మరిన్ని వైద్య కళాశాలలు.. అంగన్‌వాడీలకు ఆరోగ్య రక్ష

ప్రస్తుతం దేశంలో గల ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది.

Updated : 02 Feb 2024 05:37 IST

ప్రస్తుతం దేశంలో గల ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ అంశాన్ని పరిశీలించి, సిఫారసులు చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు.


తొమ్మిది నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలికలకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ నిరోధక టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్రం ప్రోత్సహించనుంది. తాజా గణాంకాల ప్రకారం ఏటా దేశంలో 80 వేల మంది గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. 35 వేల మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు.


మాతా శిశు సంరక్షణకు సంబంధించిన అన్ని రకాల పథకాలను ఓ సమీకృత కార్యక్రమం కిందకు తీసుకురానున్నారు.


బాలల సంరక్షణ, అభివృద్ధికి మెరుగైన పోషకాహార పంపిణీ కోసం సక్షామ్‌ అంగన్‌వాడీ-పోషణ్‌ 2.0 కింద అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునికీకరించనున్నారు.


దేశంలోని ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద లబ్ధిదారు కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమాను కల్పిస్తున్నారు. గతేడాది డిసెంబరు 27 నాటి 12 కోట్ల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మంది ఈ పథకం పరిధిలోకి వచ్చారు.


దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు,  పిల్లల్లో రోగ నిరోధకత పెంచడం కోసం తీసుకొచ్చిన ‘మిషన్‌ ఇంద్రధనుస్సు’ పథకం సమర్థ అమలుకు యూ-విన్‌ వేదికను వేగవంతంగా విస్తరిస్తారు. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండేసి జిల్లాల్లో యూ-విన్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీని కింద దేశ టీకా కార్యక్రమాన్ని డిజటలీకరిస్తారు.


దిల్లీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని