Maruti Jimny: విక్రయాల ఎఫెక్ట్‌.. జిమ్నీపై మారుతీ భారీ డిస్కౌంట్‌

Discounts on Maruti Jimny: జిమ్నీపై మారుతీ సుజుకీ భారీ డిస్కౌంట్ ఇస్తోంది. విక్రయాలు తగ్గిన నేపథ్యంలో కంపెనీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది.

Published : 09 Dec 2023 15:06 IST

Maruti suzuki Jimny | ఇంటర్నెట్ డెస్క్‌: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మారుతీ సుజుకీ జిమ్నీ విక్రయాలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో తీసుకొచ్చిన ఈ ఆఫ్‌ రోడర్‌ విక్రయాలు నెల నెలా తగ్గుతూ వస్తున్నాయి. దేశీయంగా ఇప్పటి వరకు 15,476 యూనిట్లు మాత్రమే టోకున అమ్ముడయ్యాయి. దీంతో సేల్స్‌ను పట్టాలెక్కించేందుకు మారుతీ సుజుకీ ఈ కార్లపై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది.

 ఈ ఏడాది జూన్‌లో 3071 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాతి నెల జులైలో 3778, ఆగస్టులో 3104, సెప్టెంబర్‌లో 2,651, అక్టోబర్‌లో 1852 యూనిట్లు అమ్ముడవ్వగా.. నవంబర్‌లో ఈ సంఖ్య 1020 మాత్రమే. వాహనం పరంగా జిమ్నీకి మంచి వాహనానదారులు మార్కులే  వేస్తున్నప్పటికీ.. ధర విషయంలో వెనకడుగు వేస్తున్నారు. దీంతో ధర తగ్గించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్‌విస్‌ సీఈఓ

జిమ్నీ ప్రస్తుతం రెండు వేరియంట్లలో లభిస్తోంది. జెటా, ఆల్ఫా. జెటా మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ధర రూ.12.74 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌) కాగా.. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ధర రూ.13.94 లక్షలుగా ఉంది. అదే అల్ఫా ధరలు రూ.13.69 లక్షల నుంచి రూ.15.05 లక్షలు మధ్య ఉన్నాయి. మరోవైపు మహీంద్రా థార్‌ ధర రూ.10.98 లక్షలకే లభిస్తుండడంతో కొనుగోలుదారుల్లో జిమ్నీ పట్ల అనాసక్తి నెలకొంది.

దీంతో జిమ్నీ సేల్స్‌ను ఎలాగైనా తిరిగి పట్టాలెక్కించేందుకు మారుతీ సుజుకీ భారీగా డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిసింది. జెటా వేరియంట్‌పై రూ.2.21 లక్షల వరకు డిస్కౌంట్‌ ఇస్తుండగా.. ఆల్ఫా వేరియంట్‌పై రూ.1.21 లక్షల వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది. మరోవైపు జిమ్నీలోనే లిమిటెడ్‌ ఎడిషన్‌గా తీసుకొచ్చిన థండర్‌ ఎడిషన్‌ ధర రూ.10.74 లక్షలకే లభిస్తోంది. జిమ్నీలో 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 105 పీఎస్‌ పవర్‌ను, 134 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ ఎంటీ, 4 స్పీడ్‌ ఏటీ ఆప్షన్లలో లభిస్తోంది. మైలేజీ విషయానికొస్తే ఎంటీ వేరియంట్లలో లీటర్‌కు 16.94 కిలోమీటర్లు, ఏటీ వేరియంట్లలో 16.39 కిలోమీటర్లు ఇస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని