నెలకు రూ.25వేలు రావాలంటే...
మ్యూచువల్ ఫండ్లలో నెలకు రూ.6 వేల వరకూ మదుపు చేస్తున్నాను. కొత్తగా మరో రూ.4,000 పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన.
* మ్యూచువల్ ఫండ్లలో నెలకు రూ.6 వేల వరకూ మదుపు చేస్తున్నాను. కొత్తగా మరో రూ.4,000 పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఈ మొత్తాన్ని సురక్షిత పథకాల్లో మదుపు చేయాలా? ఇప్పటికే ఉన్న ఫండ్లనే ఎంచుకోవాలా?
నవీన్
సురక్షిత పథకాల్లో మదుపు చేసినప్పుడు రాబడి తక్కువగా వస్తుంది. రెండు మూడేళ్లకన్నా తక్కువ వ్యవధిలోనే డబ్బు అవసరం ఉన్నప్పుడే వీటిని పరిశీలించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటి నుంచి 6-7 శాతం రాబడి రావచ్చు. మీకు నాలుగైదేళ్ల వ్యవధి ఉందనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఇప్పటికే మీరు మదుపు చేస్తున్న ఫండ్ల పనితీరు బాగుంటే వాటిలోనే ఈ అదనపు పెట్టుబడినీ పెట్టండి. ఏడాదికోసారైనా ఫండ్ల పనితీరును సమీక్షించుకోండి. ఈక్విటీ ఫండ్లలో 11-13 శాతం వరకూ రాబడి వచ్చే అవకాశం ఉంది. కాస్త నష్టభయం ఉంటుందని మర్చిపోవద్దు.
* మూడేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో రూ.75 లక్షల టర్మ్ పాలసీ తీసుకున్నాను. నా వయసు 43. ఇప్పుడు మరో రూ.75 లక్షల పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఒకే పాలసీ రూ.1.5 కోట్లకు తీసుకోవచ్చా?
మధు
ఒకే పాలసీని రూ.1.5కోట్లకు తీసుకోవ్చు. కానీ, ఇప్పటికే మీరు తీసుకున్న పాలసీని రద్దు చేసుకోవాల్సి వస్తుంది. పాత పాలసీని రద్దు చేసుకోవడం ఎప్పుడూ ఆచరణీయం కాదు. కాబట్టి, మీ పాలసీని కొనసాగిస్తూనే అదనంగా రూ.75 లక్షలకు మరో టర్మ్ పాలసీ తీసుకోండి. మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర మరో సంస్థను ఎంచుకోండి.
* మరో మూడేళ్లలో పదవీ విరమణ చేస్తాను. అప్పటి నుంచి నాకు నెలకు రూ.25 వేల వరకూ పింఛను వచ్చే ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనికోసం నేను ఎంత మొత్తాన్ని జమ చేయాలి. ప్రస్తుతం నేను బృంద ఆరోగ్య బీమా పరిధిలో ఉన్నాను. సొంతంగా ఇప్పటి నుంచే పాలసీ తీసుకోవాలా?
సురేశ్
నెలకు రూ.25వేలు రావాలంటే.. ఏడు శాతం రాబడి అంచనాతో కనీసం రూ.43 లక్షలను సురక్షిత పథకంలో జమ చేయాలి. ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి, భవిష్యత్తులో రూ.25వేలకు మించి అవసరం ఉండొచ్చు. కాబట్టి, ఈ నిధిని మరింత పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం బాగున్నప్పుడే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. పదవీ విరమణ చేసిన తర్వాత బృంద ఆరోగ్య బీమా పాలసీ వర్తించదు. కాబట్టి, ఇప్పుడే వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి.
* మా అమ్మాయి పేరు మీద నెలకు రూ.6వేలను సురక్షిత పథకంలో మదుపు చేయాలని అనుకుంటున్నాను. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?
స్వాతి
ప్రస్తుతం విద్యా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. దీన్ని అధిగమించేలా పెట్టుబడులు ఉండాలి. మీ అమ్మాయి భవిష్యత్ అవసరాల కోసం దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించేందుకు ప్రయత్నించండి. దీనికోసం హైబ్రీడ్ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ ఇందులో 11 శాతం వరకూ రాబడి ఆశించవచ్చు. నెలకు రూ.6వేలు, 15 ఏళ్లపాటు మదుపు చేస్తూ వెళ్తే.. రూ.24,77,185 అయ్యేందుకు అవకాశం ఉంది.
* మరో ఆరు నెలల్లో గృహరుణం తీరనుంది. దీనిపై టాపప్ తీసుకోవాల్సిందిగా బ్యాంకు అడుగుతోంది. రుణం తీసుకొని, ఆ మొత్తాన్ని ఎక్కడైనా మంచి రాబడిని ఇచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. దీనివల్ల ప్రయోజనం ఉంటుందా?
మహేందర్
ప్రస్తుతం గృహరుణ వడ్డీ రేట్లు దాదాపు 9 శాతం వరకూ ఉన్నాయి. టాపప్ రుణంపై మరో 1 శాతం వరకూ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 10 శాతం వరకూ వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. ఇంత వడ్డీకి రుణం తీసుకొని, పెట్టుబడులు పెట్టడం ఎప్పుడూ మంచిది కాదు. మన చేతిలో మిగులు మొత్తాన్నే ఎప్పుడూ పెట్టుబడులకు కేటాయించాలి. దీనికి బదులుగా.. మీరు టాపప్ రుణం తీసుకుంటే చెల్లించాల్సిన వాయిదాలను పెట్టుబడులకు మళ్లించండి. దీర్ఘకాలంలో మంచి మొత్తం జమ అవుతుంది.
తుమ్మ బాల్‌రాజ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China: అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోంది
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kotamreddy: కాసేపట్లో మళ్లీ మీడియా ముందుకు కోటంరెడ్డి
-
Crime News
కారులో మంటలు.. గర్భిణి, భర్త సజీవదహనం
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
12 మంది భార్యలు.. సెంచరీ దాటిన పిల్లలు!