Q-A: షేర్ మార్కెట్ పెట్టుబడితో ఇంటి రుణం తీర్చొచ్చా?

ఇంటి రుణంలో వడ్డీ రేటు కాస్త తక్కువగానే ఉంటుంది. పైగా, ఇందులో మీకు అసలు, వడ్డీ పై పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి.  మీరు ఇంటి రుణం కొనసాగించండి.

Updated : 14 Oct 2022 17:58 IST

నేను రూ. 10 లక్షల వరకు షేర్ మార్కెట్లో మదుపు చేశాను. ఈ మొత్తంతో ఇంటి రుణం తీర్చడం మంచిదా లేక మదుపు కొనసాగించమంటారా?

- రామకృష్ణ

ఇంటి రుణంలో వడ్డీ రేటు కాస్త తక్కువగానే ఉంటుంది. పైగా, ఇందులో మీకు అసలు, వడ్డీ పై పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి. మీరు ఇంటి రుణం కొనసాగించండి. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు అధిక రిస్క్ తో కూడుకుని ఉంటాయి. మీరు నిపుణుల సలహాల మేరకు మాత్రమే అందులో మదుపు చేయడం మంచిది. పరోక్షంగా కూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్లో మదుపు చేయవచ్చు. ఒక ఇండెక్స్ ఫండ్‌లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్‌సైట్లు (www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  యాప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్‌లో మదుపు చేయొచ్చు. ఇందులో మీరు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.


నేను రూ. 2.20 లక్షల పర్సనల్ లోన్, 36 నెలలు కాల పరిమితి,  ఈఎంఐ రూ.8517/- తో తీసుకున్నాను. వడ్డీ రేటు 13.12%. ఈ రుణం ముందే క్లోజ్ చేసుకోవచ్చా లేక ఈఎంఐ కట్టుకోవడం మంచిదా? ప్రీ క్లోజ్ చేయడం వల్ల నష్టపోతామా? తెలియచేయగలరు.

- కుమార్

వ్యక్తిగత రుణాన్ని ముందే తీర్చడం వల్ల బ్యాంకులు 3-4 శాతం వరకు ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. ఈ మేరకు మీరు సిద్ధమైతే రుణం తీర్చవచ్చు. వడ్డీ భారం తప్పుతుంది. ఒకవేళ మీ రుణ కాలపరిమితి ముగింపు దశకు చేరుకున్నట్లయితే ఇప్పటికే మీరు చాలా వరకు వడ్డీ చెల్లించి ఉంటారు. కాబట్టి చివరి వరకు వేచి ఉండడం మంచిది. వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డు రుణాల నుంచి దూరంగా ఉండడం మంచిది. వీటిపై వడ్డీ అధికంగా ఉంటుంది.


నేను పదవీ విరమణ తీసుకున్నాను. పీపీఎఫ్ ఖాతాలో ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు మదుపు చేస్తున్నాను. వడ్డీపై పన్ను ఉంటుందా?

- రామ మోహన్

పీపీఎఫ్ ఖాతా పెట్టుబడిపై సెక్షన్ 80C ద్వారా పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీపై పన్ను వర్తించదు. అలాగే, మెచ్యూరిటీ మొత్తంపై కూడా పన్ను ఉండదు. మీరు పీపీఎఫ్ ఖాతా కాల పరిమితి ముగిశాక కూడా 5 ఏళ్ల చొప్పున ఖాతాను  కొనసాగిస్తూ రావచ్చు.  


నా వయసు 67. రిస్క్ కవరేజీ అందించే మంచి బీమా పాలసీల గురించి తెలియజేయగలరు.

- రమేష్

మీరు జీవిత బీమా గురించి అడుగుతున్నారని భావిస్తున్నాం. ఇందులో పాలసీదారుడికి ఏదైనా జరిగితే కుటుంబానికి ఒకేసారి బీమా మొత్తాన్ని అందిస్తారు. యుక్త వయసు నుంచి ఉన్నట్లయితే కుటుంబానికి భరోసా అందించవచ్చు. ఇదే కారణం చేత బీమా కంపెనీలు ఉద్యోగులకు జీవిత బీమా పాలసీ అందిస్తుంటాయి. వయసు పెరిగాక పాలసీ తీసుకోవడానికి పాలసీ దొరకడం కాస్త కష్టతరం కావచ్చు. అలాగే ప్రీమియం కూడా అధికంగా ఉంటుంది. మీరు పదవీ విరమణ పొంది ఉంటారు కాబట్టి మీ ఇంట్లో అధిక సంపాదన కలిగిన వారి పేరు మీద టర్మ్ జీవిత బీమా తీసుకోవడం మేలు. తన సంపాదన మీద ఆధారపడిన వారు ఉన్నప్పుడు మాత్రమే జీవిత బీమా తీసుకోవాలి. వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా భవిష్యత్‌లో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులూ తలెత్తకుండా ఉంటాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు