Insurance Mis-Selling: బీమా పాలసీ కొంటున్నారా?ఈ విషయాల్లో జాగ్రత్త!

బీమా పాలసీల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. పాలసీ అమ్మే సమయంలో ఏజెంట్లు చేసే కొన్ని మోసాల గురించి తెలుసుకుందాం.

Published : 01 Feb 2024 16:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా దశాబ్దాల నుంచి ఇన్సూరెన్స్‌ అనే పదం చాలా మందికి సుపరిచితమే. ముఖ్యంగా భారత్‌లో బీమా ఏజెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ బీమా గురించి పట్టణ ప్రాంతాల వారికే కాకుండా పల్లెలకూ బాగా విస్తరించింది. అయితే, బీమా ఏజెంట్లు.. వినియోగదారులకు నిజాయతీగా బీమాను విక్రయిస్తే ఏవిధమైన ఇబ్బందీ లేదు. కానీ, కొంతమంది బీమా ఏజెంట్లు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి, అధిక లాభాలు వస్తాయని భ్రమలు కల్పించి బీమాను అంటగడుతుంటారు. ఇలాంటి చర్యల వల్ల బీమా రంగానికి చెడ్డపేరు రావడమే కాకుండా, బీమా వ్యాపారం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. వినియోగదారులు కూడా బీమా పాలసీలను తీసుకునే ముందు ఏజెంట్లు చెప్పే వివరాలతో పాటు, ఆ పాలసీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పరిశీలించాలి. సాధారణంగా బీమా ఏజెంట్లు వినియోగదారులకు చెప్పే ముఖ్యమైన విషయాలు ఇక్కడ చూద్దాం.

బీమా ఏజెంట్‌ ప్రభావం

ఒక చిన్న పట్టణంలో రవి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి సంపాదనలో తగిన మొత్తాన్ని పొదుపు చేయాలనే ఆలోచనను మరొకరితో పంచుకొన్నాడు. ఇంకా వివిధ పెట్టుబడుల వివరాలను ఆరా తీసే ప్రయత్నాలు కూడా చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఒక బీమా ఏజెంట్‌ రవిని కలిసి బీమా గురించి వివరించాడు. మదుపు, బీమా ఒకే దానిలో పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆకర్షణీయంగా చెప్పగలిగాడు. ముఖ్యంగా మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం చాలా ఎక్కువగా ఉంటుందని ఆశ కల్పించాడు. దీంతో రవి పొదుపుతో పాటు అదనంగా బీమా కూడా దక్కుతుందనే యోచనతో యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. కొన్ని ఏళ్ల తర్వాత తన పాలసీపై రాబడి అత్యల్పంగా ఉందని రవికి తెలిసింది. ఈ విషయాన్ని ఆరా తీయడానికి ఏజెంట్ కోసం బీమా కంపెనీ ఆఫీసుకు వెళ్లగా... అతడు ఎప్పుడో ఆ కంపెనీ వదిలేసి వెళ్లిపోయాడని తెలిసింది. యూలిప్‌లో మార్కెట్ పెట్టుబడుల వల్ల రాబడి తగ్గిందనే విషయం రవికి ఆలస్యంగా అర్థం అయింది.

అధిక రాబడి

పాలసీ పెట్టుబడిపై బ్యాంకు వడ్డీతో సమానంగా/ఎక్కువ వడ్డీ రావడమే కాకుండా, బీమా కవరేజ్‌ కూడా ఎక్కువగా ఉంటుందని ఏజెంట్లు చెబుతారు. బీమాలో పొదుపు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఎఫ్‌డీలతో సమానంగా వడ్డీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వీటిలో అనేక ఛార్జీలు ఉంటాయి. ఈ విషయాలను ఏజెంట్లు దాచి పెడుతుంటారు. దీర్ఘకాలం పాటు ప్రీమియంలను గడువులోగా చెల్లించినప్పటికీ సంప్రదాయ బీమా పాలసీలలో 4-5% కన్నా ఎక్కువ రాబడి ఆశించలేం. ఎందుకంటే, బీమా సంస్థలు.. పాలసీల ప్రీమియంలను గ్యారంటీ ఆదాయాన్నిచ్చే వివిధ ప్రభుత్వ బాండ్లు, ఇతర సురక్షిత పథకాల్లో పెట్టుబడిగా పెడతారు. వీటిపై రాబడి స్వల్ప మొత్తమే ఉంటుంది. హామీ మొత్తం, ప్రీమియంలు, పాలసీ నిబంధనలు, షరతులు, చెల్లింపు నిబంధనలు జీవిత బీమా పాలసీలో కీలకమైన అంశాలు.

వాస్తవ వివరాలు దాటవేత

చాలా మంది ఏజెంట్లు బీమాకు సంబంధించిన పూర్తి వివరాలను సరిగ్గా చెప్పకుండా, బీమాపై వచ్చే ప్రయోజనాలను మాత్రమే చెప్పి వినియోగదారులను ఆకర్షిస్తుంటారు. అంతేకాకుండా మెచ్యూర్‌ అయ్యే నాటికి వచ్చే మొత్తాన్ని కూడా తప్పుగా అంటే ఎక్కువగా చెబుతారు. ఎలాగూ బీమా పాలసీ ఎక్కువ కాలం ఉండేదే కాబట్టి అప్పటికి మరిచిపోతారని, లేదా ఈ లోపు తెలిసినా దాని గురించి గట్టిగా ప్రశ్నించరని ఏజెంట్లు భావిస్తారు.

క్లెయిం

బీమా తీసుకునే సమయంలో వినియోగదారుడి క్రమశిక్షణ, జీవనశైలి, అలవాట్లు కూడా బీమా ఏజెంట్లు పరిగణనలోకి తీసుకోవాలి. బీమా తీసుకునే సమయంలో కొంతమంది వారి చెడు అలవాట్లు, అనారోగ్య సమస్యలు వెల్లడించరు. క్లెయిం వచ్చిన సందర్భంలో ఆ వివరాలు బయటపడితే బీమా సంస్థలు క్లెయిం తిరస్కరిస్తాయి. కాబట్టి, బీమా తీసుకునే సమయంలోనే క్లెయింకు సంబంధించిన వివరాలను ఏజెంట్ వినియోగదారుడికి తెలియజేయాలి. ఎలాంటి సందర్భంలో క్లెయిం వస్తుంది? ఎప్పుడు రాదు? లాంటి అన్ని వివరాలు తెలపాలి. కొన్ని అనారోగ్యాలు, అలవాట్లు తెలపడం వల్ల ప్రీమియం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి బీమా కంపెనీ వైద్య పరీక్షలు కూడా కోరే అవకాశం ఉంది. దీని కారణంగా ఏజెంట్లు ఈ విషయాలను తెలపకుండా పాలసీ తీసుకోమని మీకు సమాచారాన్ని అందించినట్లయితే, తక్షణమే అలాంటి వారిని తిరస్కరించాలి. పాలసీ విక్రేత ఇలాంటి సమాచారాన్ని బీమా సంస్థకు అందజేయడంలో విఫలమైతే, భవిష్యత్‌లో క్లెయిం ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ప్రీమియం చెల్లించే స్థోమత

బీమా పాలసీ తీసుకోవడానికి సిద్ధమైనప్పుడు దీర్ఘకాలం పాటు గడువు సమయంలోగా ప్రీమియం చెల్లించాలి. అందుచేత ఈ ప్రీమియంను రెగ్యులర్‌గా చెల్లించగలిగే స్థితిలో ఉన్నవారు మాత్రమే బీమా పాలసీని తీసుకోవడం మేలు. ఒకవేళ రెన్యువల్‌ సమయంలో ప్రీమియం చెల్లించకపోతే బీమా రద్దయ్యే ప్రమాదం ఉంది. చాలా బీమా జీవిత బీమా పాలసీలలో నియమ నిబంధనలను బట్టి తక్కువ కాలంలోనే  పాలసీ రద్దయితే అప్పటిదాకా చెల్లించిన సొమ్ములు కూడా తిరిగిరావు. బీమా ఏజెంట్లు ఒక వ్యక్తి సరైన సమయానికి సరిగ్గా ప్రీమియం చెల్లించగలడా? లేదా? అనేదే చూడరు. ఆ వ్యక్తికి సంబంధించిన ఆర్థిక పరిస్థితిని సరిగ్గా అంచనా వేయరు. ఏజెంట్‌ అధిక కమీషన్‌కు ఆశపడి వినియోగదారుడికి అధిక ప్రీమియంగల పాలసీ అంటగడితే, చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయ్యే అవకాశాలే ఎక్కువ. కాబట్టి పాలసీ బుక్‌ చేసేటప్పుడు మీ ఆర్థిక పరిస్థితి, ప్రీమియం చెల్లించే స్థోమతను తప్పక పరిగణించాలి.

ఉచిత హామీలు/సింగిల్‌ ప్రీమియం

బీమా మోసాల్లో నూతన పోకడలు కనిపిస్తున్నాయి. జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా కల్పిస్తామని బీమా ఏజెంట్లు చెబుతున్నారు. కొవిడ్ ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతూ ఈ విధమైన పాలసీ అమ్మకాలు జరిపే కొన్ని బీమా సంస్థలు పుట్టుకొచ్చాయి. కొందరు బీమా ఏజెంట్లు సింగిల్‌ ప్రీమియం ప్లాన్‌ పేరుతో అధిక ప్రీమియం గల రెగ్యులర్ పాలసీని అంటగడుతుంటారు. ఒక ఏడాది తర్వాత పునరుద్ధరణ ప్రీమియం నోటీసు వచ్చినప్పుడు గానీ వినియోగదారుడికి అర్థం కాదు.

IRDAI చర్యలు

ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (IRDAI) ఇంటిగ్రేటెడ్‌ గ్రీవెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (IGMS) అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది దేశంలోని అన్ని బీమా ప్రొవైడర్లపై కస్టమర్‌ ఫిర్యాదులను నమోదు చేస్తుంది. అన్ని బీమా సంస్థలు, ఏజెంట్లు, మధ్యవర్తులు విక్రయ సమయంలో తప్పనిసరిగా చేయాల్సిన పనులను వివరించింది. బీమా కొనుగోలులో ఉల్లంఘనలు జరిగితే ఐఆర్‌డీఏఐ చట్టపర్యమైన చర్య తీసుకుంటుంది.

చివరిగా: వినియోగదారులు అనేక పత్రికల్లో వచ్చే బీమాకు సంబంధించిన న్యూస్‌ కాలమ్స్‌ చూడొచ్చు. లేదా ఆన్‌లైన్‌లో ఆ బీమాకు సంబంధించిన వివరాలను సరిపోల్చుకోవచ్చు. ఇవన్నీ వీలుకాని పక్షంలో బీమాపై అవగాహన ఉన్నవారిని సంప్రదించి పాలసీని తీసుకోవడం మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని