మీ ఇంటి బడ్జెట్‌ సిద్ధమేనా?

బడ్జెట్‌ అంటే కేవలం ఆదాయ, వ్యయాల లెక్కలే కాదు. ఒక్కో లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నిధుల కేటాయింపులు, వాటిని సమీకరించే మార్గాలు ఇలా అనేకం ఉంటాయి. ఆదాయాన్ని పెంచుకుంటూ, అభివృద్ధిని సాధించే దిశగా ప్రయత్నాలూ ఉంటాయి.

Updated : 02 Feb 2024 09:20 IST

దేశ ఆర్థిక పరిస్థితిని వెల్లడిస్తూ.. భవిష్యత్‌ వృద్ధికి మార్గనిర్దేశం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని, మనమూ ఇంటి బడ్జెట్‌ను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు కాబట్టి, మధ్యంతర బడ్జెట్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈనేపథ్యంలో మన ఆర్థిక ప్రణాళికలనూ ఒకసారి సరిచూసుకునేందుకు ఇది ఒక మంచి తరుణం.

ఆదాయం రాక...

బడ్జెట్‌ అంటే కేవలం ఆదాయ, వ్యయాల లెక్కలే కాదు. ఒక్కో లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నిధుల కేటాయింపులు, వాటిని సమీకరించే మార్గాలు ఇలా అనేకం ఉంటాయి. ఆదాయాన్ని పెంచుకుంటూ, అభివృద్ధిని సాధించే దిశగా ప్రయత్నాలూ ఉంటాయి. మన ఇంటి బడ్జెట్‌ సైతం ఈ దిశగానే సాగాలి. మీకు నెలవారీ వచ్చే ఆదాయంపై మీకు సంపూర్ణ అవగాహన ఉండాలి. ఉద్యోగం చేస్తున్నా, వృత్తి నిపుణులు, వ్యాపారంలో ఉన్నా.. ఎంత సంపాదిస్తున్నామన్నది ముందు తెలుసుకోవాలి. నెలవారీ వచ్చే వేతనం, మధ్యలో వచ్చే బోనస్‌లు, ఇతర ఆదాయాలు తదితరాలు ఏటా ఎంత వరకూ రావచ్చు అనేది చూసుకోవాలి. కొందరికి నగదు రూపంలో ప్రయోజనాలు అందుతాయి. మరికొందరికి షేర్ల రూపంలో ఆదాయం లభిస్తుంది. డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల నుంచి వడ్డీ ఆదాయం, డివిడెండ్లు, మూలధన లాభాలు.. స్థిరాస్తుల నుంచి వచ్చే అద్దెలు ఇలా ప్రతి రూపాయినీ మీ ఆదాయంలో భాగంగా లెక్కలోకి తీసుకోవాలి.
కొన్నిసార్లు అనుకున్న ఆదాయంలో అంతరాయం రావచ్చు. ఉద్యోగం కోల్పోవడంలాంటి సంఘటనలు ఎదురవుతాయి. అద్దె ద్వారా వస్తున్న ఆదాయం ఆగిపోవచ్చు. ఇలాంటి ఆకస్మిక సందర్భాలకూ సిద్ధంగా ఉండి, అంచనాలను తయారు చేసుకోవాలి. అప్పుడే మీ ఆదాయంపై ఒక స్థిరమైన అవగాహన వస్తుంది.

ఖర్చుల మాటేమిటి?

పన్నుల రూపంలో: సంపాదిస్తున్న ఆదాయం మొత్తం మనం ఉపయోగించుకోలేం. ప్రత్యక్ష పన్నులు, మూలధన లాభాలపై పన్ను, ఇంటి నుంచి వచ్చే ఆదాయం, ఇతర ఆదాయాలపై పన్నులు ఉంటాయి. వీటికి వివిధ పన్ను రేట్లు ఉంటాయి. మీరు ఉపయోగించే వస్తువులు, సేవలపై జీఎస్‌టీలాంటివి చెల్లించాలి. కాబట్టి, ఏడాదికి ఎంత పన్ను చెల్లిస్తామనే అంశాలపై స్పష్టత ఉండాలి. అందుకు అనుగుణంగా సిద్ధం కావాలి.
వడ్డీ: ఇల్లు, వాహనం కొనేందుకు అప్పు చేస్తాం. పిల్లల చదువుల కోసం విద్యా రుణం, వ్యక్తిగత రుణంలాంటివీ తీసుకుంటాం. ఈ రుణాలన్నింటికీ చెల్లించే వడ్డీని ఖర్చు కిందే పరిగణించాలి. ఈఎంఐలో ఎంత భాగం వడ్డీకి వెళ్తుందో చూసుకోవాలి. మీ మొత్తం ఆదాయంలో ఇలా చెల్లించే వడ్డీ ఎంత మేరకు ఉండాలన్నది మీరు నిర్ణయించుకోవాలి. అధిక వడ్డీ భారం ఉంటే.. ఆర్థిక ప్రణాళికలు ముందుకు సాగవు.

తప్పనిసరి అవసరాలు...

ప్రభుత్వానికి రోజువారీ ఎన్నో ఖర్చులుంటాయి. జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అనేక ఇతర బాధ్యతలూ ఉంటాయి. మనకూ ఇలాంటి తప్పనిసరి ఖర్చులు కొన్ని ఉంటాయి. ఇంటి అద్దె చెల్లించడం, నిత్యావసరాల కొనుగోలు, బిల్లుల చెల్లింపులు, ఇంటి నిర్వహణ ఖర్చుల్లాంటివి ఉంటాయి. పిల్లల ఫీజులు, ప్రయాణ ఖర్చులు, వైద్యం, దుస్తులు, ఇతర ఖర్చులన్నింటినీ లెక్కలోకి తీసుకోవాలి. కనీసం రెండు మూడు నెలల సగటు ఖర్చులను పరిశీలించినప్పుడే.. వీటి గురించి సంపూర్ణ అవగాహన వస్తుందని మర్చిపోవద్దు.

మూలధన వ్యయాలూ చూడాలి..

మీ పిల్లలకు ల్యాప్‌టాప్‌ కొనుగోలు, ఇంటికి అవసరమైన గృహోపకరణాలూ, కొత్త కారు కొనడంలాంటి మూలధన వ్యయాలనూ లెక్కలోకి తీసుకోవాలి. వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకునేందుకూ కొంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యయాలన్నింటినీ అంచనా వేసేందుకు ఉన్న మార్గం ఏమిటంటే..
గత రెండేళ్లుగా మీ క్రెడిట్‌ కార్డు, బ్యాంకు స్టేట్‌మెంట్లను జాగ్రత్తగా గమనించండి. అదనంగా ఈ ఖర్చులపై ద్రవ్యోల్బణాన్నీ లెక్కించాలి. వినియోగ ద్రవ్యోల్బణం ఆరు శాతం వరకూ ఉందని అనుకుంటే.. మీ ఖర్చులు భవిష్యత్తులో ఏటా ఆరు శాతం మేరకు పెరుగుతాయని అర్థం. అదే సమయంలో జీవన శైలి ద్రవ్యోల్బణం ఇంతకన్నా అధికంగా ఉండొచ్చు.

లోటు లేకుండా..

ప్రభుత్వానికి ఆదాయం, వ్యయాల మధ్య లోటు ఉంటే.. అప్పులు, పన్నులు పెంచడంలాంటి ఇతర మార్గాల ద్వారా ఆ అంతరాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, మన సంగతి అలా కాదు. వచ్చిన ఆదాయానికీ, ఖర్చులకూ మధ్య పొంతన ఉండేలా బడ్జెట్‌ తయారు చేసుకోవాలి. లోటు ఉన్నప్పుడల్లా రుణాలు తీసుకుంటే.. దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది.
ఇంటి బడ్జెట్‌ను సమర్థంగా రూపొందించుకొని, దాన్ని వంద శాతం ఆచరణలో పెట్టినప్పుడే ఆర్థిక విజయం సాధిస్తామని గుర్తుంచుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని