Union Budget 2024: కొత్తవి లేవు.. పాత వాటికే అరకొర నిధులు

కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖకు చేసిన కేటాయింపుల్లో రాష్ట్రానికి ఊరట కలిగించే అంశాలేమీ లేవు. నూతన రైల్వే లైన్లు, డబ్లింగ్‌, రైల్వే టెర్మినల్‌, భారీ ప్రాజెక్టులేవీ మంజూరు కాలేదు.

Updated : 02 Feb 2024 07:11 IST

నూతన లైన్లు, డబ్లింగ్‌ మంజూరు లేదు
బీబీనగర్‌-గుంటూరు రెండో లైనుకు మోక్షం
రాష్ట్రానికి మొత్తం రూ.5,071 కోట్ల కేటాయింపు
కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపుల తీరిది

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖకు చేసిన కేటాయింపుల్లో రాష్ట్రానికి ఊరట కలిగించే అంశాలేమీ లేవు. నూతన రైల్వే లైన్లు, డబ్లింగ్‌, రైల్వే టెర్మినల్‌, భారీ ప్రాజెక్టులేవీ మంజూరు కాలేదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవి, పాత ప్రాజెక్టులకే నిధులు కేటాయించారు. గతేడాది రాష్ట్రానికి ఇచ్చిన రూ.4,418 కోట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 12.8% పెంచి రూ.5,071 కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్‌-గుంటూరు వయా నల్గొండ, మిర్యాలగూడ రెండోలైనుకు అయిదేళ్ల తర్వాత నిధులు కేటాయించడం కాస్త ఉపశమనం.

ఏ పథకంలో ఇస్తారో?

కీలకమైన సికింద్రాబాద్‌, ‘అమృత్‌ భారత్‌’ స్టేషన్ల పునరాభివృద్ధి పనులను ప్రస్తావించలేదు. వీటికి నిధులు ఏ పద్దు కింద ఇస్తారో స్పష్టం కావాల్సి ఉంది. ముంబయి మార్గంలో కీలకమైన లింగంపల్లి-వికారాబాద్‌ సెక్షన్‌కు రెండో లైను మంజూరు కాలేదు. సర్వే పూర్తయిన కాజీపేట-హుజూరాబాద్‌-కరీంనగర్‌ ప్రతిపాదిత రైల్వేలైనూ మంజూరు కాలేదు. ఘట్‌కేసర్‌-కాజీపేట వరకు మూడో లైను నిర్మిస్తే దిల్లీ, విజయవాడ వైపు రాకపోకలు సులభమవుతాయి. ఈ ప్రాజెక్టునూ పట్టించుకోలేదు. నిర్మాణంలో ఉన్న మూడో లైను ప్రాజెక్టులకు ఈసారి నిధులు తగ్గాయి. హైదరాబాద్‌లో ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేలా నగరం చుట్టూ నాగులపల్లి, శంషాబాద్‌, మేడ్చల్‌ ప్రాంతాల్లో కొత్త టెర్మినళ్ల డిమాండ్‌ను పరిశీలించనే లేదు.

కొత్త రైల్వే లైన్లకు నిధులు

  • మనోహరాబాద్‌-కొత్తపల్లి: గతేడాది రూ.185 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.350 కోట్లు కేటాయించారు.
  • మణుగూరు-రామగుండం: 2013-14లో మంజూరైన ఈ ప్రాజెక్టు నిడివి 200 కి.మీ. జాప్యం వల్ల అంచనా వ్యయం రూ.1,112 కోట్ల నుంచి రూ.2,911 కోట్లకు పెరిగింది. గతేడాది రూ.10 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.5 కోట్లకే పరిమితం చేశారు.
  • భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి: నిర్మాణం పూర్తయ్యింది. చిన్నపాటి పనులకు రూ.6.12 కోట్ల కేటాయింపు.
  • భద్రాచలం రోడ్‌-కొవ్వూరు: 2012-13లో మంజూరైంది. ఆలస్యంతో అంచనా వ్యయం రూ.1,445 కోట్ల నుంచి రూ.2,154.83 కోట్లకు పెరిగింది. ఈసారి కేటాయించింది రూ.10 లక్షలే.

డబ్లింగ్‌, థర్డ్‌ లైన్లు

  • బీబీనగర్‌-గుంటూరు: 248 కి.మీ. పొడవైన లైన్‌ ఇది. తెలుగు రాష్ట్రాల మధ్య రద్దీ దృష్ట్యా రెండోలైను నిర్మిస్తే ఎంతో వెసులుబాటు. 2019-20 లోనే ఇది మంజూరైనా నిధులు రాలేదు. అంచనా వ్యయం రూ.2,480 కోట్ల నుంచి రూ.2,853 కోట్లకు పెరిగింది. గతేడాది రూ.60 కోట్లు, ఇప్పుడు రూ.200 కోట్లు ఇవ్వడంతో పనులు మొదలవ్వచ్చు.
  • కాజీపేట-విజయవాడ మూడో లైను: గతేడాది రూ.337.52 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.310 కోట్లే.
  • కాజీపేట-బల్లార్ష మూడో లైను: కేటాయింపు రూ.300 కోట్లే. గతేడాది రూ.450.86 కోట్లు.

ఇతర ప్రాజెక్టులకు..

  • కాజీపేట పీఓహెచ్‌ వర్క్‌షాప్‌: తొలుత వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ మంజూరు చేశారు. తర్వాత వ్యాగన్ల ఉత్పత్తి, ఆపై వ్యాగన్లు, ఇంజిన్ల ఉత్పత్తితో ‘రైల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌’ (ఆర్‌ఎంయూ)గా మార్చారు. ఈ ఏడాది రూ.150 కోట్లు కేటాయించారు. గత ఏడాది రూ.160 కోట్లు ఇచ్చారు. నిర్మాణపనులు ప్రారంభం కావాల్సి ఉంది.
  • చర్లపల్లి టెర్మినల్‌: ఈసారి రూ.46 కోట్లు కేటాయించారు. నిర్మాణపనులు తుది దశలో ఉన్నాయి.

ద.మ.రైల్వే జోన్‌కు నిధులు ఇలా..

ద.మ.రైల్వే జోన్‌ పరిధిలో తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్రలో కొంతభాగం ఉంది. మొత్తంగా ద.మ.రైల్వేకి ఈసారి కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గతేడాది రూ.13,786.19 కోట్లు కేటాయించగా, ఈసారి అది రూ.14,232.83 కోట్లకు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని