గృహరుణం ఉమ్మడిగా తీసుకోవచ్చా?

నా వయసు 63. పింఛను వస్తోంది. అద్దె ద్వారా మరో రూ.10 వేల వరకూ వస్తున్నాయి. వీటితో నాకు ఇప్పుడే అవసరం లేదు. కనీసం 7-8 ఏళ్లపాటు స్టాక్‌ మార్కెట్లో మదుపు చేస్తే మంచిదేనా?

Updated : 09 Sep 2022 06:28 IST


* నా వయసు 63. పింఛను వస్తోంది. అద్దె ద్వారా మరో రూ.10 వేల వరకూ వస్తున్నాయి. వీటితో నాకు ఇప్పుడే అవసరం లేదు. కనీసం 7-8 ఏళ్లపాటు స్టాక్‌ మార్కెట్లో మదుపు చేస్తే మంచిదేనా? దీనివల్ల నష్టం వస్తుందా?

- కృష్ణారావు

* మీకు 7-8 ఏళ్ల సమయం ఉంది కాబట్టి, స్టాక్‌ మార్కెట్లో మదుపును పరిశీలించవచ్చు. ఇక్కడ స్వల్పకాలంలో నష్టభయం ఉండే అవకాశం ఉందన్న సంగతి మర్చిపోవద్దు. మీరు బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. వీటిలో ఒక మోస్తరు నష్టభయం ఉంటుంది. 10-11 శాతం వరకూ సగటు రాబడిని ఆశించవచ్చు. నెలకు రూ.10వేల చొప్పున 10 శాతం సగటు రాబడి వచ్చేలా 8 ఏళ్లపాటు మదుపు చేస్తే.. రూ.13,72,306 మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల జాబితాను ఏడాదికోసారి సమీక్షించుకోవడం తప్పనిసరి.


* వీపీఎఫ్‌లో నెలకు రూ.10వేల వరకూ జమ చేస్తున్నాను. దీనికి బదులుగా కనీసం 14 శాతం వచ్చేలా ఏదైనా పెట్టుబడి పథకం ఉంటుందా? కనీసం 13 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం వస్తుంది?

- శ్రీనివాస్‌

* మిగతా పెట్టుబడి పథకాలతో పోలిస్తే వీపీఎఫ్‌ చాలా సురక్షితమైనదిగా చెప్పొచ్చు. ఇందులో ప్రస్తుతం 8.1 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇంతకంటే అధిక రాబడి రావాలంటే.. నష్టభయం ఉన్న పథకాల్లో మదుపు చేసుకోవాలి. ఇందుకోసం ఈక్విటీ డైవర్సిఫైడ్‌ మ్యూచువల్‌ ఫండ్లు ఎంచుకోవచ్చు. వీటిలో 13-15 శాతం వరకూ రాబడి వచ్చే అవకాశం ఉంది. మీరు 13 ఏళ్లపాటు నెలకు రూ.10వేల చొప్పున మదుపు చేస్తే.. సగటున 14 శాతం రాబడితో.. రూ.38,50,638 వచ్చే అవకాశం ఉంది.


*ఏడేళ్ల మా అమ్మాయి పేరుమీద సుకన్య సమృద్ధి యోజన పథకంలో నెలకు రూ.4వేల చొప్పున జమ చేద్దామని అనుకుంటున్నా. దీనికి బదులుగా అధిక రాబడి వచ్చే పథకాలేమైనా ఉన్నాయా?    

- విజయ్‌

* ప్రభుత్వ హామీతో ఉండే సుకన్య సమృద్ధి పథకం సురక్షిత పెట్టుబడి పథకం. 10 ఏళ్ల లోపు అమ్మాయిల పేరుమీద ఈ ఖాతా ప్రారంభించేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఇందులో 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో రూ.1,500 ఈ పథకానికి కేటాయించండి. మిగతా రూ.2,500 డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో సిప్‌ చేయండి. ఇలా చేయడం వల్ల సగటున 11 శాతం రాబడితో 14 ఏళ్ల తర్వాత దాదాపు రూ.14,44,556 జమయ్యే వీలుంది.


* మేము ఇద్దరమూ ఉద్యోగులం. సొంతిల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నాం. రూ.30 లక్షల వరకూ రుణం తీసుకోవాల్సి వస్తుంది. ఉమ్మడిగా రుణానికి దరఖాస్తు చేయాలా? నా పేరుమీద మాత్రమే తీసుకుంటే మంచిదా?

- ప్రకాశ్‌

* మీ ఒక్కరి పేరుమీద రుణం తీసుకుంటే.. గృహరుణం పై చెల్లించే వడ్డీని మీరు మాత్రమే మినహాయింపు పొందగలరు. ఇద్దరూ ఉద్యోగులు కాబట్టి, ఇద్దరికీ పన్ను మినహాయింపు లభించేలా చూసుకోండి. ఇందుకోసం ఉమ్మడిగా రుణం తీసుకోవడం మేలు. గృహరుణం తీసుకున్నప్పుడు లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవడం మర్చిపోవద్దు.


- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని