పాలసీ.. రూ.5 కోట్ల వరకూ

అందుబాటు ధరలో ఎక్కువ బీమా రక్షణ ఇచ్చేలా డిజిటల్‌ బీమా సంస్థ జునో జనరల్‌ ఇన్సూరెన్స్‌ సరికొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చింది.

Updated : 05 Jan 2024 05:59 IST

అందుబాటు ధరలో ఎక్కువ బీమా రక్షణ ఇచ్చేలా డిజిటల్‌ బీమా సంస్థ జునో జనరల్‌ ఇన్సూరెన్స్‌ సరికొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చింది.    ఈ జునో హెల్త్‌ప్లస్‌ పాలసీని రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకూ తీసుకునేందుకు వీలుంది. గది అద్దెల విషయంలో ఎలాంటి పరిమితులనూ విధించడం లేదు. పాలసీ మొత్తం పూర్తయినప్పుడు, అపరిమితంగా రీస్టోర్‌ అవుతుంది. పాలసీ ఏడాదిలో ఎలాంటి క్లెయిమూ చేసుకోకపోతే రెండేళ్లలో పాలసీ విలువ రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. వ్యాధుల పరంగానూ, వయసు పరంగానూ ఎలాంటి సహ చెల్లింపు నిబంధననూ వర్తింపచేయడం లేదు. కుటుంబంలో మొత్తం 9 మందిని ఒకే పాలసీ కిందకు తీసుకురావచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 20 శాతం వరకూ ప్రీమియంలో రాయితీని అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. వెబ్‌సైటు నుంచి కొనుగోలు చేసిన వారికి ప్రీమియంలో 15 శాతం తగ్గింపును వర్తింపచేస్తోంది. 55 ఏళ్ల లోపు వారు రూ.20లక్షల వరకూ పాలసీ తీసుకుంటే వైద్య పరీక్షల అవసరమూ ఉండదు. మారుతున్న వైద్య అవసరాలకు తగ్గట్లుగా ఈ పాలసీని రూపొందించినట్లు సంస్థ ఎండీ, సీఈఓ షానై ఘోష్‌ తెలిపారు. ఆధునిక చికిత్సలకూ ఈ పాలసీ వర్తిస్తుందన్నారు.


రుణ పత్రాల్లో..

దిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక ఎఫ్‌ఎంపీ (ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌)ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌-సిరీస్‌ యూఎస్‌ (100 రోజులు) అనే ఈ పథకం నిర్ణీత కాలవ్యవధి ఉన్న రుణ పత్రాలు, మనీ మార్కెట్‌ పత్రాల్లో పెట్టుబడి పెడుతుంది. ఇది క్లోజ్‌ ఎండెడ్‌ పథకం. న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ఈ నెల 9న ముగుస్తుంది. కొనుగోలు రుసుము లేదు. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.1,000 పెట్టుబడిగా పెట్టాలి. ఇటీవలి కాలంలో రుణ పత్రాలపై రేట్లు ఎంతగానో పెరిగిన విషయం గమనార్హం. దీనివల్ల రుణ పత్రాలపై మదుపరుల్లో కొంత ఆసక్తి పెరిగింది. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఎఫ్‌ఎంపీ పథకాలను మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు తీసుకొస్తున్నాయి. ఈ కోవలేనో ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. టార్గెట్‌ మెచ్యూరిటీ పథకాలతో పోలిస్తే ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ పథకాల్లో లిక్విడిటీ కొంత తక్కువ. మదుపరులు ఈ అంశాన్ని పరిశీలించాలి.


బంగారం,  వెండిలో మదుపు...

బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టేందుకు రెండు ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజి ట్రేడెడ్‌ ఫండ్‌) పథకాలను టాటా మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకువచ్చింది. ఇందులో ఒకటి టాటా గోల్డ్‌ ఈటీఎఫ్‌ కాగా, మరొకటి టాటా సిల్వర్‌ ఈటీఎఫ్‌.

టాటా గోల్డ్‌ ఈటీఎఫ్‌, సిల్వర్‌ ఈటీఎఫ్‌ల ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 9. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి. ఎంట్రీ, ఎగ్జిట్‌ లోడ్‌ లేవు.

ఈ రెండు ఓపెన్‌ ఎండెడ్‌ పథకాలు. సాధారణంగా మార్కెట్లో బంగారం, వెండి కదలికల ఆధారంగా ఈ పథకాల యూనిట్ల విలువ ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలంలో స్థిరమైన ప్రతిఫలాన్ని ఆశించే మదుపరులకు ఈ పథకాలు అనువుగా ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని