Credit Card: క్రెడిట్‌ కార్డు రద్దు చేస్తున్నారా? ఇవి మరిచిపోవద్దు..

క్రెడిట్‌ కార్డులను తీసుకోవడం, తీసుకున్న కార్డులను కొన్ని కారణాలతో రద్దు చేసుకోవడం సాధారణమైన విషయమే, అలాగే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కార్డును బ్లాక్‌ కూడా చేయొచ్చు. రద్దు, బ్లాక్‌ ప్రక్రియలో ఏం చేయాలి అనేది ఇక్కడ చూడండి.

Published : 27 Feb 2023 13:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న కారణంతో క్రెడిట్‌ కార్డు (Credit card) రద్దు చేయొద్దని సాధారణంగా నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. కార్డుకు వార్షిక రుసుము లేనట్లయితే దాన్ని కొనసాగించడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. కానీ, కార్డుపై అధిక వార్షిక రుసుము వసూలు చేస్తుంటే.. మీరు కార్డు జారీ చేసినవారితో వార్షిక రుసుము లేని క్రెడిట్‌ కార్డ్‌కు మార్చమని అడగవచ్చు. వారు అనుకూలంగా స్పందించనట్లయితే కార్డు రద్దు (క్యాన్సిల్) చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, క్రెడిట్‌ కార్డు రద్దు చేసేటప్పుడు కొన్ని పనులు చేయాలి. అవేంటంటే..?

రద్దు ప్రక్రియ

క్రెడిట్‌ కార్డు రద్దు చేయకముందు క్రెడిట్‌ కార్డుపై గల బకాయిలను చెల్లించేయాలి. మీ బ్యాలెన్స్‌ను చెల్లించిన తర్వాత.. సబ్‌స్క్రిప్షన్‌లు, ఆటోమేటిక్‌ చెల్లింపులను వేరే కార్డుకు మార్చుకోవాలి. మీ కార్డు మూసివేసిన తర్వాత ఈ చెల్లింపుల ఆమోదం ఆగిపోతుంది. కార్డును మూసివేసే ముందు కార్డుపై ఉన్న రివార్డులు కోల్పోకుండా ఉండాలంటే.. రివార్డులను రిడీమ్‌ చేసుకోవాలి లేదా బదిలీ చేయడం మంచిది. మీ కార్డు రివార్డు ప్రోగ్రామ్‌ను సమీక్షించండి. తద్వారా మీరు నిబంధనలను తెలుసుకుంటారు. మీ బకాయి బ్యాలెన్స్‌ను చెల్లించి, రివార్డులను రిడీమ్‌ చేసిన తర్వాత కార్డు రద్దు ప్రక్రియను ప్రారంభించొచ్చు.

ఎలా చేయాలి?

ఫోన్‌ కాల్‌ ద్వారా: కార్డు ప్రతినిధితో మాట్లాడడానికి క్రెడిట్‌ కార్డు కస్టమర్ కేర్ నంబరుకు కాల్‌ చేయండి. కార్డును శాశ్వతంగా మూసివేయాలనుకుంటున్నారని ప్రతినిధికి తెలియజేయండి. కార్డు రద్దు చేయకుండా మిమ్మల్ని ఒప్పించడానికి, నిరుత్సాహపరచడానికి ఆ ప్రతినిధి ప్రయత్నించవచ్చు. కానీ, కార్డు రద్దు చేయడం మీ చివరి నిర్ణయం కాబట్టి, కార్డు రద్దునే మళ్లీ నిర్ధారించండి.

ఇ-మెయిల్‌ ద్వారా: క్రెడిట్‌ కార్డు మూసివేయాలనే మీ కోరికను పేర్కొంటూ మీకు కార్డు జారీ చేసినవారికి ఇ-మెయిల్‌ పంపొచ్చు. ఇందులో మీ క్రెడిట్‌ కార్డు  నంబర్‌, పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ మొదలైన వివరాలను తెలపాలి.

క్రెడిట్‌ నివేదిక తనిఖీ

కార్డును క్యాన్సిల్‌ చేసిన తర్వాత క్రెడిట్‌ రిపోర్ట్‌లో కార్డు మూసివేసిన కారణం.. వినియోగదారుడు అభ్యర్థన మేరకు కార్డు క్యాన్సిల్‌ జరిగినట్లుగా ఉండాలి. అలా కాకుండా.. వేరొక కారణం కనిపిస్తే మీ క్రెడిట్‌ స్కోరుకు హాని కలిగే అవకాశం ఉన్నందున సమస్యను పరిష్కరించడానికి మీ బ్యాంకును సంప్రదించండి.

కార్డును కట్‌ చేయండి

మీ క్రెడిట్‌ కార్డు అధికారికంగా మూసివేసిన తర్వాత.. కార్డును నాశనం చేయడం మంచిది. కార్డును చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. ఒకవేళ మెటల్‌తో తయారు చేసిన కార్డయితే నిబంధనల ప్రకారం మీ బ్యాంకును సంప్రదించి.. పాత కార్డును తిరిగి మెయిల్‌ చేయడానికి ఉపయోగించే ప్రీపెయిడ్‌ ఎన్వలప్‌ను అభ్యర్థించాలి. బ్యాంకు కార్డును స్వీకరించిన తర్వాత సురక్షితంగా పారవేస్తుంది.

క్రెడిట్‌కార్డును ఎప్పుడు బ్లాక్‌ చేయాలి?

కార్డును పోగొట్టుకున్నప్పుడు లేదా మోసపూరిత లావాదేవీని గమనించినప్పుడు.. ఆ కార్డును వీలైనంత త్వరగా బ్లాక్‌ చేయడం మంచిది. క్రెడిట్‌ కార్డును తక్షణమే బ్లాక్‌ చేయడం వల్ల మీ కార్డు దుర్వినియోగం అవ్వదు. కార్డు పోయినా, చోరీకి గురయినా లేదా మోసపూరిత లావాదేవీలు జరిగినా.. కార్డును బ్లాక్‌ చేయడానికి వెంటనే క్రెడిట్‌ కార్డు ప్రొవైడర్‌ను సంప్రదించండి. ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయండి, బ్యాంకుకు ఫోటో కాపీని సమర్పించండి. చట్టపరమైన చర్యలు అనుసరిస్తే భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది.

క్రెడిట్‌కార్డును ఎలా బ్లాక్‌ చేయాలి?

కస్టమర్‌ కేర్‌కు: కస్టమర్‌ కేర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేయండి. కనెక్ట్‌ అయిన తర్వాత, కస్టమర్‌కేర్‌ ప్రతినిధి మీ గుర్తింపును, మీ కార్డు చివరి లావాదేవీ లాంటి వివరాలను అడుగుతారు. కార్డును బ్లాక్‌ చేయడానికి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత కార్డును బ్లాక్‌ చేస్తారు.

SMS ద్వారా: కొన్ని బ్యాంకులు కస్టమర్ల క్రెడిట్‌ కార్డులను SMS ద్వారా బ్లాక్‌ చేయడానికి అనుమతిస్తాయి. ఉదా: మీరు యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు వినియోగదారు అనుకోండి.. మీ 16 అంకెల కార్డు నంబర్‌ xxxxxxxxxxxx1967 టైప్‌ చేసి ఒక స్పేస్‌ ఇచ్చి 56161600కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. ఇటువంటి SMS తప్పనిసరిగా కార్డు వినియోగదారుడి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి మాత్రమే పంపాలని గుర్తుంచుకోండి.

నెట్‌ బ్యాంకింగ్‌: మీరు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా మీ క్రెడిట్‌ కార్డును ‘బ్లాక్‌’ చేయొచ్చు. కొన్ని బ్యాంకులు ఈ పద్ధతి ద్వారా క్రెడిట్‌ కార్డులను తాత్కాలికంగా బ్లాక్‌ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ ప్రక్రియ చాలా సులభం. మీ నెట్‌ బ్యాంకింగ్‌ ఖాతాకు లాగిన్‌ అవ్వండి. తర్వాత క్రెడిట్‌ కార్డుల విభాగానికి వెళ్లి ‘బ్లాక్‌’ క్రెడిట్‌ కార్డుపై క్లిక్‌ చేయండి.

మొబైల్‌ యాప్‌: దాదాపు అన్ని బ్యాంకులు మొబైల్‌ అప్లికేషన్‌ను కలిగి ఉన్నాయి. దీని ద్వారా మీ క్రెడిట్‌ కార్డు ఖాతాను నిర్వహించొచ్చు. మీ క్రెడిట్‌ కార్డును ‘బ్లాక్‌’ చేయడానికి ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. ప్రక్రియ సాధారణంగా నెట్‌ బ్యాంకింగ్‌ మాదిరిగానే ఉంటుంది.

బ్రాంచ్‌ను సందర్శించొచ్చు: బ్యాంకు బ్రాంచ్‌ను సందర్శించి, మీ క్రెడిట్‌ కార్డును బ్లాక్‌ చేయడానికి రాతపూర్వక అభ్యర్థనను ఫైల్‌ చేసే అవకాశం ఉంది. కొన్ని బ్యాంకులు దీని కోసం దరఖాస్తు ఫారంను కూడా కలిగి ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని