Stock Market: విజయవంతమైన స్టాక్ ట్రేడర్‌గా ఎలా మారాలి?

స్టాక్‌ మార్కెట్‌లో విజయవంతమైన ట్రేడర్‌గా కొనసాగడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి?

Published : 25 Jan 2024 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ధరలు పెరుగుతున్న నేటికాలంలో ప్రతి ఒక్కరూ అదనపు సంపాదనను పొందాలనుకుంటున్నారు. మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించడానికి, సురక్షితమైన ఆర్థిక భవిష్యత్‌ను కలిగి ఉండడానికి అదనపు ఆదాయ వనరులను సృష్టించుకుంటున్నారు. ఇందులో భాగంగా షేర్లలో పెట్టుబడి పెట్టడం కూడా ఒక మార్గంగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. స్టాక్‌ మార్కెట్‌లో ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. మంచి రాబడి పొందాలంటే మాత్రం నైపుణ్యం అవసరం. 

పరిశోధన సామర్థ్యం

స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించేవారు సునిశితమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. వారు ఏ కంపెనీలో/రంగంలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారో ఆ పరిశ్రమలపై ప్రభావం చూపే అన్ని సంబంధిత సమాచారాన్ని కనుగొనడానికి ఆసక్తి ప్రదర్శించాలి. రాజకీయ వర్గాలు, బ్యూరోక్రాట్స్‌ చేసే ఫైనాన్షియల్‌ ప్రకటనలు కూడా ఒక్కోసారి మార్కెట్లను ప్రభావితం చేస్తుంటాయి. ట్రేడింగ్‌లో కీలకమైన సాధనం సమగ్ర మార్కెట్‌ పరిశోధన, సాంకేతిక విశ్లేషణ. క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా ట్రేడింగ్‌లో అధిక నష్టాలకు గురవ్వకుండా ఉండొచ్చు.

మానసిక ధైర్యం, ఓపిక

స్టాక్స్‌లో ట్రేడింగ్‌ చేసే ప్రతి వ్యక్తి విజయవంతం కాకపోవచ్చు. చాలాసార్లు స్టాక్‌ మార్కెట్‌లోకి కొత్తగా ప్రవేశించేవారు నష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఎక్కువ ఆందోళన చెందుతారు. ఇలాంటి వారికి స్టాక్‌ మార్కెట్లు సెట్‌ కావు. ఒక ట్రేడర్‌ అన్ని రకాల పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా నష్టం సంభవించినప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. స్టాక్‌ ట్రేడర్‌ కూడా ప్రొఫెషనల్స్‌తో సమానం. ఒక ప్రొఫెషనల్‌ ఎల్లప్పుడూ ప్రతి విషయంలో మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి. తన ప్రశాంతతను కాపాడుకోవాలి. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని కూడా విశ్లేషించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. పరిస్థితిని దిగజార్చుకోకూడదు.

మార్కెట్‌ వ్యూహాం

ఇన్వెస్టర్లు మార్కెట్‌లో గరిష్ఠం, కనిష్ఠం రెండిటినీ చాలాసార్లు చూసే ఉంటారు. అటువంటి సమయంలో మార్కెట్‌లో ఉండడం చాలా కీలకం. ఎందుకంటే ఇలాంటి సమయంల్లోనే ట్రేడింగ్‌లో అవసరమైన సర్దుబాట్లు చేయడానికి, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్లు వృద్ధి అవకాశాలను గుర్తించి, మంచి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నిసార్లు ఇన్వెస్టర్లు చేసే ఓవర్‌ ట్రేడింగ్‌ భారీ నష్టాన్ని కలిగించవచ్చు. ఓవర్‌ట్రేడింగ్‌ అనేది పెట్టుబడిదారులు చేసే సాధారణ తప్పు. ట్రేడింగ్‌ చేసేటప్పుడు క్రమశిక్షణతో కూడిన విధానం అవసరం. ఒక్కసారిగా లాభాలను ఆర్జించే బదులు మార్కెట్‌లో నిలదొక్కుకుని, క్రమం తప్పకుండా రాబడులు సంపాదించాలనే ఆలోచన ఉండాలి. ట్రేడింగ్‌లో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కీలకం. మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడం, స్టాప్‌-లాస్‌ ఆర్డర్లను ఉపయోగించడం, పెద్ద ట్రేడ్స్‌ను నివారించడం వంటి చర్యల ద్వారా మార్కెట్‌ వ్యూహాలను అమలు చేయాలి.

స్టాక్‌ ట్రేడర్‌ నైపుణ్యం

స్టాక్‌ మార్కెట్‌ చాలా అస్థిరంగా ఉంటుంది. ఇన్వెస్టర్లు మంచి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి మార్కెట్‌ పోకడలను విశ్లేషించాలి. ఈ విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఇన్వెస్టర్లకు స్టాక్‌ డేటాను సమీక్షించడం, నమూనాలను గుర్తించడం, ఆర్థిక అంచనాలను సమర్థంగా చేయడంలో సహాయపడతాయి. కంపెనీ, ఆర్థిక పనితీరు, స్టాక్‌ చరిత్ర, మీడియా నివేదికల గురించిన సమాచారాన్ని కనుగొనడంలో నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఒక విజయవంతమైన ట్రేడర్‌.. ఎల్లప్పుడూ నేర్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. ఒక స్టాక్‌ ఇన్వెస్టర్‌ తన పాత్రను సమర్థంగా నిర్వహించడానికి అకౌంటింగ్‌ నైపుణ్యాలు కూడా చాలా అవసరం. ఈ వృత్తిలో కార్యకలాపాలు సంఖ్య ఆధారితంగా ఉన్నందున, స్టాక్‌ మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి, కంపెనీ ఆదాయ నివేదికలు, మార్కెట్‌ ట్రెండ్స్‌ వంటి ఆర్థిక సమాచారాన్ని విశ్లేషించడానికి ఈ నైపుణ్యం అవసరం.

ఆర్థిక వార్తలు

ఆర్థిక వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఏ ఇన్వెస్టర్‌కైనా చాలా కీలకం. ఎందుకంటే ఇది సకాలంలో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. కంపెనీ ఆదాయ నివేదికలు వంటి సంక్లిష్టమైన సమాచారాన్ని విశ్లేషించే ముందు ఆర్థిక వార్తల ముఖ్యాంశాలు, కథనాల సారాంశాలను చదవడం ద్వారా పెట్టుబడులను చిన్నగా ప్రారంభించవచ్చు. వివిధ పరిశ్రమలలో ట్రెండ్స్‌ గురించి తెలుసుకోవడానికి మీరు ఆన్‌లైన్‌ ప్రచురణలు, పత్రికలు, మ్యాగజైన్స్‌, ఫైనాన్షియల్‌ బ్లాగ్స్‌ను చదవాలి.

సర్టిఫికేషన్‌ కోర్సు

స్టాక్‌ ట్రేడర్‌గా మారాలంటే ఫైనాన్షియల్‌ మార్కెట్లు, సెక్యూరిటీలు, ట్రేడింగ్‌, ఇన్వెస్టింగ్‌పై సమగ్ర అవగాహన అవసరం. మీరు ఈ సబ్జెక్ట్స్‌పై పట్టు సాధించడానికి.. ఫ్రీ/పెయిడ్‌ ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరవచ్చు. కొన్ని ఆన్‌లైన్‌ కోర్సుల్లో స్టాక్‌ మార్కెట్‌, ఇన్వెస్టింగ్‌ సిమ్యులేషన్‌ గేమ్స్‌.. రియల్‌ టైమ్‌లో ట్రేడింగ్‌ నేర్పుతాయి. అనేక కాలేజీలు, బిజినెస్‌ స్కూల్స్‌, ఆర్థిక సంస్థలు ఆఫ్‌లైన్‌ కోర్సులను కూడా అందిస్తున్నాయి. అడ్వాన్స్‌డ్‌ డిప్లొమాస్‌కు సంబంధించి.. ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌, ఈక్విటీ డీలర్‌ సర్టిఫికేషన్‌, ఇతర సర్టిఫికేట్‌ కోర్సులు ఉన్నాయి.

స్టాక్‌ అనలిస్ట్స్‌ సలహాలు

ప్రముఖ స్టాక్‌ అనలిస్టులు నిర్వహించే సెమినార్స్‌, వెబ్‌నార్స్‌కు హాజరవ్వడం ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి, వారి ముఖ్యమైన విధానాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహాలను అర్థం చేసుకోవడానికి స్టాక్‌ ట్రేడర్స్‌కు చెందిన పుస్తకాలను చదవొచ్చు. వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో స్టాక్ అనలిస్ట్స్‌ అభిప్రాయాలను తెలుసుకోవడం మంచిది. ఇతర ట్రేడర్స్‌తో కనెక్ట్‌ అయ్యి వాళ్లతో అభిప్రాయాలను పంచుకోవడం మంచిది. అలాగే, వీటికి సంబంధించిన కాన్ఫరెన్స్‌లకు హాజరవ్వండి. ట్రేడింగ్‌ ఫోరమ్స్‌లో చేరడం, ట్రేడింగ్‌ కమ్యూనిటీల్లో పాల్గొనడం లాంటివి చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని