iPhone 12 Update: ఐఫోన్‌ 12 రేడియేషన్‌.. యాపిల్‌ కీలక నిర్ణయం

iPhone 12 Radiation: ఐఫోన్‌ 12 నుంచి అధిక రేడియేషన్‌ (iPhone 12 Radiation) వెలువడుతోందంటూ ఫ్రాన్స్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో యాపిల్‌ వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.

Published : 15 Sep 2023 17:11 IST

iPhone 12 Radiation | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఫోన్‌ 12 రేడియేషన్‌ (iPhone 12 Radiation)పై వివాదం నడుస్తోన్న నేపథ్యంలో యాపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఐఫోన్‌ 12 ఫోన్లకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ (iPhone 12 software update) ఇస్తామని హామీ ఇచ్చింది. తద్వారా అధిక రేడియేషన్‌ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. అయితే, ఫ్రాన్స్‌లో ఈ ఫోన్‌ వాడుతున్న యూజర్లకు మాత్రమే అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. తద్వారా ఫ్రాన్స్‌లో ఈ ఫోన్ల విక్రయాలు కొనసాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఐఫోన్‌ 12 నుంచి అధిక రేడియేషన్‌ (iPhone 12 Radiation) వెలువడుతోందంటూ ఫ్రాన్స్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రేడియేషన్‌ స్థాయుల విషయంలో యూరోపియన్‌ యూనియన్‌ నిబంధనలను ఈ ఫోన్‌ ఉల్లంఘిస్తోందని తెలిపింది. దీంతో వెంటనే వీటి విక్రయాలను నిలిపివేయాలని యాపిల్‌ను ఆదేశించింది. ఫలితంగా ఇతర ఐరోపా దేశాల్లోనూ ఈ ఫోన్‌పై ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ఆ మోడల్‌కు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ఇవ్వాలని యాపిల్‌ నిర్ణయించింది. తద్వారా ఐరోపా సమాఖ్య నిబంధనలకు అనుగుణంగా రేడియేషన్‌ స్థాయులను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. అయితే, ఇది భద్రత లోపం ఏమాత్రం కాదని.. కేవలం ఫ్రాన్స్‌ టెస్టింగ్‌ ప్రొటోకాల్స్‌కు అనుగుణంగానే అప్‌డేట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు కంపెనీ స్పష్టం చేసింది.

ఐఫోన్‌ 12 రేడియేషన్‌ గురించి మాట్లాడొద్దు..!

యాపిల్‌ తాజా నిర్ణయాన్ని ఫ్రాన్స్‌ స్వాగతించింది. రాబోయే కొన్ని రోజుల్లోనే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అందుబాటులోకి వస్తుందని తమకు కంపెనీ తెలియజేసినట్లు ఆ దేశ డిజిటల్‌ మినిస్టర్‌ జీన్‌ నోయెల్‌ బ్యారట్‌ తెలిపారు. వారు ఇవ్వబోయే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను తమ నియంత్రణ సంస్థలు పరీక్షిస్తాయని పేర్కొన్నారు. దాని వల్ల రేడియేషన్‌ స్థాయులు ఆమోదయోగ్య స్థాయికి తగ్గుతున్నాయో.. లేదో.. నిర్ధారిస్తాయని తెలిపారు.

2020లో ఐఫోన్‌ 12 మార్కెట్‌లోకి వచ్చింది. ఇటీవలే ఐఫోన్‌ 15 విడుదలైన విషయం తెలిసిందే. దీంతో కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో ఇప్పటికే ఐఫోన్‌ 12 విక్రయాలను యాపిల్‌ నిలిపివేసింది. గత ఏడాది ఐరోపా దేశాల్లో 50 మిలియన్ల ఐఫోన్లు అమ్ముడయ్యాయి. దాదాపు 95 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని