Explained: ఎక్స్‌షోరూం Vs ఆన్‌రోడ్‌.. రెండు ధరలకు మధ్య తేడా ఏంటి?

బైక్‌ గురించో, కారు గురించో ప్రకటన చూసి ధర తక్కువని మురిసిపోతాం. తీరా డీలరు దగ్గరికెళ్లాక రేటు విని నోరెళ్లబెడతాం. అప్పుడుగానీ తెలియదు మనకు ఎక్స్‌ షోరూంకి.....

Published : 11 Jul 2022 15:51 IST

బైక్‌ గురించో, కారు గురించో ప్రకటన చూసి ధర తక్కువని మురిసిపోతాం. తీరా డీలరు దగ్గరికెళ్లాక రేటు విని నోరెళ్లబెడతాం. అప్పుడుగానీ తెలియదు మనకు ఎక్స్‌ షోరూంకి.. ఆన్‌రోడ్‌కి ఉన్న తేడా. అది నమ్మాలా? వద్దా? అని చాలామందికి సంశయం. మోసపోతున్నామేమోనన్న సందేహం. ఇంతకీ ఏది వాస్తవం? ఎందుకీ తేడాలు? ఈ అంకెల వెనుక ఉన్న మర్మమేంటి? కొనేటప్పుడు బేరమాడడానికి ఉన్న అవకాశాలేంటి? కొనడానికి వెళ్లేముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలివీ..

ఎక్స్‌ షోరూం ధర, ఆన్‌రోడ్‌ ప్రైస్‌.. ఆటోమొబైల్‌ రంగంపై అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పదాలివి. కానీ కొత్తవాళ్లకైతే బొత్తిగా తెలియదు. రెండు ధరల మధ్య ఆ తేడా ఎందుకో అర్థం కాదు. తేలిగ్గా చెప్పాలంటే.. వాహన తయారీకి అయ్యే ఖర్చునే ఎక్స్‌ షోరూం ధర అనొచ్చు. ఆపై ప్రభుత్వానికి కట్టే పన్నులు, డీలరు తీసుకునే లాభం, ఇతరాలన్నీ కలిపి వాహనం రోడ్డుపైకి వచ్చేసరికి అయ్యే మొత్తం రేటుని ఆన్‌రోడ్డు ధర అంటారు. ఈ రెండింటి మధ్య తేడా కనీసం పదిశాతమైనా ఉంటుంది. డీలరుతో జాగ్రత్తగా బేరమాడితే కొన్ని ఛార్జీలపై డబ్బు ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


రిజిస్ట్రేషన్‌ ఛార్జీ

బైకు, కారు.. ఏ వాహనం కొన్నా అది పూర్తిగా మన సొంతమయ్యేది రిజిస్ట్రేషన్‌ తర్వాతే. స్థానిక ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం (ఆర్‌టీఓ)లో బండిని రిజిస్ట్రేషన్‌ చేయిస్తే అక్కడ వాహనానికి రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కేటాయిస్తారు. ఈ ఛార్జీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. దీనికోసం డీలరు నంబర్‌ ప్లేట్‌, స్మార్ట్‌కార్డుల ఛార్జీలూ తీసుకుంటాడు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీ పూర్తిగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను. కానీ సర్వీసు ఛార్జీలు, ఏజెంట్‌ ఫీజు అని డీలరు మన దగ్గర అదనంగా డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంది. బేరమాడితే వీటిలో కొద్దిమొత్తం తగ్గించుకోవచ్చు. లేదా పూర్తిగా మాఫీ చేయించుకోవచ్చు.


నిర్వహణ ప్యాకేజీ

భవిష్యత్‌లో ఎదురయ్యే కొన్నిరకాల సమస్యలకు ఉచితంగా సర్వీసు చేస్తామంటూ డీలర్లు ప్రీపెయిడ్‌ సర్వీస్‌ ప్యాకేజీలు అందిస్తుంటారు. ఇందులో రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, పాలిషింగ్‌, టైర్ల రీప్లేస్‌మెంట్‌ వంటివి ఉంటాయి. అందుకోసం కొంతమొత్తం వసూలు చేస్తారు. అయితే, అత్యధికం మనకు అవసరం లేనివే. పైగా అన్ని అధీకృత సర్వీసింగ్‌ సెంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉండవు. అదీ గమనించాలి. ●


జీవితకాల రోడ్డు పన్ను

మన వాహనాన్ని రోడ్డు మీద నడపడానికి ప్రభుత్వానికి కట్టాల్సిన జీవితకాల పన్ను రోడ్‌ టాక్స్‌. ఇది 10-15 ఏళ్లకు వర్తిస్తుంది. ఎక్స్‌షోరూం ధరకి 3శాతం ఉంటుంది. మోడల్‌, ఇంధన రకాన్ని బట్టి ఇరవైశాతం వరకూ పన్ను వేస్తారు. కొన్నిసార్లు ప్రభుత్వం విధించే ట్యాక్స్‌ కన్నా డీలరు అధికంగా చూపిస్తారు. ఈ పన్ను కట్టేముందు మన రాష్ట్రంలో రోడ్‌ ట్యాక్స్‌ ఎంత ఉందో స్పష్టంగా తెలుసుకోవాలి. తప్పకుండా రసీదులు తీసుకోవాలి.●


బీమా

ప్రమాదాల్లో, వాహనం చోరీకి గురైనప్పుడు, ప్రకృతి విపత్తులవేళ ఆదుకునేది బీమానే. వాహనానికిది తప్పనిసరి. ఇందులో థర్డ్‌ పార్టీ, కాంప్రహెన్సివ్‌, జీరో డిప్రిషియేషన్‌.. అంటూ రకరకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక బీమా పథకాలుంటాయి. అయితే, వాహనానికి థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరి. మిగతావి మనకు నచ్చినవి ఎంచుకోవచ్చు. బండి కొంటున్నప్పుడు డీలర్లు దీర్ఘకాలిక బీమా ఇస్తామని చెప్పినా.. అందులో థర్డ్‌ పార్టీ ఒక్కటే ఐదేళ్ల కాలానికి ఇచ్చి, మిగతాది స్వల్పకాలానికి పరిమితం చేస్తారు. ఇది జాగ్రత్తగా గమనించాలి. డీలరు దగ్గర కాకుండా బయట తీసుకుంటే ప్రీమియం తగ్గే అవకాశం ఉంది. ఎక్కువ డిస్కౌంట్లు పొందవచ్చు.


అదనపు యాక్సెసరీలు

వాహనం కొనేటప్పుడు ఫ్లోర్‌మ్యాట్‌లు, మడ్‌ మ్యాట్‌లు, సీటు కవర్లు, కారు దిండ్లు, దేవతల ప్రతిమలు, ఇతర విడిభాగాలు తీసుకోవడానికి అదనంగా ధర చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కోసారి కొనుగోలుదారుకిచ్చే ధర జాబితాలో మనకు తెలియకుండానే యాక్సెసరీల పేరిట కొంత రుసుము వసూలు చేస్తారు. వాస్తవానికి డీలర్లు చెప్పిన అన్ని విడిభాగాలూ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదీ కాకుండా షోరూంలో తీసుకునే వస్తువులతో పోలిస్తే బయట మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరుకుతాయి.●


హ్యాండ్లింగ్‌/లాజిస్టిక్‌ ఛార్జీలు

వాహనం తయారైన దగ్గర్నుంచి గోదాములకు, అక్కడి నుంచి షోరూంకి చేర్చడానికి, నిల్వకు తీసుకునే ఛార్జీలు ఇవి. దీనికి కొంత ఛార్జీ వసూలు చేస్తుంటారు. ఎక్స్‌షోరూం ధరలో డీలర్ల లాభాలు కలిసి ఉండడంతో హ్యాండ్లింగ్‌ ఛార్జీలు చట్టవిరుద్ధమని, మాఫీ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ రుసుములు వేశారేమో ఓసారి చెక్‌ చేసుకోండి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని