి!

కదంతం, చతుర్భుజాలతో సర్వత్రా కనిపించే ఆ లంబోదరుడు, బెంగళూరుకి సమీపంలోని కనెగిరి ఆలయంలో మాత్రం పంచముఖాలతో భక్తులకు దర్శనమిస్తాడు. సకల ప్రాణికోటికీ కీలకమైన పంచభూతాల్ని సూచిస్తూ నలువైపులా నాలుగూ పై భాగంలో ఒకటీ మొత్తం ఐదు తలల సువర్ణ విగ్రహాన్ని గుడి గోపురంగా నిర్మించడం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ గోపురం బంగారు వర్ణంలో ముప్పై అడుగుల ఎత్తులో కనిపిస్తూ... భక్తులను ఆకట్టుకుంటుంది. అందుకే ఈ ఆలయాన్ని మహామేరు గణేశ అని పిలుస్తారు. నల్లరాతితో చెక్కిన పంచముఖ వినాయకుడినే గర్భగుడిలో ప్రతిష్ఠించడంతోపాటు ఆలయాన్ని శ్రీచక్రం ఆకారంలో నిర్మించడం దీనికున్న మరో విశిష్టత. అదేవిధంగా స్వామి ఇక్కడ సింహవాహనుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఆలయం లోపల సీలింగులో 32 రకాల్లో ఉన్న వినాయకుడి రూపాలు సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ప్రాంగణంలో నిర్మించిన కొలనులో ఏదైనా కోరుకుంటూ నాణెం వేస్తే అది తీరుతుందనేది భక్తుల నమ్మకం. 2007లో శ్రీచక్ర కమిటీ కట్టించిన ఈ ఆలయం, నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. ఇక్కడే ఓ పాఠశాలనీ ఆశ్రమాన్నీ కూడా నిర్వహించడం విశేషం. బెంగళూరు-మైసూరు హైవే దారిలో ఉన్న ఈ ఆలయాన్ని పరిశుభ్రతకీ ప్రశాంతతకీ మారుపేరుగా అభివర్ణిస్తారు ఇక్కడికొచ్చిన భక్తజనం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని