Q-A: టర్మ్ పాలసీలో అన్ని మరణాలు కవర్ అవుతాయా?

60 ఏళ్ళు వచ్చే దాక టర్మ్ బీమా పాలసీని కొనసాగించండి

Published : 03 Dec 2022 14:42 IST

టర్మ్ పాలసీలో ప్రమాద మరణం, అనారోగ్యాలతో మరణం ఇలా అన్నిటికీ బీమా హామీ వర్తిస్తుందా? మైనర్‌ను నామినీ చేయవచ్చా?

- రాజగోపాల్

టర్మ్ పాలసీ ప్రమాద మరణం, అనారోగ్యాలతో మరణం ఇలా అన్ని రకాల మరణాలను కవర్ చేస్తుంది. అయితే, పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, ముఖ్యంగా అనారోగ్యాలను కచ్చితంగా తెలపాలి.

టర్మ్ పాలసీ లో మైనర్‌ను నామినీగా చేర్చవచ్చు. అయితే, 18 ఏళ్ళ నిండే వరకు వారికి బీమా హామీ అందదు. కాబట్టి, మీరు ఒక 'అప్పాయింటీ' ను నియమించాల్సి ఉంటుంది. నామినీ వయసు 18 ఏళ్ళ లోపు పాలసీదారుడు మరణిస్తే, బీమా హామీ మొత్తాన్ని అప్పాయింటీ తీసుకుని 18 ఏళ్ళ తరవాత నామినీకు అందిస్తారు. 


సర్, నేను ఐటీ ఉద్యోగిని, వయసు 28, నాకు రూ. 80 వేల జీతం. ఇప్పటి వరకు పొదుపు లేదు. ఖర్చులు పోను ఎలా పొదుపు చేయాలో తెలుపగలరు. 

- చంద్రశేఖర్

మీరు మీ స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో ఉంచి మదుపు చేయడం మొదలు పెట్టండి. 10 ఏళ్ళ పైన ఉన్న లక్ష్యాల కోసం సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్‌లో మదుపు చేయోచ్చు. ఇందులో మీరు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

అలాగే, మీరు ఒక టర్మ్ బీమా పాలసీ తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియంతో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ ఆన్‌లైన్‌ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. 

ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి.


సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. ఇటీవలే ఇల్లు అమ్మితే నాకు రూ. 6 లక్షలు అందాయి. దీన్ని బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేయడం మంచిదా లేక పోస్టాఫీస్ లో మదుపు చేయొచ్చా?

- గణపతి

మీరు స్వల్పకాలం కోసం మదుపు చేయాలనుకుంటే మీ పెట్టుబడిపై రిస్క్ తీసుకోకపోవడం మేలు. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. రూ.3 లక్షల చొప్పున మీరు 2 బ్యాంకుల్లో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. యెస్ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ లాంటి బ్యాంకులను ఎంచుకోవచ్చు. వీటిలో వడ్డీ కాస్త ఎక్కువ ఉండవచ్చు.   

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని