Published : 25 Jun 2022 19:05 IST

Akshaya Tritiya: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? స్వచ్ఛత, మోసాల గురించి తెలుసుకోండి..

Akshaya Tritiya 2022: ఆషాఢం ఆఫర్లంటారు కొందరు.. శ్రావణం డిస్కౌంట్లంటారు ఇంకొందరు. అక్షయ తృతీయకు (Akshaya Tritiya) తక్కువ ధరకే బంగారం అని ఊరిస్తారు మరికొందరు. మా దగ్గర అతి తక్కువ మేకింగ్‌ ఛార్జీలని ఒకరు చెబితే.. మేం అసలు తరుగే తీయం.. అని చెబుతారు ఇంకొకరు. గ్రాము బంగారం ఉచితమని ఒకరు ఊరిస్తే... మా స్కీములో చేరండి, చవగ్గా బంగారం కొనండి అని ఆశపెడతారు ఇంకొకరు. ఇలా పండగల సీజన్‌, పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే ప్రచారం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆఫర్ల మాట అటుంచితే స్వచ్ఛత మాటేంటి?  ఒకవేళ అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా మీరు బంగారం కొనడానికి వెళుతుంటే.. ముందు స్వచ్ఛత, హాల్‌ మార్కింగ్‌ వంటి విషయాలతో పాటు బంగారం విక్రయాల్లో జరిగే మోసాల గురించి తెలుసుకోండి..

ఏమిటీ హాల్‌మార్కింగ్‌?

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) అనే సంస్థ పలు విషయాల్లో ప్రమాణాలను నిర్దేశిస్తూ వినియోగదారులకు అండగా నిలుస్తోంది. స్వర్ణకారులకూ, బంగారం వ్యాపారస్తులకూ లైసెన్సులు ఇచ్చే సంస్థ ఇదే. అలాగే ఆయా లోహాల స్వచ్ఛతా ప్రమాణాలను నిర్దేశించడానికి తెచ్చిందే హాల్‌మార్క్‌ విధానం. హాల్‌మార్క్‌ అనేది ఒక అధికారిక చిహ్నం. ఫలానా బంగారు లేదా వెండి వస్తువు స్వచ్ఛత బీఐఎస్‌ ప్రమాణాలకు లోబడి ఉందని ఇచ్చే గుర్తింపు చిహ్నం. ఇప్పుడు దేశం మొత్తమ్మీద ఎక్కడ వెండి ,బంగారు ఆభరణాలు కొన్నా ఆయా వస్తువుల మీద హాల్‌మార్క్‌ ముద్ర తప్పనిసరిగా ఉండాలి.

ఇంతకు ముందూ ఉండేదిగా?

హాల్‌మార్కింగ్‌ విధానాన్ని 2000 సంవత్సరంలోనే ప్రవేశపెట్టారు. అయితే కొందరు వ్యాపారులు మాత్రమే స్వచ్ఛందంగా ఈ విధానాన్ని అనుసరించేవారు. దేశంలో స్వర్ణాభరణాల వ్యాపారులు లక్షల్లో ఉన్నప్పటికీ.. బీఐఎస్‌లో రిజిస్టర్‌ చేసుకున్నది కొందరే. ఇరవై ఏళ్లయినా అందరూ దాన్ని అందిపుచ్చుకునే పరిస్థితి కన్పించకపోవడంతో ఇప్పుడు తప్పనిసరి చేయాల్సివచ్చింది. తొలి విడతలో 2021 జూన్‌ 23 నుంచి 256 జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి విధానం అమలవుతోంది. 2022 జూన్‌ 1 నుంచి రెండో దశ అమలు కానుంది. దీంతో మరో 32 జిల్లాల్లో ఈ ప్రక్రియ విస్తరించనుంది. దీని ప్రకారం నగల వ్యాపారులంతా ఇప్పుడు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ సంస్థలో తాము హాల్‌మార్క్‌ చేసిన వస్తువుల్నే అమ్ముతామని చెప్పి రిజిస్టర్‌ చేసుకోవాలి.

దీనివల్ల ఏమిటి లాభం?

చాలామంది 916 కేడీఎం అనీ, హాల్‌మార్క్‌ గోల్డ్‌ అనీ చెప్పి అమ్ముతారే కానీ నిజానికి వాటన్నిటిమీదా స్వచ్ఛతకు గ్యారంటీ ఇచ్చే హాల్‌మార్కింగ్‌ ముద్ర ఉండదు. అసలా పేర్లకి అర్థమేమిటో చాలామందికి తెలియదు. దాంతో వినియోగదారులు మోసపోయే అవకాశాలు ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో వినియోగదారులకు నమ్మకం కలిగించే థర్డ్‌ పార్టీ ఈ హాల్‌మార్క్‌ సర్టిఫికెట్‌. దీనివల్ల ఇప్పుడు ప్రతి నగా కచ్చితంగా ఎన్ని క్యారట్ల బంగారంతో తయారైందో తెలిసిపోతుంది. దానికి మాత్రమే డబ్బు చెల్లించవచ్చు. 22 క్యారట్ల పేరు చెప్పి 20 లేదా 18 క్యారట్ల నగను వినియోగదారులకు అమ్మి మోసం చేయడానికి వీలుండదు.

916 కేడీఎం అంటే ఏమిటి?

బంగారం స్వచ్ఛతను క్యారట్లలో కొలుస్తారనీ.. నూరుశాతం శుద్ధమైన బంగారాన్ని 24 క్యారట్ల బంగారం అంటారనీ తెలిసిందే. అది చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి దాంతో నగలు తయారుచేయడం సాధ్యం కాదు. ఎంతో కొంత ఇతర లోహాలు కలపాలి. పాత రోజుల్లో రాగి, వెండి లాంటివి కలిపేవారు. వాటిని కలిపే శాతాన్ని బట్టి బంగారం క్యారటేజ్ ‌(స్వచ్ఛత) మారుతుంటుంది. సాధారణంగా నగల తయారీకి 10 క్యారట్ల నుంచి 22 క్యారట్ల వరకూ వేర్వేరు స్వచ్ఛతలు ఉన్న బంగారాన్ని వాడతారు. దీన్ని శాతంలో తెలుసుకోవాలంటే క్యారట్‌ నంబర్‌ని 24తో విభజించి 100తో గుణించాలి.

ఉదాహరణకు- 22 క్యారట్ల గొలుసు ఉందనుకోండి... 22ని 24తో విభజిస్తే 0.9166 వస్తుంది. దాన్ని వందతో గుణిస్తే 91.66 శాతం అన్నమాట. అంటే కొన్న నగలో 91.66 శాతం బంగారం ఉండగా మిగిలిన 8.34 శాతం ఇతర లోహాలు ఉన్నట్లు. అదే 20 క్యారట్ల బంగారమైతే దాని స్వచ్ఛత 83.3, 18 క్యారట్లయితే 75, 14 క్యారట్లయితే 58.3శాతం చొప్పున ఉంటుంది. ఇదంతా బంగారం స్వచ్ఛత సంగతి. ఇక కేడీఎం విషయానికి వస్తే... వెండి, రాగి లాంటివి కలపడం వల్ల బంగారం మెరుపు కొంచెం తగ్గేది. రాగి కలిపితే ఎరుపు ఛాయతోనూ, వెండి కలిపితే తెల్లగానూ ఉండేది. దాంతో కాడ్మియం అనే లోహాన్ని కలపడం మొదలెట్టారు. దీన్ని కలపడం వల్ల బంగారం మెరుపూ తగ్గేది కాదు, స్వచ్ఛతకూ ఢోకా ఉండేది కాదు. పైగా సరిగ్గా 8 శాతం కాడ్మియం కలిపితే చాలు బంగారం 92 శాతం స్వచ్ఛతతో తగిన పటుత్వంతో ఆభరణాలకు అనువుగా ఉండేది. సాధారణంగా ఆభరణాలకు ఎక్కువగా వాడేది 22 క్యారట్ల బంగారం కాబట్టి దానికి కాడ్మియంతో లెక్క సరిగ్గా సరిపోయేసరికి 916 కేడీయం అన్నమాట వాడుకలోకి వచ్చింది. అయితే కొన్నేళ్లపాటు కాడ్మియం వాడాక అటు నగలు తయారుచేసేవారూ అనారోగ్యం పాలవుతున్నారు. ఆ నగలు ధరించినవారూ చర్మవ్యాధుల నుంచి క్యాన్సర్ల వరకూ రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసింది. దాంతో కాడ్మియం వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఇప్పుడు దాని స్థానంలో జింక్‌, రాగి, వెండి లాంటి లోహాలనే వాడుతున్నారు. అయినా అలవాటైపోయిన కేడీఎం అన్న పేరు మాత్రం అలాగే ఉండిపోయింది.

Also Read: అక్షయ తృతీయకు ‘బంగారం’లాంటి ఆఫర్లు..ఉచితంగా గోల్డ్‌ కాయిన్‌!

బంగారం కొనుగోళ్లలో ఎలాంటి మోసాలు జరుగుతాయి?

  • క్యారట్ల తేడాలేమీ తెలియని వారికి కేడీఎం, హాల్‌మార్క్‌ అన్న పేర్లు చెప్పి 22 క్యారట్ల ధర వసూలు చేస్తూ 18, 20 క్యారట్ల బంగారంతో చేసిన నగలను విక్రయిస్తున్న సంఘటనలూ ఉన్నాయి. ఒక్క బంగారం ప్యూరిటీ విషయంలోనే కాదు, ఇంకా చాలా రకాలుగానూ మోసాలు జరుగుతుంటాయి. తక్కువ క్యారట్లతో చేసిన నగలను 22 క్యారట్ల మేలిమి బంగారం అని నమ్మబలికి అమ్మితే కొన్నవారికి వాటిని మళ్లీ మార్చుకున్నప్పుడు గానీ జరిగిన మోసం తెలియదు. ఇక్కడే హాల్‌మార్కింగ్‌ ఆదుకుంటుంది.
  • నగల దుకాణంలో బిల్లులకు సంబంధించి కూడా వినియోగదారులు కొన్ని విషయాలను స్పష్టంగా తెలుసు కోవాలి. తరుగు (వేస్టేజ్‌), తయారీ (మేకింగ్‌), పన్నుల పేరుతోనూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడం, బిల్లు కావాలంటే ఒక ధర, అక్కర్లేదంటే కాస్త తగ్గించి తీసుకోవడం.. జరుగుతుంటాయి. కాస్తయినా ధర తగ్గుతుందనగానే బిల్లు ఏం చేసుకుంటాంలే నమ్మకమైన షాపే కదా అని అనుకునే వాళ్లే ఎక్కువ. ఆ ధోరణి ఇప్పుడు చెల్లదు.
  • తరుగు విషయానికి వస్తే- ముద్దగా ఉన్న లోహం ముక్క తీసుకుని నాజూగ్గా డిజైన్లను చేస్తున్న సమయంలో కంటికి కన్పించని చిన్న చిన్న ముక్కలు ఎగిరిపోతుంటాయి. ఎంతో కొంత తప్పనిసరిగా వృథా అవుతుంది. ఆరు శాతమో, ఏడు శాతమో దాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు. అలాగని మరీ 18 శాతమో 20 శాతమో వేస్తే, అది అన్యాయమే. మేకింగ్‌ ఛార్జీ కూడా నగ పనితనాన్ని బట్టి ఉంటుంది. మరీ అన్యాయంగా వేస్తున్నారనిపిస్తే తగ్గించమని అడగడంలో తప్పులేదు. వారికి గిట్టుబాటు అయితేనే ఇస్తారు. రెడీమేడ్‌ నగల దుకాణాల్లో తరుగు, తయారీల్లో ఏదో ఒకటి మాత్రమే వసూలు చేస్తారు. ఇక పన్నులనేవి ప్రభుత్వం నిర్దేశించినవి కాబట్టి మార్చడానికి ఉండదు.
  • రాళ్ల నగ కొంటే రాళ్లతో కలిపి బంగారం బరువును లెక్కేస్తారు కొందరు. దానివల్ల వినియోగదారు రాళ్లకి బంగారం ధర చెల్లించాల్సివస్తుంది. పైగా రాళ్లు, వజ్రాలు లాంటివి పొదిగినప్పుడు పటుత్వం కోసం తక్కువ క్యారట్ల బంగారాన్ని వాడతారు. అది చెప్పకుండా 22 క్యారట్ల బంగారం ధర తీసుకోవచ్చు. బీఐఎస్‌ నిబంధనల ప్రకారం రాళ్ల బరువు, బంగారం బరువు విడివిడిగా వేయాలి. ఇవన్నీ మన దగ్గర రికార్డుగా ఉండాలంటే కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో బంగారం బరువు, స్వచ్ఛత, ధర, రాళ్ల బరువు, వాటి ధర, తయారీ ఛార్జీలు, పన్నులు... అన్నీ స్పష్టంగా రాసి ఉండాలి. ఆ బిల్లును పదిలంగా భద్రపరచుకోవాలి. 

అసలు హాల్‌మార్కింగ్‌ ఎవరు చేస్తారు?

హాల్‌మార్కింగ్‌ చేయడానికి ప్రత్యేక యంత్రాలూ, నిపుణులూ ఉన్న కేంద్రాలు ఉంటాయి. తగిన శిక్షణ పొందినవారు బీఐఎస్‌ నుంచి లైసెన్సు పొంది ఈ కేంద్రాలను నెలకొల్పవచ్చు. ‘అసేయింగ్‌ అండ్‌ హాల్‌మార్కింగ్‌ సెంటర్లు’గా పేర్కొనే ఇవి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నిటిలోనూ ఉన్నాయి. నగల తయారీ దారులు, లేదా వాటిని అమ్మే వ్యాపారులు ప్రతి నగనీ ఈ కేంద్రానికి పంపించాలి. అక్కడ వాళ్లు మెషీన్ల సాయంతో ఆయా నగల స్వచ్ఛతను పరీక్షించి కచ్చితంగా అంచనావేస్తారు. స్వచ్ఛతలో ఏ కొంచెం తేడా ఉన్నా హాల్‌మార్క్‌ వేయరు. బంగారమైతే ఒక్కో వస్తువుకీ రూ.35, వెండి అయితే రూ.25 చొప్పున ఛార్జి తీసుకుంటారు. వస్తువు బరువుతో కానీ, ధరతో కానీ దీనికి సంబంధం లేదు. ఆ ఛార్జీలను వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా దుకాణదారు బాధ్యత. వినియోగదారులు నేరుగా హాల్‌మార్కింగ్‌ చేయించుకునే అవకాశం లేదు. కానీ.. అనుమానం వచ్చినప్పుడు ఆ కేంద్రానికి వెళ్లి రూ.200 చెల్లించి నగను పరీక్షించుకోవచ్చు. దుకాణంలో వర్తకుడు ఇచ్చిన ప్యూరిటీ సర్టిఫికెట్‌కీ ఇక్కడ చేసిన పరీక్షకీ మధ్య తేడా ఉంటే దుకాణదారును నిలదీసి ఛార్జీలు వాపస్‌ తీసుకోవచ్చు. ఇక హాల్‌మార్కింగ్‌ లేని పాత బంగారాన్ని నగల వర్తకులకు అమ్మవచ్చు. వాళ్లు నాణ్యత పరీక్షించి తగిన సొమ్ము చెల్లిస్తారు. లేదా కరిగించి కొత్త నగ చేయించుకుని దానికి హాల్‌మార్క్‌ వేయించవచ్చు.

షాప్‌కు వెళ్లేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి..

బంగారం కొనడానికి షాప్‌కు వెళుతుంటే..  ఆ షాప్‌కు బీఐఎస్‌ లైసెన్స్‌ ఉందా? హాల్‌మార్కింగ్‌ నగలు మాత్రమే అమ్ముతామని బోర్డు రాసి పెట్టారా? అన్నది గమనించాలి. దుకాణదారు లైసెన్సును షాపులో ప్రదర్శించాలి. బీఐఎస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అయిన దుకాణాల లిస్టు ఉంటుంది. అక్కడైనా చెక్‌ చేసుకోవచ్చు. లైసెన్సులో చూపిన అడ్రసు, షాపు అడ్రసు ఒకటే అయివుండాలి. హాల్‌మార్కింగ్‌ సెంటర్ల చిరునామాలూ బీఐఎస్‌ వెబ్‌సైట్‌లో ఉంటాయి. కాబట్టి గుర్తింపు ఉన్న హాల్‌మార్కింగ్‌ కేంద్రంలోనే చేయించారా అన్నదీ నిర్ధారించుకోవచ్చు.

  • బీఐఎస్‌ హాల్‌మార్క్‌, బంగారం స్వచ్ఛత, హాల్‌మార్కింగ్‌ సెంటర్‌ కోడ్‌.. ఇవన్నీ నగ లోపలి వైపున ముద్రించి ఉంటాయి. వాటిని పది రెట్లు పెద్దగా చూపించే భూతద్దం దుకాణంలో ఉంటుంది. అడిగి తీసుకుని చూసుకోవాలి. చెవి దుద్దులు, గాజులు లాంటి జతగా ఉండే వస్తువులకు రెండింటికీ విడివిడిగా హాల్‌మార్క్‌ ఉండాలి. దేనిమీదైనా అనుమానం వస్తే బీఐఎస్‌కి ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ, ‘బీఐఎస్‌ కేర్‌’ మొబైల్‌ ఆప్‌ ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చు.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని