మద్రాస్‌ రబ్బర్‌ ఫ్యాక్టరీ.. క్రియేట్‌ చేసింది హిస్టరీ.. MRF సక్సెస్‌ స్టోరీ!

MRF Success Story: ఎంఆర్‌ఎఫ్‌ స్టాక్‌ ఈరోజు రూ.లక్ష మార్క్‌ను తాకి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో కంపెనీ విజయ ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం..!

Updated : 13 Jun 2023 19:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మద్రాస్‌ రబ్బర్‌ ఫ్యాక్టరీ’ అనే కంపెనీ గురించి విన్నారా? ఎప్పుడూ విన్నట్లు లేదు కదా? అదే.. టైర్ల కంపెనీ ఎంఆర్‌ఎఫ్‌ (MRF) పూర్తి పేరే ‘మద్రాస్‌ రబ్బర్‌ ఫ్యాక్టరీ’ లిమిటెడ్‌. ఈ కంపెనీ షేరు విలువ మంగళవారం రూ.1లక్ష మార్క్‌ను దాటి చరిత్ర సృష్టించింది. భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఈ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా నిలిచింది.

ఒక స్టాక్‌ విలువ ఆ కంపెనీ పనితీరు, పేరుప్రతిష్ఠలు, భవిష్యత్‌ ప్రణాళికలు, యాజమాన్యంపై ఆధారపడతాయి. మరి ఎంఆర్‌ఎఫ్‌ స్టాక్‌ విలువ అంతలా పెరిగిందంటే కచ్చితంగా పై అంశాలన్నింటిలో ఆ కంపెనీ మెరుగ్గానే ఉండాలి. ఎంఆర్‌ఎఫ్‌ పేరు భారతీయులకు ఎంత సుపరిచితమో చెప్పాల్సిన పనిలేదు. అదే ఆ కంపెనీ సక్సెస్‌ గురించి చెబుతోంది. బెలూన్ల తయారీతో ప్రారంభమై.. విదేశీ కంపెనీల నుంచి పోటీ తట్టుకోలేక చతికిల పడి.. తిరిగి వాటికే గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎలా చేరిందో ఇప్పుడు చూద్దాం...

బెలూన్లతో ప్రారంభమై..

ఎంఆర్‌ఎఫ్‌ (MRF)ను కె.ఎం.మమ్మెన్‌ మప్పిళ్లై (K.M. Mammen Mappillai) స్థాపించారు. కంపెనీ సక్సెస్‌ గురించి మాట్లాడాలంటే కచ్చితంగా మమ్మెన్‌ ప్రస్థానంతోనే అది మొదలవ్వాలి. ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు.. వాటి నుంచి నేర్చుకున్న పాఠాలే కంపెనీని ఆ స్థాయిలో నిలబెట్టాయి. మమ్మెన్‌ వాళ్ల నాన్న ఓ బ్యాంకునీ, న్యూస్‌పేపర్‌నీ నిర్వహిస్తుండేవారు. వివిధ కారణాలరీత్యా అప్పటి ట్రావెన్‌కోర్‌ సంస్థానం ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఆయన్ను రెండేళ్లు జైల్లో పెట్టింది. అప్పటికే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన మమ్మెన్‌ ఉపాధి కోసం బెలూన్లను తయారు చేసి వాటిని మద్రాస్‌ వీధుల్లో ఆయన సతీమణితో కలిసి అమ్మేవారు.

తొలుత టైర్ల ట్రెడ్డింగ్‌ రబ్బర్‌పై..

1949 నాటికి కొంత డబ్బును కూడబెట్టిన మమ్మెన్‌ క్రమంగా ల్యాటెక్స్‌తో తయారు చేసే ఆటబొమ్మలు, చేతితొడుగుల తయారీని ప్రారంభించారు. దీంట్లో మంచి విజయాన్ని అందుకొని మరిన్ని పెద్ద అవకాశాల కోసం వేచిచూస్తున్నారు. అదే సమయంలో టైర్ల ట్రెడ్డింగ్‌లో వాడే రబ్బరును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని తెలిసింది. అలా 1952లో ట్రెడ్‌ రబ్బర్‌ తయారీని మొదలుపెట్టారు. క్వాలిటీ కూడా బాగుండడంతో తక్కువ సమయంలోనే 50 శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకొని మమ్మెన్‌ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

ఆదిలోనే అపవాదు..

క్రమంగా 1961లో టైర్ల తయారీని కూడా ప్రారంభించారు. తొలినాళ్లలో అమెరికాకు చెందిన ‘మ్యాన్స్‌ఫీల్డ్‌ టైర్‌ అండ్‌ రబ్బర్‌’తో చేతులు కలిపారు. అప్పటి తమిళనాడు సీఎం కామరాజ్‌ నాడార్‌ స్వయంగా తొలి టైర్‌ను విడుదల చేయడం విశేషం. అదే సంవత్సరం కంపెనీ మద్రాస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయింది. కానీ, ఆదిలోనే కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మ్యాన్స్‌ఫీల్డ్‌ ఉత్పత్తి చేసే టైర్లు భారత రోడ్లకు పనికిరాలేదు. దీంతో భారత కంపెనీలు నాణ్యమైన టైర్లను తయారు చేయలేవంటూ విదేశీ సంస్థలు దుష్ప్రచారాలు మొదలుపెట్టాయి.

కీలక మలుపు..

అప్పట్లో మూడు విదేశీ కంపెనీలు భారత మార్కెట్‌పై గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయి. వీటిలో ఓ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున ఆర్డర్లు వచ్చేవి. కానీ, ఇలా విదేశీ కంపెనీలపై ఎక్కువగా ఆధారపడడం మంచిది కాదని ప్రభుత్వం పసిగట్టింది. యుద్ధంలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు విదేశీ కంపెనీలు టైర్ల సరఫరాను స్తంభింపజేస్తే అసలుకే మోసమని గ్రహించింది. పైగా ధరలు కూడా బాగా పెరుగుతున్నట్లు గమనించింది. అలా ఎంఆర్‌ఎఫ్‌కు సైతం ప్రభుత్వ ఆర్డర్లలో తగిన వాటా ఇవ్వాలని నిర్ణయించింది. 

మజిల్‌ మ్యాన్‌తో మరింత ముందుకు..

అలా 1963లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఎంఆర్‌ఎఫ్‌ ఫ్యాక్టరీకి పునాది రాయి వేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో విదేశీ కంపెనీలతో సమానంగా పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఇలా ఆరంభ ఆటుపోట్లను అధిగమించిన కంపెనీ.. క్రమంగా భారత్‌లోని రిటైల్‌ కస్టమర్లకు చేరువయ్యేందుకు వ్యూహాలు రచించింది. భారత అడ్వర్టైజింగ్‌ పితామహుడిగా చెప్పే అలిక్‌ పదమ్‌సీని నియమించుకుంది. ఆయన నేరుగా రోడ్లపైకి వెళ్లి ట్రక్‌ డ్రైవర్లను కలిశారు. వాళ్లు ఎలాంటి టైర్లు కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. చాలా మంది దృఢమైన, శక్తిమంతమైన టైర్లు కావాలని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆయన తమ టైర్లను ప్రమోట్‌ చేయడం కోసం ‘ఎంఆర్‌ఎఫ్‌ మజిల్‌ మ్యాన్‌’ (టైర్‌ను ఎత్తుకుని ఉండే కండలు తిరిగిన వ్యక్తి)ని అడ్వర్టైజింగ్‌ కోసం డిజైన్‌ చేసి వాడుకున్నారు. తర్వాతి కాలంలో ఇది టీవీ యాడ్స్‌లో విశేష ఆదరణ పొందింది. 

విదేశీ కంపెనీలకే పోటీ..

అలా 1967లో ఎంఆర్‌ఎఫ్‌ లెబనాన్‌లోని బీరుట్‌లో తొలి విదేశీ కార్యాలయాన్ని తెరిచింది. తర్వాత అమెరికాకు టైర్లను ఎగుమతి చేసిన తొలి భారత కంపెనీగా నిలిచింది. అలా ఒకప్పుడు భారత టైర్ల విపణిలో గుత్తాధిపత్యం చలాయించిన అమెరికాకే తిరిగి టైర్లను ఎగుమతి చేసే స్థాయికి ఎంఆర్‌ఎఫ్‌ ఎదిగింది. దేశీయంగానూ డీలర్లతో మంచి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని తిరుగులేని సంస్థగా అవతరించింది. మ్యాన్స్‌ఫీల్డ్‌ వల్ల తొలినాళ్లలో వచ్చిన అపవాదును చెరిపేసి భారత రోడ్లలో ఎంఆర్‌ఎఫ్‌ టైర్లకు తిరుగుండదని ప్రచారం చేసుకోగలిగింది. తర్వాత నైలాన్‌ టైర్లను ప్రవేశపెట్టిన తొలి భారత కంపెనీగా నిలిచింది.

ఇతర రంగాల్లోకీ..

ఒక్క టైర్ల తయారీకే పరిమితం కాకుండా బ్రాండ్‌ను కస్టమర్ల మైండ్లలోకి చొప్పించడం కోసం మోటార్‌స్పోర్ట్స్‌, క్రికెట్‌లో ఎంఆర్‌ఎఫ్‌ ఇన్వెస్ట్‌ చేసింది. ట్యూబ్‌లు, పెయింట్లు, కన్వేయర్‌ బెల్ట్‌లు, ఆటబొమ్మల తయారీలోకీ ప్రవేశించింది. 2007లో బిలియన్‌ డాలర్ల వార్షిక టర్నోవర్‌ను అందుకున్న కంపెనీగా నిలిచింది. నాలుగేళ్ల వ్యవధిలోనే రెండు బిలియన్ డాలర్ల మైలురాయినీ అందుకుంది.

ఈ విజయ ప్రస్థానమే కంపెనీ స్టాక్‌కు అంత విలువను చేకూర్చిపెట్టింది. ఆ మధ్య ఓ ఇన్వెస్టర్ స్టోరీ కూడా చక్కర్లు కొట్టింది. 1990లో 20,000 వేల ఎంఆర్‌ఎఫ్‌ షేర్లు కొని మర్చిపోతే 2017 నాటికి వాటి విలువ రూ.130 కోట్లు అయిందట!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని