Rupee: వీరికి ఇష్టం.. వారికి కష్టం

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7 శాతం వరకు క్షీణించింది. సోమవారం డాలర్‌ విలువ రూ.80ను తాకినా, రూ.79.98 వద్ద స్థిరపడింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో డాలర్‌ మారకపు విలువ రూ.82కు చేరొచ్చని కొన్ని బ్రోకరేజీ

Updated : 19 Jul 2022 08:53 IST

రూపాయి క్షీణత రంగాలపై ప్రభావం

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7 శాతం వరకు క్షీణించింది. సోమవారం డాలర్‌ విలువ రూ.80ను తాకినా, రూ.79.98 వద్ద స్థిరపడింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో డాలర్‌ మారకపు విలువ రూ.82కు చేరొచ్చని కొన్ని బ్రోకరేజీ సంస్థలు, రూ.79కి పరిమితం కావచ్చని మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. రూపాయి క్షీణత ప్రభావం ఏ రంగంపై ఎలా ఉంటుందో చూద్దామా..


ఐటీ  

రూపాయి క్షీణత వల్ల అత్యధిక ప్రయోజనం పొందే రంగం ఐటీనే. ఈ కంపెనీల ఆదాయాల్లో 50-60 శాతం డాలర్లలో ఉండటమే ఇందుకు కారణం. రూపాయి విలువ 100 బేసిస్‌ పాయింట్లు క్షీణిస్తే, ఐటీ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 30 బేసిస్‌ పాయింట్లు పెరుగుతాయి. ప్రస్తుత పరిణామాలతో 115 బేసిస్‌ పాయింట్ల మేర ప్రయోజనం కలగొచ్చన్నది అంచనా. 


 ఔషధం 

ముడి సరుకులు 4-5 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటున్నా, నికరంగా ఎగుమతులే అధికమైనందున ఔషధ రంగానికీ  ప్రయోజనమే. 2021-22లో 24.62 బిలియన్‌ డాలర్ల దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం అమెరికాకే చేరాయి. ఈ విపణికి ఎగుమతి చేసే కంపెనీలు అత్యధికంగా లాభపడొచ్చు. దిగుమతులపై ఆధారపడే ఏపీఐ సంస్థల వ్యయాలు పెరగొచ్చు.


దుస్తులు 

ముడి సరకులను స్థానికంగానే సమీకరిస్తుండటం, ఎగుమతులు ఎక్కువగా చేస్తుండటం వల్ల ఈ రంగానికి లాభమే. రూపాయి విలువ ఒక్క శాతం క్షీణిస్తే, ఈ రంగ కంపెనీల లాభం 0.25- 0.50% పెరిగే అవకాశం ఉంటుంది.


తేయాకు   

దేశీయంగా ఉత్పత్తి అవుతున్న తేయాకులో 16 శాతం (సుమారు 230 మిలియన్‌ కిలోల) ఎగుమతి అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగ కంపెనీల లాభాలు 5-10 శాతం పెరగొచ్చన్నది అంచనా.


ఉక్కు 

దేశీయ ఉక్కు ఉత్పత్తుల్లో 10-15 శాతం వరకు ఎగుమతి చేస్తుండటం కలిసొచ్చే అంశం.  అంతర్జాతీయ విపణుల్లో దేశీయ ఉక్కు ఉత్పత్తుల పోటీ సామర్థ్యమూ మెరుగవుతుంది.  


చమురు- గ్యాస్‌ 

దేశ చమురు, గ్యాస్‌ అవసరాల్లో 85 శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. ఈ బిల్లు భారం అధికమవుతోంది. పెరిగిన భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయలేకపోతే కంపెనీల మార్జిన్లు క్షీణించవచ్చు. దేశీయంగా చమురు, గ్యాస్‌ ఉత్పత్తి చేసి, ఎగుమతి చేసే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నయారా ఎనర్జీకి కొంత మేర కలిసిరావచ్చు.


సౌర విద్యుత్‌ 

సౌర పలకలు, మాడ్యూళ్ల దిగుమతులపై దేశీయ సోలార్‌ ప్లాంట్లు ఎక్కువగా ఆధారపడినందున, ప్రాజెక్టుల వ్యయాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులకు మార్జిన్లూ తగ్గుతాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 1 శాతం తగ్గితే, యూనిట్‌కు 2 పైసలు మేర టారిఫ్‌లు పెరగొచ్చు.  


సిమెంటు 

సిమెంటు ఉత్పత్తి వ్యయంలో 50- 60% వరకు ఇంధనం, రవాణాదే. ఈ ఖర్చు మరింత పెరుగుతోంది కనుక కంపెనీల మార్జిన్లపైనా ప్రభావం పడొచ్చు.  


ఎఫ్‌ఎమ్‌సీజీ 

ముడి చమురు, పామోలిన్‌ సహా, సగం వరకు ముడి సరకులను దిగుమతి చేసుకుంటాయి కనుక, బిల్లు భారం అధికమవుతోంది. డాలర్‌ భారాన్ని, ఉత్పత్తుల ధరల పెంపు రూపేణ పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేయనందున.. ఈ రంగ కంపెనీలపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చు.


ఎలక్ట్రానిక్స్‌ 

గృహోపకరణాల తయారీ వ్యయంలో 40- 60%, సెల్‌ఫోన్లలో 70-80% వరకు దిగుమతి చేసుకునే విడిభాగాలే ఉంటాయి కనుక, ఈ రంగానికి ప్రతికూలాంశం.  


విమానయానం 

ఈ రంగ వ్యయాల్లో 60 శాతం వరకు (విడిభాగాలు, నిర్వహణ, విమాన డెలివరీ చెల్లింపులు, అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఇంధనం) చెల్లింపులు డాలర్ల రూపేణ జరుగుతుండటం వల్ల భారం పెరుగుతోంది.


టెలికాం  

 

నెట్‌వర్క్‌ గేర్‌ దిగుమతులపై వార్షికంగా టెలికాం పరిశ్రమ సుమారు 600 కోట్ల డాలర్లు (రూ.48,000 కోట్లు) వెచ్చిస్తోంది. ఈ వ్యయాలు మరింత పెరగొచ్చు.


వాహన 

మొత్తం ముడిపదార్థాల్లో 10-20% వరకు దిగుమతి చేసుకుంటుండటం ప్రతికూలమైనప్పటికీ.. వాహనాలను ఎగుమతి చేస్తుండటం కలిసొచ్చే అంశం. దీంతో డాలర్‌ మారకపు విలువ ప్రభావం పెద్దగా ఉండదు. 


 మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక, అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.16.08 మేర పడిపోయింది. 2014 డిసెంబరు 31న డాలర్‌ విలువ రూ.63.33 కాగా, 2022 జులై 11 నాటికి అది రూ.79.41కి  చేరినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు.


మోదీ హయాంలో రూపాయి ఎంత క్షీణించిందంటే..

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక, అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.16.08 మేర పడిపోయింది. 2014 డిసెంబరు 31న డాలర్‌ విలువ రూ.63.33 కాగా, 2022 జులై 11 నాటికి అది రూ.79.41కి  చేరినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ముడిచమురు ధరలు పెరిగిపోవడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం రూపాయి విలువ బలహీనం కావడానికి ప్రధాన కారణాలని ఆమె విశ్లేషించారు. బ్రిటిష్‌, జపాన్‌, యూరో కరెన్సీ విలువ పతనం కూడా రూపాయి కంటే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మూడింటితో భారతీయ రూపాయి విలువ 2022లో బలపడినట్లు పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడమూ రూపాయి విలువ తగ్గడానికి కారణంగా ఆమె తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌ మార్కెట్‌ నుంచి 14 బిలియన్‌ డాలర్లను ఉపసంహరించినట్లు వెల్లడించారు.


పెద్దనోట్ల రద్దు తర్వాత

89% పెరిగిన నగదు చెలామణి

నోట్ల సంఖ్యలో 45% వృద్ధి

ఈనాడు, దిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో నగదు చెలామణి 89% పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి సోమవారం లోక్‌సభకు తెలిపారు. 2016తో పోల్చుకుంటే 2022 నాటికి నోట్లు సంఖ్య పరంగా 45%, విలువ పరంగా 89% పెరిగినట్లు తేలింది. 2016 మార్చి నాటికి 90,266 మిలియన్‌ నోట్లు (విలువ రూ.16,41,571 కోట్లు) చెలామణిలో ఉండగా, 2022 నాటికి నోట్ల సంఖ్య 1,30,533 మిలియన్‌లకు, వాటి విలువ రూ.31,05,721 కోట్లకు చేరినట్లు చెప్పారు. ప్రభుత్వం నల్లధన చెలామణిని తగ్గించడానికి డిజిటల్‌ - తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ వైపు పయనించడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని