Credit Card Risks: క్రెడిట్‌కార్డుతో ఉండే ఈ 4 రిస్కుల నుంచి ఇలా బయటపడండి..!

Credit Card Risks: క్రెడిట్‌ కార్డుతో తరచూ వినియోగదారులను 4 రకాల రిస్కులను ఎదుర్కొంటుంటారు. వాటి నుంచి ఎలా బయటపడాలో చూద్దాం...

Updated : 27 Jul 2022 12:08 IST

Credit Card Risks: క్రెడిట్‌ కార్డు (Credit Card) అంటేనే ఒకరకమైన స్వల్పకాలిక రుణం. అయితే, సకాలంలో బిల్‌ క్లియర్ చేస్తే ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఇతర రకాల రుణాల మాదిరిగానే ఇబ్బందులు తప్పవు. మీ కార్డులను క్రమశిక్షణతో ఉపయోగించడం, సమయానికి చెల్లింపులు చేయడం వల్ల ఎలాంటి రిస్క్‌ ఉండదు. క్రెడిట్ కార్డు (Credit Card) వినియోగానికి సంబంధించిన ప్రధాన రిస్కులు.. వాటిని ఎలా నివారించుకోవచ్చో ఇక్కడ చూద్దాం..

1. అధిక వడ్డీ భారం..

క్రెడిట్‌ కార్డు (Credit Card) అత్యంత ఖరీదైన రుణమని చెప్పాలి. సకాలంలో చెల్లింపులు చేయకపోతే.. 22-49% వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, బిల్లు పూర్తిగా చెల్లించకపోతే, నగదు ఉపసంహరణకు మాత్రమే వడ్డీ వర్తిస్తుంది. ఒకవేళ బిల్లు మొత్తం చెల్లించకపోతే.. కొత్త లావాదేవీలపై కూడా మొదటి రోజు నుంచే వడ్డీభారం పడుతుంది. దీంతో వడ్డీరహిత కాలానికి అర్థమే లేకుండా పోతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు వడ్డీ ఖర్చులను భరించడానికి సిద్ధపడుతుంటారు. చాలా మంది కార్డుదారుల్లో ఇప్పటికీ ‘కనీస బకాయి మొత్తం’ చెల్లిస్తే సరిపోతుందనే అపోహ ఉంది. అలా చేయడం వల్ల కేవలం ఆలస్య రుసుము నుంచి మాత్రమే మీకు రక్షణ లభిస్తుంది. చెల్లించని బ్యాలెన్స్‌, కొత్త లావాదేవీలపై పడే వడ్డీ చాలా ఎక్కువనే విషయం మర్చిపోవద్దు.

పరిష్కారం: బిల్లును సకాలంలో చెల్లించడం ఉత్తమం. కుదరని పక్షంలో బకాయిలను ఈఎంఐల కిందకు మార్చుకోవాలి. అదీ సాధ్యం కాకపోతే, వ్యక్తిగత రుణాన్ని తీసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు (Credit Card) వడ్డీభారంతో పోలిస్తే ఇవన్నీ పొదుపుగానే ఉంటాయి. అలాగే, కార్డు ద్వారా చేసే నగదు ఉపసంహరణపై మొదటి రోజు నుంచే వడ్డీ ఛార్జీలు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బు డ్రా చేయాల్సి వస్తే.. వీలైనంత త్వరగా దాన్ని చెల్లించడం మంచిది.

2. అతిగా ఖర్చు చేయడం..

క్రెడిట్ కార్డులు మీకు అదనపు కొనుగోలు శక్తిని అందిస్తాయి. ఇది అతిగా ఖర్చు చేయడానికి దారి తీస్తుంది. రివార్డ్ పాయింట్‌లు, క్యాష్‌బ్యాక్, ప్రముఖ బ్రాండ్‌లపై తగ్గింపుల వంటి ఆఫర్లు అనవసరమైన కొనుగోళ్లు చేయడానికి ప్రోత్సహిస్తాయి. దీనివల్ల స్తోమతకు మించి ఎక్కువ ఖర్చు చేసే ప్రమాదం ఉంది.

పరిష్కారం: అతిగా ఖర్చు చేయకుండా ఉండాలంటే కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ఒక్కటే మార్గం. అన్ని క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నారో.. ఎలా నివారించవచ్చో చూడండి. అలాగే, వడ్డీ రహిత వ్యవధిని సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రతి కార్డు బిల్లింగ్ సైకిల్‌ను ట్రాక్ చేయండి. విందులు, వినోదాల కోసం ఇతర చెల్లింపు మార్గాలను ఉపయోగించుకోండి. ఇవన్నీ కుదరకపోతే.. కార్డును తరచూ వెంట తీసుకెళ్లడం ఆపి ఇంట్లోనే పెట్టి వెళ్లండి.

3. క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం..

మీ క్రెడిట్ కార్డు చెల్లింపు రికార్డులు క్రెడిట్ బ్యూరోలతో అనుసంధానమవుతాయి. ఆలస్య చెల్లింపులు, ఎగవేతలు క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. క్రెడిట్‌ కార్డుని ఎక్కువగా వినియోగిస్తున్నారంటే మీరు రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని అర్థం. ఫలితంగా క్రెడిట్ బ్యూరోలు మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గించే అవకాశం ఉంది.

పరిష్కారం: తెలివిగా ఉపయోగించుకుంటే.. క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవడానికి క్రెడిట్‌ కార్డులు ఓ మంచి మార్గం. అందుకు సకాలంలో చెల్లింపులు చేయాలి. ఒకవేళ మీ బిల్లింగ్‌ సైకిల్‌ గడువును మర్చిపోతే.. మొబైల్‌లో రిమైండర్‌ సెట్‌ చేసుకోవడం ఉత్తమం. అలాగే క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో 40-50% దాటకుండా చూసుకోవాలి. ఒకేసారి ఎక్కువ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేయొద్దు. మీరు దేనికి అర్హులు.. మీ అవసరాలకు ఏది సరిపోతుందో చూసి తీసుకోండి.

4. మోసపూరిత లావాదేవీలు..

డిజిటల్‌ మోసాలు పెరిగిపోతున్న ఈకాలంలో నకిలీ ఈ-మెయిళ్లు, ఫోన్ కాల్‌ల ద్వారా మీ క్రెడిట్ కార్డు వివరాలు ఇతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. పీఓఎస్‌ టెర్మినళ్ల వద్ద మీ కార్డు (స్కిమ్మింగ్)ని నకిలీ చేయడం ద్వారా మోసానికి పాల్పడవచ్చు. కొందరు మీ వివరాలను వాడుకొని కొత్త కార్డుని తీసుకునే అవకాశమూ ఉంది.

పరిష్కారం: మీరు అప్రమత్తంగా ఉండటం, మీ కార్డుని సురక్షితంగా ఉపయోగించడం ద్వారా క్రెడిట్ కార్డు మోసాన్ని నివారించవచ్చు. సున్నితమైన కార్డు వివరాలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోవద్దు. పీఓఎస్‌ టెర్మినల్‌లో కొనుగోలు చేస్తున్నప్పుడు, కార్డు మీ ముందే స్వైప్ చేసేలా చూసుకోండి. ఎట్టిపరిస్థితుల్లో మరొకరికి అప్పగించొద్దు. మోసపూరిత లావాదేవీలు లేదా మీ వివరాల తస్కరణను నివారించడానికి మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లు క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. ఏమైనా తేడాలు గమనిస్తే వెంటనే కార్డు జారీ చేసిన సంస్థలు లేదా బ్యూరోకు తెలియజేయండి.

మీ జీవనశైలికి సరిపోయే క్రెడిట్ కార్డుని మాత్రమే తీసుకోవాలి. అప్పుడే తరచూ చేసే కొనుగోళ్లపై ప్రయోజనాల్ని పొందగలుగుతారు. జాయినింగ్‌ బోనస్‌, ప్రీ-అప్రూవ్డ్‌ ఆఫర్‌ను మాత్రమే కాకుండా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాల్ని పొందగలిగే కార్డుని తీసుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని