Stock Market in 2022: సవాళ్లు విసిరినా.. హ్యాట్రిక్ కొట్టాయ్!
దేశీయ స్టాక్ మార్కెట్లు 2022లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ల కంటే మెరుగ్గా రాణించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో ఏడాదీ అంతర్జాతీయ మార్కెట్లను మించి రాణించాయి. ఈ ప్రయాణంలో దేశీయ మదుపర్లు కీలక పాత్ర పోషించారు. ఒకదాని వెనుక మరో సవాల్ వచ్చిపడుతున్నా.. మార్కెట్‌లోకి ‘మనీ’ని కుమ్మరించి సూచీలను నిలబెట్టారు. 2022లో జాతీయ స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీ 18,887 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకి దాదాపు 19,000కు చేరువైంది. క్రితం ఏడాదితో పోలిస్తే 3.37 శాతం పెరిగింది. సెన్సెక్స్ సైతం మూడు శాతానికి పైగా పుంజుకొని 63,583.07 వద్ద రికార్డు స్థాయిని అందుకుంది. విదేశీ మదుపర్లు ఈ సంవత్సరంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకున్నా.. దేశీయ మదుపర్ల కొనుగోళ్లతో సూచీలు నిలబడ్డాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయాలు, విధానపరమైన నిర్ణయాలు 2022లో ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసిన అంశాల్లో ఉన్నాయి.
భౌగోళిక రాజకీయాల టెన్షన్..
కొవిడ్ భయాలు పూర్తిగా తొలగిపోయి 2022ను మార్కెట్లు కొత్త ఉత్సాహంతో ప్రారంభించాయి. కానీ, ఆదిలోనే పెద్ద ఆటంకం ఎదురైంది. ఉక్రెయిన్‌పై రష్యా వేసిన బాంబులు స్టాక్‌మార్కెట్‌ను కుదిపేశాయి. ఆ తర్వాత చైనా, తైవాన్ మధ్య ఘర్షణ సూచీలను కలవరానికి గురి చేసింది. సౌదీ అరేబియా - అమెరికా మధ్య చమురు ఉత్పత్తి విషయంలో చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. రష్యాపై జీ-20 దేశాలు విధించిన ఆంక్షలతో ప్రపంచ భౌగోళిక రాజకీయాలు తీసుకున్న మలుపు మార్కెట్ల గమనాన్నీ మార్చాయి. చివరగా భారత్- చైనా మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి సైనిక ఘర్షణ కూడా మార్కెట్లను ప్రభావితం చేసింది. ఇలా అంతర్జాతీయ ఘర్షణలతో 2022లో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
కమొడిటీ కలవరం..
భౌగోళిక రాజకీయాల తర్వాత ఈ ఏడాది మార్కెట్లను ప్రభావితం చేసిన అంశాల్లో అతిముఖ్యమైనది కమొడిటీ ధరలు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ చమురు ధర ఓ దశలో 131 డాలర్లకు చేరింది. వంట నూనెల ధరలు సైతం కొండెక్కాయి. టన్ను ధర 8,757 మలేషియన్ రింగిట్‌ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఈ ఏడాది సెంట్రల్ బ్యాంకులు అనుసరించిన విధానపరమైన నిర్ణయాలు సైతం మార్కెట్ల గమనాన్ని నిర్దేశించాయి. ఈ విషయంలో దాదాపు అన్ని దేశాలు అమెరికా ఫెడరల్ రిజర్వు వ్యూహాన్నే అనుసరించాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం దాదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాల్ని కఠినతరం చేశాయి. 2023లోనూ ఇదే వైఖరిని కొనసాగించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త సంవత్సరంలో వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయిలకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అదానీ అండ..
అదానీ గ్రూప్ స్టాక్స్ గురించి మాట్లాడుకుండా ఈ ఏడాది మార్కెట్‌లను విశ్లేషిస్తే అది అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ఈ గ్రూప్ నుంచి మొత్తం 7 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. వీటిలో నాలుగు నిఫ్టీ 100 సూచీలో బాగా రాణించిన తొలి 10 కంపెనీల స్టాక్స్ జాబితాలో ఉండడం విశేషం. ఈ నాలుగు కంపెనీల షేరు ధర 54 - 135 శాతం పెరగడం విశేషం. విద్యుత్తుకు డిమాండ్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అదానీ పవర్ స్టాక్ ధర ఏకంగా 200 శాతం పెరిగి రూ.303కు చేరింది. నిఫ్టీ50 సూచీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఈ ఏడాదే చేరింది. దీంతో షేరు ధర 121 శాతం పుంజుకొని రూ.3,798కి పెరిగింది. ఈ ఏడాదే స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైన అదానీ విల్మర్ ఇప్పటి వరకు మదుపర్లకు 115 శాతం రిటర్న్స్ ఇవ్వడం విశేషం. ఇలా ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్లు రాణించడంలో అదానీ స్టాక్స్ కీలక పాత్ర పోషించాయి.
బ్యాంకులు భళా..
ఈ ఏడాది మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపిన మరో అంశం బ్యాంకింగ్ రంగంలో రికవరీ. బీఎస్‌ఈ బ్యాంకింగ్ సూచీ 2022లో ఏకంగా 18 శాతం పుంజుకోవడం విశేషం. బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుతో మొండి బకాయిలకు ఓ పరిష్కారం లభించింది. రుణాలకు గిరాకీ పుంజుకోవడం కూడా కలిసొచ్చింది. ఈ రెండు కారణాలు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను బలంగా మార్చాయి. అయితే, ప్రస్తుతం డిపాజిట్లు, రుణాల వృద్ధి మధ్య అంతరం పెరగడం స్వల్ప కాలంలో కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఈ ఏడాది 25 శాతం పెరిగింది. వచ్చే 12 నెలల పాటూ ఈ స్టాక్ రాణించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రూపాయి తన వంతుగా..
అమెరికాలో వడ్డీ రేట్ల కారణంగా డాలర్ బలపడడంతో ప్రస్తుతం రూపాయి సహా ఇతర ప్రధాన కరెన్సీలన్నీ కనిష్ఠాల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఏడాది డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.28 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో భారత కరెంటు ఖాతా లోటు జీడీపీలో 2.8 శాతానికి సమానమైన 23.9 బిలియన్ డాలర్లకు చేరింది. భారత విదేశీ మారక నిల్వలు 632.7 బిలియన్ డాలర్ల నుంచి 563.5 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
2023పై అంచనాలు..
వచ్చే ఏడాది మార్కెట్లు మిశ్రమ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ఇటీవల రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే జరిగితే యుద్ధానికి ఓ ముగింపు లభించే అవకాశం ఉంది. ఫలితంగా కమొడిటీ ధరలు దిగొస్తాయి. ముఖ్యంగా చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది. వడ్డీరేట్లు గరిష్ఠానికి చేరి.. క్రమంగా కిందకు దిగొచ్చే సూచనలు ఉన్నాయి. చైనాలో కొవిడ్ తగ్గుముఖం పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది గ్లోబల్ మార్కెట్లకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
దేశీయంగా చూస్తే 2023లో భారత మార్కెట్లకు మంచి సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం 5.88 శాతానికి దిగొచ్చింది. రానున్న రోజుల్లో ఇంకా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు సైతం ఈ ఏడాది గరిష్ఠాలతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. వచ్చే సంవత్సరంలో మరింత దిగిరావొచ్చని అంచనా. పంట దిగుబడులూ ఆశాజనకంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థూలంగా చూస్తే 2023లో కొవిడ్ ప్రభావం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా బయటకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం, ఆర్‌బీఐ కలిసి తీసుకుంటున్న చర్యలు; ఆర్థికంగా, రాజకీయంగా ఇతర దేశాలతో పోలిస్తే స్థిరత్వం వంటి కారణాలతో కొత్త సంవత్సరంలో భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తే సూచనలు ఉన్నాయి.
ఇతర ఆసక్తికర అంశాలు..
☛ దేశీయ మ్యూచువల్ ఫండ్లు ఈ ఏడాది రూ.2 లక్షల కోట్లు ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశాయి.
☛ విదేశీ సంస్థాగత మదుపర్లు రికార్డు స్థాయిలో రూ.1.2 లక్షల కోట్లను భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు.
☛ నవంబరులో సిప్‌ల రూపంలో రికార్డు స్థాయిలో రూ.13,306 కోట్లు రావడం విశేషం.
☛ మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఈ ఏడాది వ్యవధిలో దాదాపు రూ.15 లక్షల కోట్లకు పైగా పెరిగింది.
ఇతర దేశాల స్టాక్ మార్కెట్లతో పోలిస్తే మన సూచీలు..
నిఫ్టీ50 సూచీలో బాగా రాణించిన షేర్లు
నిఫ్టీ50 సూచీలో అత్యధికంగా నష్టపోయిన షేర్లు
(గమనిక: పై వివరాలకు డిసెంబరు 28, 2022 మార్కెట్లు ముగిసే సమయానికి ఉన్న గణాంకాలు ఆధారం)
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ఐపీఎల్ 2023.. సరికొత్త పాత్రలో స్టీవ్ స్మిత్!
-
Movies News
Keerthy Suresh: అప్పుడు సావిత్రి.. ఇప్పుడు వెన్నెల.. కీర్తి సురేశ్ సాహసమిది!
-
India News
Mohammad Faizal: లక్షద్వీప్ ఎంపీ ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత
-
India News
India Corona: 5 నెలల తర్వాత.. 2 వేలు దాటిన కరోనా కేసులు
-
India News
Ashraf Ahmed: రెండు వారాల్లో నన్ను చంపేస్తారు..!: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ సోదరుడి ఆరోపణలు
-
Sports News
IPL 2023: అతడే అత్యుత్తమ ఫినిషర్.. మరెవరూ సాటిరారు: రియాన్ పరాగ్