ఆస్తి పత్రాలు కనిపించకపోతే

స్థిరాస్తి ఏదైనా కావచ్చు. దానికి మనం యజమానులం అని నిరూపించేది ఆస్తి యాజమాన్య పత్రాలే. ఇల్లు, ప్లాటు,వ్యవసాయ భూమి ఇలా ఆస్తుల హక్కులను గుర్తించడంలో యాజమాన్య దస్తావేజులు (టైటిల్‌ డీడ్‌) కీలక పాత్ర పోషిస్తాయి.

Updated : 06 Jan 2023 07:23 IST

స్థిరాస్తి ఏదైనా కావచ్చు. దానికి మనం యజమానులం అని నిరూపించేది ఆస్తి యాజమాన్య పత్రాలే. ఇల్లు, ప్లాటు, వ్యవసాయ భూమి ఇలా ఆస్తుల హక్కులను గుర్తించడంలో యాజమాన్య దస్తావేజులు (టైటిల్‌ డీడ్‌) కీలక పాత్ర పోషిస్తాయి. ఆస్తి కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తర్వాతే అధికారికంగా మన పేరుమీదకు మారుతుంది. మరి, ఇంతటి ముఖ్యమైన ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటి సందర్భాలు కొన్నిసార్లు ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.

ఒక ఆస్తికి సంబంధించి చట్టపరమైన హక్కును తెలియజేసేదే టైటిల్‌ డీడ్‌. స్థిరాస్తికి సంబంధించిన అసలు పత్రాలు (ఒరిజినల్‌) లేకపోతే స్థలం, భూమి విషయంలో కొన్నిసార్లు వివాదాలు ఏర్పడతాయి. ఆ ఆస్తిపై హక్కులు నిరూపించుకోవడం కష్టమవుతుంది. అనుకోని పరిస్థితుల్లో మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు పోతే నకలు (డూప్లికేట్‌ లేదా సర్టిఫైడ్‌ కాపీలు) పొందేందుకు వీలుంటుంది. దీనికోసం కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

ఫిర్యాదు చేయాలి..

ఆస్తికి సంబంధించిన పత్రాలు పోయినా, లేదా దొంగతనం జరిగినా వెంటనే మీ దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ (ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌) లేదా ఎన్‌సీఆర్‌ (నాన్‌ కాగ్నిజిబుల్‌ రిపోర్ట్‌)ను ఫైల్‌ చేయాలి. దానికి సంబంధించిన ఒక కాపీని మీ వద్ద భద్రపరుచుకోవాలి. ఇది భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది. ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసిన తర్వాత మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు మీ పత్రాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. పత్రాలు లభించకపోతే నాన్‌-ట్రేసబుల్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌టీసీ)ను జారీచేస్తారు. ఎన్‌టీసీ వాస్తవంగా నష్టం జరిగిందని తెలియజేస్తుంది. డూప్లికేట్‌ ఆస్తి పత్రాలను పొందేందుకు కావాల్సిన కీలక పత్రం ఇది. అలాగే, దుర్వినియోగం లేదా మోసాలను నివారించడంలోనూ సహాయపడుతుంది. ఎఫ్‌ఐఆర్‌ను ఆస్తి ఉన్న ప్రదేశంలోని సమీప పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేయనవసరం లేదు. ఆస్తి దేశంలో ఎక్కడ ఉన్నా వ్యక్తులు తాము నివసించే ప్రదేశానికి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేయవచ్చు.

ప్రకటన ఇవ్వాలి..

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత.. దీనికి సంబంధించిన నోటీసును కనీసం రెండు వార్తా పత్రికల్లో వచ్చేట్లు చూసుకోవాలి. ఒకటి ఆంగ్లంలో, మరొకటి స్థానిక భాషలో ఉండాలి. ఆస్తికి సంబంధించిన మొత్తం వివరాలు, పోగొట్టుకున్న పత్రాలు, మీ సంప్రదింపు వివరాలతో ప్రకటన ఇవ్వాలి. ఒకవేళ పోయిన పత్రాలు వేరొకరికి దొరికి ఉంటే.. వారు ఆస్తి యజమానికి తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది.  ఈ నోటీసు ద్వారా యజమాని ఆస్తికి ఉన్న యాజమాన్య హక్కును క్లెయిం చేస్తూ ప్రజలకు సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఆస్తికి సంబంధించి ప్రజల్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ప్రచురణ తేదీ నుంచి 15 రోజుల లోపు క్లెయిం చేసేందుకు ఆహ్వానిస్తూ ఈ నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసు ఇచ్చేందుకు న్యాయవాది లేఖతోపాటు, తగిన  కారణాలను వివరిస్తూ నోటరీ చేసిన అఫిడవిట్‌లను అందించాల్సి ఉంటుంది.

ఎన్‌ఓసీ తీసుకోవచ్చు..

అపార్ట్‌మెంటు లేదా హౌసింగ్‌ సొసైటీలో ఆస్తి ఉంటే.. సంబంధిత రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఆర్‌డబ్ల్యూఏ) నుంచి డూప్లికేట్‌ షేర్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు ఎఫ్‌ఐఆర్‌ కాపీని, వార్తాపత్రికలో ముద్రించిన నోటీసు ప్రతిని ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇచ్చిన తర్వాత ఆర్‌డబ్ల్యూఏ సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రాలను పరిశీలించి, సంఘటన నిజమని తేలితే డూప్లికేట్‌ షేర్‌ సర్టిఫికెట్‌ కాపీని జారీ చేస్తారు. అయితే దీని కోసం కొంత రుసుములను వసూలు చేస్తారు. అలాగే తదుపరి లావాదేవీల కోసం నాన్‌-అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌(ఎన్‌ఓసీ) తీసుకోవచ్చు. హౌసింగ్‌ సొసైటీలోని ప్రతి సభ్యుడికీ షేర్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఇది ఆ వ్యక్తికి సొసైటీలో ఉన్న ఆస్తి షేర్‌ను తెలియజేస్తుంది.

నోటరీ చేయించాలి..

డూప్లికేట్‌ సర్టిఫికెట్‌ కాపీ కోసం దరఖాస్తు చేసుకునే ముందు.. రూ.10 నాన్‌ జుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై అఫిడవిట్‌ నోటరీ చేయించాలి. ఇందులో ఎఫ్‌ఐఆర్‌ నంబరుతో పాటు, ఆస్తికి సంబంధించిన (పోయిన) పత్రాల వివరాలు, వార్తా పత్రికలలో ప్రచురించిన నోటీసు, ప్రచురణ చెల్లుబాటుకు సంబంధించిన లాయర్‌ సర్టిఫికెట్‌, దరఖాస్తు చేయడానికి గల కారణాన్ని పేర్కొనాలి.

డూప్లికేట్‌ పత్రాలు..

15 రోజుల నోటీసు వ్యవధి ముగిసిన తర్వాత, మీరు తప్పనిసరిగా సంబంధిత సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సందర్శించి, ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలు, పోగొట్టుకున్న పత్రాల వివరాలు, ఎఫ్‌ఐఆర్‌ కాపీ, నాన్‌ ట్రేసబుల్‌ సర్టిఫికెట్‌, నోటరీ అఫిడవిట్‌లను సమర్పించి డూప్లికేట్‌/సర్టిఫైడ్‌ కాపీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సబ్‌-రిజిస్టార్ర్‌ కార్యాలయం నుంచి 7 నుంచి 10 పని దినాల్లో డూప్లికేట్‌ సేల్‌ డీడ్‌ లేదా టైటిల్‌ డీడ్‌ కాపీని పొందుతారు. డూప్లికేట్‌ ఆస్తి పత్రాలు సబ్‌ రిజిస్టార్ర్‌ ఆమోదంతో స్టాంపింగ్‌తో పొందుతారు కాబట్టి ఇవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ఈ సర్టిఫైడ్‌ కాపీ ద్వారా ఆస్తి క్రయవిక్రయాలతో పాటు రుణ దరఖాస్తు వంటి లావాదేవీలనూ నిర్వహించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని