Q-A: కొత్తగా పెట్టుబడి మొదలు పెట్టేవారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టొచ్చా?

షేర్ మార్కెట్‌లో అధిక రిస్క్ ఉంటుంది. దీనికి సమయం, నైపుణ్యం ఎంతో అవసరం.

Published : 21 Feb 2023 16:45 IST


* షేర్ మార్కెట్ గురించి నాకు సరైన అవగాహన లేదు. కొంచెం వివరించగలరు. నేను నెలకు రూ.10,000 వరకు ఆదా చేయగలను.

- మురళీధర్

షేర్ మార్కెట్‌లో అధిక రిస్క్ ఉంటుంది. దీనికి సమయం, నైపుణ్యం ఎంతో అవసరం. మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్లో పరోక్షంగా కాస్త తక్కువ రిస్క్ తో నెల నెలా పెట్టుబడి పెట్టగలరు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్‌లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  యాప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్‌లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్‌ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. రిస్క్ లేని పధకాల కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి కోసం) లాంటి వాటిని ఎంచుకోవచ్చు. ఇవి దీర్ఘకాలంలో మంచి రాబడి అందిస్తాయి. మీరు స్టాక్స్ లో నేరుగా మదుపు చేయాలంటే స్టాక్ మార్కెట్ నిపుణుడి సలహా తీసుకోవడం మేలు.


* సీనియర్ సిటిజన్స్‌కు ఆదాయ పన్ను మినహాయింపు కోసం మ్యూచువల్ ఫండ్ సూచించండి.

- వర ప్రసాద్

మ్యూచువల్ ఫండ్స్‌లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌కు మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, వీటిలో సిప్ చేస్తే ప్రతి సిప్‌కు 3 ఏళ్ళ లాక్ ఇన్ ఉంటుంది. కాబట్టి, ఇందులో ఏక మొత్తంగా మదుపు చేయడమే మేలు. మీరు రిస్క్ తీసుకోగలిగితే ఈ ఫండ్స్‌లో మదుపు చేయొచ్చు. పరాగ్ పారిఖ్, క్వాంటం టాక్స్ ప్లాన్ ఫండ్స్‌లో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు.


* సర్, నా వద్ద రూ.30 లక్షలు ఉన్నాయి. మరో 7 ఏళ్లలో నేను పదవీ విరమణ తీసుకుంటాను. మరో రూ.30-40 లక్షల వరకు పొందగలను. నాకు ఫ్యామిలీ పెన్షన్ లేదు. కొంత వరకు ఈ డబ్బుతో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను. మరి కొంత మొత్తాన్ని మదుపు చేసి నెల నెలా కొంత మొత్తం పెన్షన్ పొందేలా పెట్టుబడి చేయడానికి సలహా ఇవ్వండి.

- మదన్

పదవీ విరమణ నిధి మదుపు చేసి నెల నెలా పెన్షన్ పొందడానికి 5 ఏళ్ళ బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పధకం, ఎన్ఎస్‌సీ, ప్రధాన మంత్రి వయ వందన యోజన లాంటి పధకాలను ఎంచుకోవచ్చు. వీటిలో మంచి రాబడి పొందొచ్చు, రిస్క్ కూడా ఉండదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని