SIP: ‘సిప్‌’ ప్రారంభిస్తున్నారా? ఈ తప్పులు చేయొద్దు..

క్రమశిక్షణతో పెట్టుబడులు చేస్తే..చిన్న మొత్తాలతోనే పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టవచ్చు.

Updated : 03 Dec 2022 14:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) ఒక సులభమైన మార్గం. క్రమశిక్షణతో మదుపు చేస్తే.. చిన్న మొత్తాలతోనే.. పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టవచ్చు. అయితే కొంతమంది సిప్‌ ద్వారా మదుపు చేయడం అయితే మొదలుపెడతారు గానీ, చిన్న చిన్న పొరపాట్ల వల్ల మంచి రాబడి సాధించడంలో విఫలం అవుతుంటారు. కాబట్టి ఎలాంటి విషయాల్లో తప్పులు చేస్తుంటారు? వాటిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

లక్ష్యం వాస్తవానికి దగ్గరగా లేకపోవడం..

పెట్టుబడుల్లో లక్ష్యం చాలా ముఖ్యమైన అంశం. ఎందుకోసం పెట్టుబడులు పెడుతున్నామో అవగాహన ఉంటే.. అది సాధించేందుకు సరైన పెట్టుబడులను ఎంచుకోవచ్చు. కానీ, కొంత మంది వాస్తవానికి దగ్గరగా లేని లక్ష్యాలను ఎంచుకుంటుంటారు. ఉదాహరణకు ఇప్పుడు మీ వయసు 30 ఏళ్లు. 50 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేయాలి. ఇందుకోసం రూ.5 కోట్లు సంపద మీ లక్ష్యం అనుకుందాం. ఇది వాస్తవానికి దగ్గరగా ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుకోసం మీ ప్రస్తుత ఆదాయం, ప్రస్తుతం ఉన్న కుటుంబ బాధ్యతలు, నెలవారీ మదుపు చేయగల మొత్తం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ మీరు నెలవారీగా రూ. 50 వేల వరకు సిప్‌ కోసం కేటాయించగలిగితే.. ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఒకవేళ మీ ఆదాయం తక్కువగా ఉంటే మీరు నెలవారీ ఇంత మొత్తం మదుపు కోసం కేటాయించలేకపోవచ్చు. అప్పుడు ఇది వాస్తవానికి దగ్గరగా లేని లక్ష్యం అవుతుంది. కాబట్టి లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. 

తప్పు పథకాన్ని ఎంచుకోవడం..

భవిష్యత్‌లో నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాన్ని సాధించేందకు సిప్‌ చేస్తాం. లక్ష్యాలన్నింటికీ ఒకే సమయం ఉండదు. విహారయాత్రలను తీసుకుంటే ఏడాది లేదా రెండేళ్ల సమయం ఉండొచ్చు. ఐదేళ్ల తర్వాత ఇల్లు కొనాలనుకుంటే డౌన్‌పేమెంట్‌ కోసం మదుపు చేస్తుండవచ్చు. లేదా పది నుంచి పదిహేనేళ్ల తర్వాత పిల్లల చదవు, వివాహం కోసం, 30 ఏళ్ల తర్వాత రిటైర్‌మెంట్‌ జీవితం కోసం ఇలా రకరకాల లక్ష్యాల కోసం మదుపు చేస్తుండవచ్చు. అన్నింటికీ ఒకటే పథకాన్ని ఎంచుకోవడంలో అర్థం లేదు. ఏడాది సమయం ఉన్న విహార యాత్రల కోసం ఈక్విటీ స్కీమ్‌లో మదుపు చేయడం, 15 ఏళ్ల లక్ష్యం కోసం షార్ట్‌ టర్మ్‌ ఫండ్లు ఎంచుకోవడం సరికాదు. మీ లక్ష్యానికి ఉన్న సమయాన్ని బట్టి నష్టభయాన్ని తగ్గించుకుని అధిక రాబడి పొందగలిగేలా సరైన పథకాలను ఎంచుకోవడం ముఖ్యం.

అధిక సిప్‌..

సిప్‌ ప్రారంభించేందుకు గరిష్ఠ పరిమితి లేదు. మీకు వీలైనంత పెట్టుబడి పెట్టొచ్చు. అయితే మీరు ఎంచుకున్న సిప్‌ మొత్తానికి కట్టుబడి ఉండడం ముఖ్యం. ఉదాహరణకు మీ నెలవారీ ఆదాయం రూ. 50 వేలు అనుకుందాం. అందులో ప్రతి నెలా రూ. 30 వేలు సిప్‌ చేయాలనుకోవడం సరైనదో కాదో చూసుకోవాలి. అధిక మొత్తం పెట్టుబడులకు కేయించాలనుకోవడంలో తప్పులేదు. కానీ వాస్తవికంగా దీర్ఘకాలంలో ఇది సాధ్యమేనా అని చూసుకోవాలి. ఇంటి ఖర్చులు, బీమా, రుణాలు ఇలా అనేక ఖర్చులు ఉంటాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌ వేసుకోవాలి. అప్పుడే మీరు ఎంత మొత్తం కేటాయించగలరో తెలుస్తుంది. దాని ప్రకారం ప్లాన్‌ చేసుకోండి. 

కనీస సిప్‌..

మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ ద్వారా కనీసం రూ. 500 నుంచి పెట్టుబడులను అనుమతిస్తారు. ప్రారంభంలో ఎక్కువ ఆదాయం లేనివారు చిన్న మొత్తంతో సిప్‌ను ప్రారంభించినా పర్వాలేదు. కానీ, కాలవ్యవధి మొత్తం ఇదే మొత్తంతో సిప్‌ చేయడం సరికాదు. మీ లక్ష్యం, అందుకు కావాల్సిన మొత్తానికి అనుగుణంగా సిప్‌ పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. 

అస్థిరత సమయంలో సిప్‌ రద్దు..

ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. స్వల్పకాలంలో అధిక ఒత్తిడికి గురవుతుంటాయి. మార్కెట్ల దిద్దుబాటు సమయంలో సిప్‌ను రద్దు చేయడం వల్ల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి మార్కెట్లు హెచ్చుతగ్గులు ఉన్ననప్పుడు ఓపిగ్గా ఉండాలే తప్ప సిప్‌ను రద్దు చేయడం సరికాదు. మార్కెట్ దిగువలో ఉన్నప్పుడు మదుపు చేస్తే అధిక యూనిట్స్ సమకూర్చుకోవచ్చని గమనించండి.

స్వల్పకాలంలో పనితీరు సమీక్షించండం..

సిప్‌లో పెట్టబుడులు పెట్టినప్పుడు అవి లక్ష్యాలకు అనుగుణంగా రాబడి అందిస్తున్నాయా? లేదా? అని సమీక్షించడంలో తప్పులేదు. ఇది అవసరం కూడా. కానీ, స్వల్పకాలంలో సమీక్షించడం మాత్రం మంచిది కాదు. కనీసం 18-24 నెలల పాటు చూసిన తర్వాత ఆశించిన స్థాయిలో రాబడి ఇవ్వకపోతే అప్పుడు దాని నుంచి నిష్క్రమించవచ్చు. అంతేగానీ ఒకటి, రెండు నెలలు మదుపు చేసి పనితీరు సరిగ్గా లేదని నిర్ధారణకు రాకూడదు.

సిప్‌ను దాటివేయడం..

సిప్‌లో క్రమం తప్పకుండా మదుపు చేస్తేనే ఆశించిన ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మధ్యలో కొన్ని వాయిదాలను దాటివేస్తే తుది రాబడిపై చాలా ప్రభావం ఉంటుంది. దీంతో మీ లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. కాబట్టి సిప్‌ను దాటివేయడం సరికాదు. 

చివరిగా..

సిప్‌ ద్వారా ప్రతి నెలా పెట్టుబడుల పెట్టడం వల్ల మీ ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు. లక్ష్యం, సమయం, నష్టభయం వంటి అనేక అంశాలను అనుసరించి ఆదర్శవంతమైన సిప్‌ పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ఇందుకోసం అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు