ఐటీ ‘అడ్వైజరీ’ వచ్చిందా?

ఆదాయపు పన్ను చెల్లింపుదారుల్లో కొంతమందికి ఐటీ విభాగం నుంచి సూచనలు (అడ్వైజరీ) అందుతున్నాయి. ప్రధానంగా ఐటీఆర్‌లో పేర్కొన్న విషయాలకూ, వాస్తవ వివరాలకూ సరిపోలడం లేదనే వివరాలతో ఇవి వస్తున్నాయి

Published : 29 Dec 2023 00:12 IST

ఆదాయపు పన్ను చెల్లింపుదారుల్లో కొంతమందికి ఐటీ విభాగం నుంచి సూచనలు (అడ్వైజరీ) అందుతున్నాయి. ప్రధానంగా ఐటీఆర్‌లో పేర్కొన్న విషయాలకూ, వాస్తవ వివరాలకూ సరిపోలడం లేదనే వివరాలతో ఇవి వస్తున్నాయి. కొంతమందికి అధిక విలువగల లావాదేవీలు చేసినట్లు పేర్కొంటూ ఈ సూచనలు అందుతున్నాయి. మరి, వీటికి ఎలా సమాధానం ఇవ్వాలి?

ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేటప్పుడు పూర్తి వివరాలు తెలియజేయాల్సిందిగా ఐటీ విభాగం సూచనలు చేసింది. కొంతమంది అధిక విలువగల లావాదేవీలు చేసినా తెలియజేయకపోవడం, స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలను పట్టించుకోకుండానే రిటర్నులను దాఖలు చేశారు. వీటికీ సంబంధించే ఎక్కువగా నోటీసుల్లాంటి సూచనలు అందుతున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్టాక్‌ మార్కెట్‌ ఎక్స్ఛేంజీలు, డీపీలు, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ సంస్థల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ సూచనలను ఐటీ విభాగం జారీ చేసింది.

దీనిపై మరింత వివరణనూ ఆదాయపు పన్ను విభాగం అందించింది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేటప్పుడు తెలియజేయని వివరాలు ఉంటే.. వాటిని రివైజ్డ్‌ రిటర్ను దాఖలు చేసి, సరిచేసుకోవచ్చని సూచించింది. డిసెంబరు 31లోగా వీటిని సమర్పించాలని తెలిపింది.  

 చాలామంది పన్ను చెల్లింపుదారులకు అధిక విలువగల లావాదేవీలను నమోదు చేయలేదని, వాటి వివరాలు తెలియజేయాల్సిందిగా నోటీసు వచ్చింది. ముఖ్యంగా స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. ఇలాంటి లావాదేవీలు చేసినవారు తొందరగా స్పందించడమే మేలు అని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు, విదేశీ విహార యాత్రలకు వెళ్లినవారికీ నోటీసులు అందాయి. దీనికి సంబంధించిన టీసీఎస్‌ వివరాలతో రివైజ్డ్‌ రిటర్నులు వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ రిటర్నులు దాఖలు చేయని వారికి ఈ నెల 31 వరకూ అవకాశం ఉంది. దీనికోసం రూ.5,000 వరకూ అపరాధ రుసుము వర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని