ఈసారీ డిజిటల్‌ పద్దే

మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గతేడాదిలాగే ఈసారి కూడా కాగితరహిత బడ్జెట్‌ విధానాన్ని ఉపయోగించారు.

Updated : 02 Feb 2024 05:28 IST

బహీ ఖాతాలో ట్యాబ్‌ను తీసుకెళ్లిన నిర్మల

దిల్లీ: మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గతేడాదిలాగే ఈసారి కూడా కాగితరహిత బడ్జెట్‌ విధానాన్ని ఉపయోగించారు. ఇందుకోసం సంప్రదాయ ‘బహీ ఖాతా’(వస్త్రం లాంటి సంచి)లో ట్యాబ్‌ను తీసుకెళ్లారు. రాష్ట్రపతిని కలిసే ముందు అధికారులతో కలిసి ఆమె తన కార్యాలయం ఎదుట ఫోటోలు దిగారు. డిజిటల్‌ విధానంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు బ్రీఫ్‌కేస్‌కు బదులుగా ట్యాబ్‌ను తీసుకెళ్లారు. ఎర్రటి వస్త్రం మీద బంగారు వర్ణంలో జాతీయచిహ్నం ముద్రించి ఉన్న సంచితో రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆర్థికమంత్రి.. రాష్ట్రపతిని కలిసి అక్కడి నుంచి నేరుగా పార్లమెంటుకు వెళ్లారు.

కొత్త సంప్రదాయానికి నాంది

2019లో ఆర్థికశాఖ బాధ్యతలు స్వీకరించిన నిర్మల..దేశంలో పూర్తిస్థాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థికమంత్రిగా రికార్డు నెలకొల్పారు.  బ్రిటిష్‌ కాలంలో ఉపయోగించిన ‘బ్రీఫ్‌కేస్‌’ విధానం స్థానంలో ‘ట్యాబ్‌లెట్‌’ పద్ధతి తెచ్చి కొత్త సంప్రదాయానికి నాందిపలికారు.  భాజపా ప్రభుత్వం 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికమంత్రిగా నిర్మలను నియమించారు. అదే ఏడాది జులై 5న ఆమె తొలిసారిగా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విదేశీ పాలన నుంచి స్వాతంత్య్రం పొంది ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ వారి విధానాలను అనుసరించడమేంటని ప్రశ్నించారు. బ్రిటిష్‌ సంప్రదాయానికి ‘బహీ ఖాతా’విధానంతో స్వస్తి పలికామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని