hdfc bank: హెచ్‌డీఎఫ్‌సీ... గెలుపంటే ఇదీ!
క్రికెట్‌కి సచిన్ తెందుల్కర్ ఎలాగో బ్యాంకింగ్‌కి దీపక్ పరేఖ్ అలా... అంటుంది కార్పొరేట్ ప్రపంచం. బ్యాంకుల గురించి ఒక పుస్తకం రాస్తే దాని పేరు ‘దీపక్ పరేఖ్ ఎఫెక్ట్’ అని పెడతా- అంటారు రచయిత హరీశ్ మెహతా.
క్రికెట్‌కి సచిన్ తెందుల్కర్ ఎలాగో బ్యాంకింగ్‌కి దీపక్ పరేఖ్ అలా... అంటుంది కార్పొరేట్ ప్రపంచం. బ్యాంకుల గురించి ఒక పుస్తకం రాస్తే దాని పేరు ‘దీపక్ పరేఖ్ ఎఫెక్ట్’ అని పెడతా- అంటారు రచయిత హరీశ్ మెహతా. ఎవరీ దీపక్ పరేఖ్ అంటే- ఒక భారతీయ ప్రైవేటు బ్యాంకును ప్రపంచంలోనే నాలుగో పెద్ద బ్యాంక్(మార్కెట్ కాపిటలైజేషన్ ప్రకారం) స్థాయికి తీసుకెళ్లిన వ్యాపారవేత్త. విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న దీపక్‌ని ఈ రంగంలోకి తీసుకొచ్చింది హెచ్‌డీఎఫ్‌సీ సంస్థని నెలకొల్పిన హస్‌ముఖ్ ఠాకుర్‌దాస్ పరేఖ్. రెండు ప్రముఖ సంస్థలతో భారత ఆర్థిక వ్యవస్థమీద తమదైన ముద్రవేసిన ఈ బాబాయ్ అబ్బాయిల కథా... ఆ సంస్థలు ఎదిగిన తీరూ ఆసక్తికరమే కాదు, ఎంతో స్ఫూర్తిదాయకం కూడా..!
అరవయ్యేళ్ల క్రితం సంగతి. లండన్‌లో సీఏ చదువుతున్న ఒక కుర్రాడు తన ఇరవయ్యొకటో పుట్టినరోజుని ముగ్గురు స్నేహితులతో జరుపుకోవాలనుకున్నాడు. తన దగ్గరున్న కొద్దిపాటి మొత్తంతోనే హోటల్లో పార్టీకి బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాడు. దాని ప్రకారం ఒక్కొక్కరి వాటా ఎంతో ముందే చెప్పి అందులో సరిపోయేలా మీకేం కావాలో తీసుకోండి- అన్నాడు స్నేహితులతో. పార్టీ మొదలయ్యాక కబుర్లలో పడి ఇష్టమైనవి తింటూ, తాగుతూ... బడ్జెట్ సంగతి మర్చిపోయారు. చివరికి బిల్లు వాళ్లు అనుకున్న మొత్తానికి రెట్టింపుకన్నా ఎక్కువొచ్చింది. బర్త్‌డే కుర్రాడు మాత్రం నిర్మొహమాటంగా తాను మొదట అనుకున్న మొత్తమే ఇచ్చాడు. దాంతో మిగిలినదాన్ని అతిథులు ముగ్గురూ తమ జేబుల్లోంచి చెల్లించారు. అది గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ వాళ్లు అతడిని దెప్పుతూనే ఉంటారు.
ఆ పొదుపరితనం, ఆ కచ్చితత్వం స్వభావసిద్ధంగా ఉన్నాయి కాబట్టే దీపక్ పరేఖ్ అనే ఆ కుర్రాడు హెచ్‌డీఎఫ్‌సీ లాంటి సంస్థని నిర్మించగలిగాడు. తాను రిటైరయ్యేనాటికి దాన్ని ప్రపంచంలోనే నాలుగో పెద్ద బ్యాంకు స్థాయికి తీసుకెళ్లగలిగాడు. హెచ్‌డీఎఫ్‌సీ అన్న నాలుగు అక్షరాలు గత నాలుగు దశాబ్దాలుగా ఇటు మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేస్తూ అటు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తూ నేడీ స్థాయికి చేరడం వెనక చాలా పెద్ద కథే ఉంది.
ముంబయిలో స్థిరపడిన గుజరాతీ జైన కుటుంబానికి చెందిన ఠాకుర్‌దాస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తొలి ఉద్యోగి. ఆయన పెద్ద కొడుకు శాంతిలాల్ కూడా అదే బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా రిటైరయ్యాడు. రెండో కొడుకు హస్‌ముఖ్ ఠాకుర్‌దాస్ పరేఖ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదివి కొన్నాళ్లు స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో పనిచేసి ఐసీఐసీఐ సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా చేరారు. ఇరవయ్యేళ్లలో సంస్థ సీఎండీ స్థాయికి ఎదిగి రిటైరయ్యారు. లండన్‌లో చదువుకుంటున్నప్పుడు చూసిన విషయాలకు ఐసీఐసీఐలో పనిచేసిన అనుభవాన్ని జోడించి హెచ్‌టీ పరేఖ్ అరవయ్యారేళ్ల వయసులో ఒక కొత్త సంస్థని నెలకొల్పారు. అదే ‘హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్- హెచ్‌డీఎఫ్‌సీ’. హెచ్‌టీ పరేఖ్‌కి పిల్లల్లేరు. సోదరుడి కొడుకు దీపక్ అంటే చాలా ప్రేమ. దీపక్ చార్టర్డ్ ఎకౌంటెన్సీ చేయడానికి ఇంగ్లండ్ వెళ్లి అది పూర్తవగానే ఉద్యోగంలో చేరారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్, గ్రిండ్లేస్ బ్యాంక్, చేజ్ మన్‌హట్టన్ బ్యాంక్ లాంటి వాటిల్లో ఉన్నత స్థానాల్లో పనిచేశారు. చేజ్ మన్‌హట్టన్‌లో ఉండగానే సౌదీలో ఆయిల్ బూమ్ మొదలైంది. దాంతో కంపెనీ ఆయన్ని న్యూయార్క్‌నుంచి సౌదీకి బదిలీ చేసింది. మరింత ఎక్కువ జీతమూ అదనపు భత్యాలతో పాటు రెణ్ణెల్ల సెలవూ ఇచ్చి అక్కడికి వెళ్లమంది. దీపక్‌కి సౌదీ వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. దానిగురించి గుంజాటన పడుతుండగా విషయం హెచ్‌టీ పరేఖ్ దృష్టికి వచ్చింది. ‘ఎంతకాలం ఇలా దేశాలు పట్టుకు తిరుగుతావు... మేం పెద్దవాళ్లమైపోతున్నాం వచ్చి మా దగ్గర ఉండొచ్చుగా...’ అంటూ ఆత్మీయంగా పిలిచారు. తాను ప్రారంభించిన సంస్థలో ఉద్యోగమూ ఇస్తానన్నారు.
న్యూయార్క్‌లో తనకి వస్తున్న జీతంలో సగం కూడా బాబాయి ఇవ్వలేరని తెలిసినా, కుటుంబం మీద ప్రేమ కొంతా, ఏమీలేని పరిస్థితులనుంచి చిన్నాన్న సృష్టించిన ఒక కొత్త రకం వ్యాపారసంస్థ పట్ల ఆసక్తి కొంతా దీపక్‌ని ముంబయికి చేర్చాయి.
ఇంటి లోను అలా మొదలు
అది 1977. రాజకీయంగా అల్లకల్లోలంగా ఉన్న రోజులు. హెచ్‌డీఎఫ్‌సీ ప్రారంభమైందీ ఆ సంవత్సరమే. ఆరోజుల్లో సొంతిల్లంటే రిటైర్మెంట్ బెనెఫిట్స్‌తో కట్టుకోవడమే. రుణం తీసుకుని ఇల్లు కట్టుకుని సంవత్సరాల తరబడి ఆ రుణం చెల్లించడమనే పద్ధతి ఇక్కడి మధ్య తరగతి ఉద్యోగస్తులకు పూర్తిగా కొత్త. అత్యవసరమైతే తప్ప ఎవరైనా అప్పు తీసుకుంటున్నారూ అంటే పెద్ద తప్పు చేస్తున్నట్లుగా భావించేవారు. అలాంటి సమయంలో సొంతింటి కలను నిజం చేసుకోమంటూ హెచ్‌డీఎఫ్‌సీని ప్రారంభించారు హెచ్‌టీ పరేఖ్. అందుకు కారణం లేకపోలేదు- లండన్, న్యూయార్క్ లాంటి నగరాల్లో ప్రతి వీధిలోనూ బిల్డింగ్ సొసైటీలుండేవట. చదువవగానే ఉద్యోగంలో చేరడం ఎంత సాధారణమో ఉద్యోగంలో చేరగానే లోను తీసుకుని ఆ సొసైటీల సాయంతో ఇల్లు కొనుక్కోవడమూ అంత సాధారణంగా జరిగేదట. ఇదంతా గమనించిన ఆయన తిరిగి వచ్చి ఐసీఐసీఐలో ఉద్యోగం చేసినా మనసులో ఆ ఆలోచన పోలేదు. అందుకే రిటైరవగానే రంగంలోకి దిగారు. దీపక్‌ని పిలిచి డిప్యూటీ జనరల్ మేనేజర్‌ని చేశారు. 1978లో హెచ్‌డీఎఫ్‌సీ ఇచ్చిన మొట్టమొదటి ఇంటి లోను 30 వేలు.
మధ్యతరగతి అభివృద్ధి
భారతీయుల మనస్తత్వాన్ని క్షుణ్ణంగా ఎరిగిన హెచ్‌టీ పరేఖ్ అనుభవం, నిర్వహణ సామర్థ్యం సంస్థని స్థిరంగా అభివృద్ధి వైపు నడిపాయి. అప్పటివరకూ ఉద్యోగ జీవితమంతా అమెరికాలోనే గడిపిన దీపక్‌కి మాత్రం భారతీయుల్ని అర్థంచేసుకోడానికి కొంచెం సమయం పట్టింది. అర్థమయ్యాక ఇక వెనక్కి తిరిగి చూడలేదు. అలా హెచ్‌డీఎఫ్‌సీ మొదలెట్టిన సంప్రదాయం దేశంలో మధ్యతరగతి వర్గాన్ని అతిపెద్ద వినియోగదారులుగా మార్చింది. లోను తీసుకుని నెలసరి వాయిదాల్లో చెల్లించడమనే పద్ధతి ఊపందుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ అభివృద్ధి- భారతీయ మధ్య తరగతి అభివృద్ధి సమాంతరంగా సాగాయంటారు ఆర్థిక నిపుణులు.
అయితే దేశంలో రిటైల్ ఇంటి రుణాలు ఇచ్చే అతి పెద్ద సంస్థగా హెచ్‌డీఎఫ్‌సీ పేరు తెచ్చుకోవడం వెనక సారథుల కృషి అంతా ఇంతా కాదు. ఇప్పటిలాగా అప్పుడు పెట్టుబడులు పెట్టేవారు లేరు. కొత్త వ్యాపారం కావడంతో నిలదొక్కుకుంటుందన్న గ్యారంటీ లేదు. అందరూ లోను తీసుకోవడానికి ముందుకొచ్చేవారే కానీ నమ్మి తమ డబ్బును డిపాజిట్ చేసేవారు కాదు. 1978లోనే ఐపీవోకి వెళ్లినా పదికోట్లు కూడా రాలేదు. దాంతో ప్రపంచబ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సేకరించాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల వల్లే దాదాపు పదేళ్ల వరకూ మరే సంస్థా ఈ రంగంలోకి రాలేదు. దీపక్ సారథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ కూడా చిన్నగానే మొదలుపెట్టి మెల్లమెల్లగా ఇతర రంగాల్లోకి సేవల్ని విస్తరించింది.
బ్యాంకుకి శ్రీకారం
తొంభయ్యవ దశకం ప్రారంభంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొంది. ఇరాక్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి వడ్డీ రేట్లు పెంచాల్సివచ్చింది. ఆ పరిస్థితుల్లో హెచ్‌డీఎఫ్‌సీకి నిధులు రావడం మరింత కష్టమైంది. ప్రజలేమో రుణాల కోసం క్యూకడుతున్నారు. సంస్థలోనేమో వనరులు తగ్గిపోతున్నాయి. సరిగ్గా అప్పుడే ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు తెరలేపింది. ప్రైవేటు బ్యాంకులకు లైసెన్సులిస్తామని ప్రకటించింది. సంస్థని విస్తరించడానికి అదే అనువైన సమయంగా కనిపించింది దీపక్‌కి. కానీ హెచ్‌డీఎఫ్‌సీ బోర్డు అందుకు అంగీకరించలేదు. చక్కగా స్థిరపడిన కంపెనీ అనుభవంలేని రంగంలోకి దిగి తన పేరు ప్రతిష్ఠల్ని రిస్కులో పడేయడం అవసరమా అని ప్రశ్నించారు బోర్డు సభ్యులు. వాళ్లకు నచ్చజెప్పి, పూర్తిగా బ్యాంకింగ్ అనుభవం ఉన్న కొత్త సిబ్బందినే ఎంపిక చేసుకుంటామని హామీ ఇచ్చి ఒప్పించారు దీపక్. లైసెన్సూ వచ్చింది. ఇప్పుడిక కావాల్సింది సారథులు. తన పరిచయాలనన్నిటినీ వడపోసి బ్యాంకర్‌గా అనుభవజ్ఞుడైన ఆదిత్య పురిని సీఈఓగా, ఆర్‌బీఐలో పనిచేసిన ఎస్‌ఎస్ ఠాకూర్‌ని ఛైర్మన్‌గా నియమించి బాధ్యతలు అప్పజెప్పారు. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న వినోద్ ఎన్నెమాడిని తీసుకొచ్చి హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ మొట్టమొదటి ఉద్యోగిగా చేర్చుకున్నారు. హామీ ఇచ్చినట్లుగానే బ్యాంకు నిర్వహణలో ఆదిత్య పురికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు దీపక్. తాను బోర్డులో సభ్యుడిగా కూడా చేరలేదు. అయితే ప్రత్యేక అతిథిగా ప్రతి సమావేశానికీ హాజరయ్యేవారు. ఎవరికి ఏ సందేహమొచ్చినా నేనున్నాననేవారు.
అప్పటివరకూ మనదేశంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు మంచి నెట్‌వర్క్ ఉంది. విదేశీ బ్యాంకుల దగ్గర కొత్త ఉత్పత్తులున్నాయి. ఈ రెంటినీ కలిపి వినియోగదారులతో అనుబంధాల పునాది మీద కొత్త బ్యాంకును నిర్మించారు. విలీనానికి ముందే హెచ్‌డీఎఫ్‌సీ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌గా పేరుతెచ్చుకుంది. క్రెడిట్ కార్డుల జారీలోనూ ప్రథమస్థానం దానిదే. కొత్త తరం ప్రైవేటు బ్యాంకుల్లో తొలి విలీనం హెచ్‌డీఎఫ్‌సీలోనే(టైమ్స్ బ్యాంక్) జరిగింది. తర్వాత సెంచూరియన్ బ్యాంకును కొనుగోలు చేసింది. బీమా, సెక్యూరిటీస్, మ్యూచువల్ ఫండ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ తదితర రంగాల్లోకి విస్తరించింది. అన్నిట్లోనూ తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ ముందుకు సాగింది.
జీతం చాలన్న వ్యాపారవేత్త
లక్షల కోట్ల విలువైన సంస్థని నిర్మించిన దీపక్ పరేఖ్ ఎంత సంపాదించివుంటారూ... లక్షలాదిమందికి ఇళ్లు కట్టుకోవటానికితోడ్పడిన వీళ్లకు ఎన్ని సొంతిళ్లు ఉండి వుంటాయీ... బ్యాంకులో ఎంత వాటా ఉందీ... ఇవన్నీ చాలామంది ఆయన్ని ముఖంమీదే అడుగుతుంటారు. దీపక్ కానీ ఆయన చిన్నాన్న కానీ హెచ్‌డీఎఫ్‌సీలో వాటా తీసుకోలేదు. అప్పట్లో అది కొనేంత డబ్బు కానీ కొనుక్కోవాలన్న కోరిక కానీ లేవంటారు దీపక్. ఈరోజుల్లో లాగా జీతాలు లక్షల్లో ఉండేవి కావనీ తన తండ్రి రిటైర్మెంట్ బెనెఫిట్స్‌తో ఇల్లు కట్టుకుంటే చిన్నాన్న మాత్రం అద్దె ఇంట్లోనే ఉండేవారనీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తనకీ బ్యాంకులో నామమాత్రపు వాటానే ఉందన్నారు. ‘నేనైనా, మా చిన్నాన్న అయినా సంస్థల వ్యవస్థాపకులమే కానీ వాటాదారులం కాము. కావాలని అనుకోకపోవడానికి కారణం మా దగ్గర పెట్టుబడి లేదు. మాది కుటుంబ వ్యాపారం కాదు. ఆలోచన మాది. ఎప్పటికప్పుడు తగిన టీమ్ దొరికింది కాబట్టి సంస్థలు విజయపథంలో సాగాయి. ఆ క్రెడిట్ అందరిదీ. ఇక్కడ వచ్చిన ఆదాయం తీసుకుని మరోచోట పెట్టుబడి పెట్టుకుని ఇంకా ఇంకా సంపాదించడం నాకు ఇష్టంలేదు. నేను హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఏనాడూ ఎలాంటి లోనూ తీసుకోలేదు. నిజంగా చెప్పాలంటే మధ్యతరగతి వేతనజీవి మనస్తత్వం నాది. రిస్క్ తీసుకునే ధైర్యం లేదు. జీతం వస్తోంది చాలనుకునేవాణ్ణి. ఒక ఉద్యోగిగా ఇక్కడ కూర్చుని నేను చేయాల్సిన పనేంటీ- సంస్థని ఇంకా బాగా, లాభసాటిగా ఎలా నిర్వహించవచ్చూ... అనే నిరంతరం ఆలోచించేవాణ్ణి. నూటికి నూరుశాతం అంకితభావంతో ఒక వ్యాపారవేత్తలా ఆలోచించే ఉద్యోగం చేశాను, అంతే. నా మటుకు నాకు పిల్లల్ని చదివించుకోవడానికి సరిపోయే సంపాదన చాలు. ఎంత డబ్బున్నా రెండు పూటలే తినగలం. సమయం వచ్చినప్పుడు ఎవరైనా వెళ్లిపోవల్సిన వాళ్లమే. ఆ మాత్రానికి కోట్లు కూడబెట్టడం ఎందుకూ, అవసరం లేనివన్నీ కొని పెట్టుకోవడం ఎందుకూ...’ అని తాత్త్వికంగా సమాధానం చెప్పే దీపక్ ఒక దశలో పిల్లల ఫీజులు కట్టడానికి డబ్బు సరిపోక అదనపు సంపాదన కోసం ఇతర సంస్థల్లో బోర్డు సభ్యుడిగా చేరారట.
వివాదాల పరిష్కర్త
రెండు సంస్థలూ వాటి అనుబంధ విభాగాలూ విజయపథంలో సాగుతుండడంతో సంస్థల నిర్మాతగా దీపక్‌కి మంచి పేరు వచ్చింది. ప్రభుత్వమూ, రెగ్యులేటర్ సంస్థలూ ఆయనవైపు దృష్టి సారించాయి. వ్యాపారాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి సంక్షోభం వచ్చినా, వివాదం తలెత్తినా పరిష్కారం దీపక్ దగ్గర ఉంటుందన్న పేరొచ్చింది. పలు కేంద్ర ప్రభుత్వ కమిటీల్లో ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌గా ఆయన పేరు తప్పనిసరి అయిపోయింది. ప్రధానంగా సత్యం కంప్యూటర్స్, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వివాదాల పరిష్కారంలో ఆయన కీలకపాత్ర పోషించారు. బీమా, బ్యాంకింగ్ సంస్కరణల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఐడీఎఫ్‌సీ వ్యవస్థాపక ఛైర్మన్‌గా వ్యవహరించారు. పెన్షన్ స్కీమ్, రాజీవ్ ఆవాస్ యోజనలాంటి వాటికి సలహాలిచ్చారు. ఒక దశలో ఆయన ఆర్థిక మంత్రి అవుతారన్న మాటలూ వినిపించాయి. కానీ దీపక్ మాత్రం ప్రభుత్వాలకు సహాయపడ్డారే తప్ప రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.
విజయ్‌మాల్యాకి లోను ఇవ్వలేదు
హెచ్‌డీఎఫ్‌సీ విజయానికి కారణాలేంటన్న దానిమీద కార్పొరేట్ రంగం తెగ చర్చిస్తుంది. వాళ్లు ఎన్ని కారణాలు వెతుక్కున్నా మొట్టమొదటిది మాత్రం హెచ్‌టీ పరేఖ్, దీపక్ పరేఖ్‌లు నమ్మిన విలువలే. వినియోగదారులతో అనుబంధానికి పెద్దపీట వేశారు. ‘ఇంటి రుణం తీసుకోవడం అంటే జీవితకాలపు సంపాదనని పణంగా పెట్టడం... వాళ్లకెన్నో సందేహాలుంటాయి. కష్టనష్టాలుంటాయి. ఓపిగ్గా వినాలి. అలా వినడం ఎంత అవసరమో మా సిబ్బందికి శిక్షణ ఇస్తాం. ప్రకటనల మీద మేము డబ్బు ఖర్చుపెట్టలేదు. నోటి ద్వారా ప్రచారమే. కస్టమర్‌కి మనమీద భరోసా ఉంటే వాళ్లే మరొకరికి రికమెండ్ చేస్తారు. బ్యాంకు వినియోగదారుల బలహీనతనీ కష్టాన్నీ తనకు అనువుగా ఉపయోగించుకోకూడదు’ అంటారాయన. అందుకుగానూ ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ‘మా దగ్గర జీతాలు ఏమంత గొప్పగా ఉండవు, కానీ ఉద్యోగులకు హాయిగా పనిచేసే వాతావరణం కల్పిస్తాం. రోజూ డబ్బుతో వ్యవహారం. పనిచేయకపోయినా సహిస్తాం కానీ విలువల్ని అతిక్రమిస్తే ఊరుకోం’ అంటూ సంస్థ స్థిరంగా ఎదగడానికి కారణమైన తమ పద్ధతుల గురించి చెబుతారాయన. ఇతర బ్యాంకుల్లా అడిగినవారికి అడిగినట్లు రుణాలు ఇవ్వకుండా క్రమశిక్షణను పాటించారు. నష్టభయం ఉన్న రుణాలవైపు వెళ్లలేదు.
ఉదాహరణకు విజయ్‌మాల్యా స్వయంగా ఆదిత్యపురికి దగ్గరి స్నేహితుడు. అయినా ఆయనకు రుణం ఇవ్వలేదు. అందుకు చాలా సందర్భాల్లో మాల్యా తనని తిట్టేవాడని పురి ఒక సందర్భంలో చెప్పారు. అలాగే కాలానుగుణంగా మారడంలోనూ ఈ సంస్థ మిగిలినవారికన్నా ముందుంది. నిన్నమొన్నటి వరకూ కూడా ఆయనకు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందేవట. ‘ఎంత ఇబ్బంది కలిగితే ఎవరైనా ఒక ఫిర్యాదును చైర్మన్ దాకా తెస్తారు... అందుకే నేనే వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడతాను. అది వాళ్లకి తృప్తినిస్తుంది. తర్వాత ఎలాగూ మావాళ్లు దాన్ని పరిష్కరిస్తారు’ అని చెబుతారు దీపక్.
ఇద్దరికీ పద్మభూషణ్!
ఐసీఐసీఐ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం సేవలు అందించి, రిటైరయ్యాక వినూత్న ఆలోచనతో హెచ్‌డీఎఫ్‌సీని ప్రారంభించి చరిత్ర సృష్టించిన హస్‌ముఖ్ ఠాకుర్‌దాస్ పరేఖ్ మంచి వ్యాపారవేత్త మాత్రమే కాదు, రచయిత కూడా. భారతీయ ఆర్థిక వ్యవస్థ గురించి చాలా పుస్తకాలు రాసిన ఆయనను భారత ప్రభుత్వం 1992లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌గా సేవలందిస్తూనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును ప్రారంభించి దాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన దీపక్ పరేఖ్‌కి కూడా 2006లో పద్మభూషణ్ లభించింది.
ఇటీవలే రిటైర్మెంట్ తీసుకున్న దీపక్ పరేఖ్ ఇక సుడొకు పజిల్స్‌తోనూ బ్రిడ్జి ఆటతోనూ కాలక్షేపం చేస్తానంటున్నారు. భారత్‌లో అత్యంత విలువైన బ్యాంకుగా పేరొందిన హెచ్‌డీఎఫ్‌సీ విలీనం అనంతరం మొత్తం వ్యాపారం విలువ రూ.33లక్షల కోట్లు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ వ్యాపార విలువ 70.30 లక్షల కోట్లు. అయితే 2022- 23లో ఎస్‌బీఐ లాభం రూ.50,232 కోట్లు కాగా హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.62వేల కోట్లు. అదీ ఈ నంబర్‌వన్ బ్యాంక్ సత్తా..!
లక్ష... రెండున్నర కోట్లయ్యేది!
విలీనం అనంతరం ఇప్పుడు అన్నిరకాల సేవలనూ ఒకేచోట అందించేలా తయారైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ప్రపంచంలోనే పెద్ద బ్యాంకుల్లో నాలుగో స్థానంలో ఉంది. జేపీ మోర్గాన్ చేజ్(అమెరికా), ఐసీబీసీ (చైనా), బ్యాంక్ ఆఫ్ అమెరికా (అమెరికా) తర్వాత స్థానం హెచ్‌డీఎఫ్‌సీ(భారత్)దే.
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 1995లో ఎవరైనా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే అది ఇప్పుడు 2.7 కోట్ల రూపాయలకు చేరేది. 1993 జూన్ 30న రూ.13.7 ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ షేరు 2023 జూన్ 30నాటికి 2,821.50 అయింది.
- మనదేశంలో అత్యంత లాభదాయకమైన సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత రెండో స్థానంలో ఉంది హెచ్‌డీఎఫ్‌సీ.
- 2022 వరకూ 93 లక్షల గృహరుణాలను ఇచ్చింది హెచ్‌డీఎఫ్‌సీ.
- ఈ బ్యాంక్‌కి దేశవ్యాప్తంగా 8,344 శాఖలున్నాయి. ఎస్‌బీఐ తర్వాత స్థానం దీనిదే.
- సిబ్బంది సంఖ్య- 1,77,000. వినియోగదారులు- 12 కోట్లు.
- 2016తో మొదలుపెట్టి ఇప్పటివరకూ ఏటా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అందుకున్న అవార్డులకు లెక్కే లేదు. బెస్ట్ బ్యాంకింగ్ పెర్ఫామర్, బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, కంపెనీ ఆఫ్ ద ఇయర్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జ్ బ్యాంక్, మోస్ట్ ఆనర్డ్ కంపెనీ... ఇలాంటి విశేషణాలెన్నో పలుసార్లు ఆ సంస్థ పేరు ముందు చేరాయి.
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అసాధారణ విజయాలపై ప్రముఖ పాత్రికేయుడు తమల్ బందోపాధ్యాయ- ఎ బ్యాంక్ ఫర్ ద బక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.0- ఫ్రమ్ డాన్ టు డిజిటల్ అనే రెండు పుస్తకాలు రాశారు. వాటిని బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలుగా పేర్కొంటారు నిపుణులు.
ఈ సీఈఓ... ఐదున్నరకి ఇంటికెళ్లిపోయేవారు!
బ్యాంకు పెట్టాలనుకున్నప్పుడు దానికి సీఈఓగా దీపక్ మనసులో మెదిలిన మొట్టమొదటి వ్యక్తి ఆదిత్య పురి. అప్పటికి ఆయన మలేసియాలో సిటీ బ్యాంక్ సీఈఓగా ఉన్నారు. ఆ సంస్థకి చెందిన టాప్ -50 ప్రముఖుల్లో ఒకరిగా ఆరోజుల్లోనే ఏడాదికి ముప్ఫైలక్షలకు పైగా జీతం, పెద్ద ఇల్లూ, ఇతర భత్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న వ్యక్తి. అలాంటి ఆయన్ని ముంబయి వచ్చి సగం జీతానికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బాధ్యతలు చేపట్టమని కోరారు దీపక్. కేవలం స్వదేశంలో ఉండటం తప్ప మరేవిధంగానూ అది లాభదాయకమైన ప్రతిపాదన కాదు, ఆదిత్య స్థాయికి సరిపోయినదీ కాదు. మరొకరెవరైనా అడిగితే తక్షణం నో చెప్పేసేవారే కానీ, దీపక్‌తో చిన్ననాటి పరిచయం ఉంది. పైగా హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌గా అప్పటికే దీపక్ కార్యదక్షుడిగా పేరొందారు. ఆయన మార్గదర్శకత్వంలో ఒక కొత్త బ్యాంకుకి ఆధ్వర్యం వహించడాన్ని తనని తాను నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశంగా చూశారు ఆదిత్య. తనకి పూర్తి స్వేచ్ఛనివ్వాలన్న షరతు పెట్టి ఆమోదం తెలిపారు. అలా 1994లో హెచ్‌డీఎఫ్‌సీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆదిత్య పురి దాదాపు పాతికేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. తనకంటూ ఒక బృందాన్ని ఏర్పర్చుకుని ఒక్కో ఇటుకా పేర్చి ఇంటిని కట్టినట్టుగా ఒక స్టార్టప్‌ని బ్యాంకింగ్ జైంట్‌గా మలచారు. స్వేచ్ఛగా పనిచేశారే కానీ ఎక్కడా హెచ్‌డీఎఫ్‌సీ తాలూకు విలువల్ని విస్మరించలేదు. ఆధునిక బ్యాంకింగ్ రూపశిల్పిగా, మోస్ట్ ఇంప్రెసివ్ సీఈఓగా, బారన్స్ లిస్ట్ ఆఫ్ టాప్ 30 గ్లోబల్ సీఈఓల్లో ఒకరిగా... ప్రశంసలు పొందారు.
ఒంటిచేత్తో ప్రపంచంలోనే పేరొందిన, నమ్మకమైన బ్యాంకును నిర్మించి, ఎలాంటి వివాదాలూ లేకుండా నిర్వహించిన ఆయన పనితీరూ విశేషంగానే ఉండేది. క్రమశిక్షణకు మారుపేరైన ఈ దిగ్గజ బ్యాంకర్ చేతికి వాచీ పెట్టుకోరు. జేబులో డబ్బుండదు, చేతిలో ఫోనూ ఉండదు. కంప్యూటర్ వాడేవారు కాదు. మెయిల్స్ అన్నీ ప్రింటవుట్లు తీసుకుని చూసేవారు. పెన్నుతోనే రాసేవారు. సాయంత్రం ఐదున్నరకల్లా ఠంచనుగా పని పూర్తిచేసి ఇంటికెళ్లిపోయేవారు. ఆ తర్వాత ఫోను కూడా ముట్టుకునేవారు కాదట.
సీఎస్‌ఆర్... పరివర్తన్
హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ ‘పరివర్తన్’ పేరుతో సామాజిక బాధ్యత కింద పలురకాల కార్యక్రమాలను చేపడుతోంది. ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, విద్య, నైపుణ్యాల్లో శిక్షణ, ఆర్థిక అక్షరాస్యత, పర్యావరణం... తదితర రంగాల్లో24 రాష్ట్రాల్లో చేపడుతున్న కార్యక్రమాలకు గాను గత మూడేళ్లుగా వరసగా రూ.535, 634, 634 కోట్ల చొప్పున ఖర్చుచేసింది. పది లక్షలకు పైగా కుటుంబాలకు తోడ్పాటు నందించింది. 110 కోట్లతో కొవిడ్ రిలీఫ్ కార్యక్రమాలను చేపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Nitin Gadkari : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ మాదే కానీ..: గడ్కరీ
-
BJP: తెలంగాణకు రెండో వారంలో అమిత్‌షా.. 6న నడ్డా
-
World Culture Festival: శాంతి, సామరస్య ప్రపంచం కోసం అందరం కలిసి కృషి చేయాలి!
-
Sudheer Babu: భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దు: సుధీర్ బాబు విజ్ఞప్తి
-
Delhi: ఆ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులూ ఇంజినీర్లే.. బాంబుల తయారీలో నిష్ణాతులు