Higher pension: అధిక పింఛనుకు షరతుల అడ్డంకి
ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే వేతనజీవులు, కార్మికులు, ఉద్యోగుల అధిక పింఛను ఆశలకు షరతులు అడ్డుగా మారుతున్నాయి. వృద్ధాప్యంలో మెరుగైన పింఛను వస్తుందని భావించిన అర్హులైన ఉద్యోగులకు ఆ ఫలాలు అందకుండా ఈపీఎఫ్‌వో నిబంధనలు చేర్చింది.
పేరా 26(6) ప్రకారం ఆధారం జతచేయాలంటూ ఈపీఎఫ్‌ఓ నిబంధన
ఎక్కువ మంది లబ్ధి పొందకుండా అడ్డుకునే ప్రయత్నమంటున్న కార్మిక సంఘాలు
ఈనాడు, హైదరాబాద్: ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే వేతనజీవులు, కార్మికులు, ఉద్యోగుల అధిక పింఛను ఆశలకు షరతులు అడ్డుగా మారుతున్నాయి. వృద్ధాప్యంలో మెరుగైన పింఛను వస్తుందని భావించిన అర్హులైన ఉద్యోగులకు ఆ ఫలాలు అందకుండా ఈపీఎఫ్‌వో నిబంధనలు చేర్చింది. అధిక పింఛను పొందేందుకు సుప్రీంకోర్టు అవకాశమిస్తే కఠిన షరతుల పేరిట ఎవరూ అర్హులు కాకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఈపీఎఫ్‌వో గరిష్ఠ పరిమితికి (మూలవేతనం+డీఏ) మించి వేతనం పొందుతూ ఆ మేరకు వాస్తవిక వేతనంపై ఏళ్ల తరబడి ఉద్యోగి, యజమాని చెరో 12 శాతం చందా చెల్లిస్తున్నప్పుడు అనుమతించిన ఈపీఎఫ్‌వో, అధికవేతనంపై చందా చెల్లించేందుకు ఈపీఎఫ్ చట్టంలోని పేరా 26(6) కింద ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఈపీఎఫ్‌వో నుంచి అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నిస్తోంది. అధిక పింఛను కోరుకుంటున్న అర్హులైన ఉద్యోగులు యాజమాన్యాలతో కలిసి చట్టంలోని పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుతో ఈ పత్రాన్ని తప్పనిసరి జతచేయాలని షరతు పెట్టింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తూ అధిక వేతనంపై చందా కడుతున్న లక్షల మంది కార్మికులు అధిక పింఛను అవకాశం కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి.
ఏమిటీ పేరా 26 (6)?
ఈపీఎఫ్‌వో చట్టం ప్రకారం గరిష్ఠ వేతన పరిమితి 2014 సెప్టెంబరు 1కి ముందు రూ.6500, ఆ తరువాత రూ.15 వేలుగా ఉంది. చట్టంలోని నిబంధనల ప్రకారం గరిష్ఠ వేతన పరిమితికి మించి పొందుతున్న ఉద్యోగులు, ఇస్తున్న యజమాన్యాలు వాస్తవిక వేతనంపై 12 శాతం చొప్పున చందా చెల్లించేందుకు ఈపీఎఫ్ చట్టంలోని పేరా 26 (6) కింద ఈపీఎఫ్‌వో నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి. ఉద్యోగి, యజమాని కలిసి అధికవేతనంపై చందా చెల్లించడానికి అంగీకరిస్తున్నామని, ఈ మేరకు అవసరమైన ఫీజులు చెల్లిస్తామంటూ సహాయ పీఎఫ్ కమిషనర్‌కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాలి.
ప్రస్తుత పరిస్థితి..?
అధికవేతనంపై చందాకోసం 26(6) కింద చాలా మంది ఉద్యోగులు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేదు.కానీ ఉద్యోగులు, యాజమానులూ వాస్తవిక వేతనంపై 12 శాతం చొప్పున చందా చెల్లిస్తూ వచ్చారు. చందా చెల్లించినప్పుడు ఈపీఎఫ్‌వో అనుమతించింది. ఆ నగదుపై వడ్డీని జమ చేసింది. కానీ అధిక పింఛనుకు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులను దూరంచేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులో పేరా 26 (6) కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినట్టు ఆధారాన్ని జతచేయాలని ఆదేశించింది. ఈ ఆధారం లేకుంటే దరఖాస్తు ముందుకు వెళ్లడం లేదు. కొందరు ఉద్యోగులు, పింఛనుదారులు ఈపీఎఫ్‌వో కార్యాలయాల్లో సిబ్బందిని సంప్రదిస్తే పేరా 26(6) ఇవ్వకుంటే అధిక పింఛను వచ్చే అర్హత ఉండదని చెబుతున్నారు. అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులను దూరం చేసేందుకు పేరా 26(6) కింద ఆధారాన్ని సాకుగా చూపిస్తూ ప్రయత్నాలు చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అప్పుడలా... ఇప్పుడిలా...
అధిక పింఛనుపై సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినపుడు ఈపీఎఫ్‌వో పేరా 26(6) కింద అధిక వేతనంపై చందా చెల్లించేందుకు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. తాజాగా అధిక పింఛను సదుపాయం కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి ఆప్షన్ ఇవ్వాలని కచ్చితంగా పేర్కొంది. గతంలో ఆదేశాలు ఇలా ఉన్నాయి.- అధిక పింఛనుపై సుప్రీంకోర్టు 2015లో ఇచ్చిన తీర్పుతో ఈపీఎఫ్‌వో 2017 మార్చి 23న ప్రాంతీయ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల్లో ‘‘చందాదారులు ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితికి మించిన వేతనంపై 12 శాతం చందా చెల్లిస్తున్నపుడు ఆ వేతనంపై 8.33 శాతం పింఛను నిధికి నిధి జమచేయడాన్ని తిరస్కరించడానికి వీల్లేదు’’ అని తెలిపింది. అధిక వేతనంపై చందా చెల్లిస్తున్న సభ్యులు ఆ పూర్తి వేతనంపై పింఛను నిధికి 8.33 శాతం వాటా చెల్లించేందుకు అనుమతించాలని ఈపీఎఫ్‌వో లేఖ రాయగా కార్మికశాఖ సమ్మతించింది.
* 2019 జనవరి 22న ఇచ్చిన ఆదేశాల్లో.. ‘‘గరిష్ఠ వేతన పరిమితికి మించి యజమాని, ఉద్యోగి పేరా 26(6) కింద అధిక వేతనంపై చందాకు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వకుండా చందా చెల్లించినప్పుడు ఆ వివరాలు ఈపీఎఫ్‌వో వద్ద అప్‌డేట్ అయితే ఆ ఉద్యోగి నుంచి పేరా 26(6) కింద ఉమ్మడి ఆప్షన్ అడగడానికి వీల్లేదు’’
హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి 30 ఏళ్లుగా ఈపీఎఫ్ చందాదారుడిగా ఉన్నారు. మరో ఏడాదిలో పదవీ విరమణ చేయనున్నారు. ఉద్యోగికి వేతనం (బేసిక్, డీఏ కలిపి) రూ.50 వేలు ఉంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఉద్యోగి, యజమాని ఇద్దరూ వాస్తవిక వేతనంపై 12 శాతం చొప్పున చెల్లిస్తూ వస్తున్నారు. సుప్రీంకోర్టు అధికవేతనం పొందుతున్న ఉద్యోగులకు అధిక పింఛనుకు అవకాశమివ్వడంతో పేరా 11(3) కింద యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ప్రయత్నించారు. అధికవేతనంపై చందా చెల్లిస్తున్నప్పటికీ, ఆ చెల్లింపునకు 26(6) కింద అనుమతి పత్రాన్ని జత చేయాలనే నిబంధన చేర్చింది. ఇన్నేళ్లు వాస్తవిక వేతనంపై చందా స్వీకరించిన ఈపీఎఫ్‌వో ఇప్పుడు ఆప్షన్ ఆధారాన్ని అడగడంతో ఆ ఉద్యోగి ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలమందిది ఇదే పరిస్థితి.
పేరా 26(6) కింద అనుమతించినట్టుగా భావించాలి
పేరా 26(6) కింద అనుమతి జతచేయడం ఇప్పుడు సాధ్యం కాదు. దాదాపు 25-30 ఏళ్లుగా యజమానులు, కార్మికులు గరిష్ఠ వేతన పరిమితికి మించి చందా చెల్లించారు. చందా కట్టినప్పుడు ఈపీఎఫ్‌వో అనుమతించింది. వడ్డీ కూడా చెల్లించారు. యాజమాన్యాలు వాస్తవిక వేతనంపై 1 శాతం పరిపాలన ఛార్జీలు చెల్లించాయి. ఇన్నిరోజులు ఫీజులు, చందా తీసుకుని ఇప్పుడు కార్మికులకు ప్రయోజనాలు ఎగ్గొట్టేందుకు ఈపీఎఫ్‌వో ప్రయత్నాలు చేయడం సరికాదు. ఈపీఎఫ్ మినహాయింపు సంస్థల్లోని ఉద్యోగుల చందా చెల్లింపులపై తరచూ తనిఖీలు చేసి, తనిఖీ ఛార్జీలు వసూలు చేశారు. అధికవేతనంపై చందా చెల్లించిన ఉద్యోగులు, యజమాన్యాలు 26(6) కింద ఆప్షన్ ఇచ్చినట్టుగా భావించి, అందరినీ అనుమతించాలి. ఈ విషయమై వెంటనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) మీటింగ్ పెట్టాలని కోరుతూ ఈపీఎఫ్‌వోకు లేఖ రాశాను.
సుంకరి మల్లేశం, సెంట్రల్ ట్రస్టీ బోర్డు సభ్యుడు, ఈపీఎఫ్‌వో
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది