Ola Electric: ఓలా నుంచి ఇ-బైక్‌.. కాకపోతే ఇప్పుడే కాదు!

Ola Electric: విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ఓలా నుంచి త్వరలో మోటార్‌ సైకిళ్లు సైతం రానున్నాయి. ప్రీమియం, మాస్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఓలా వీటిని తీసుకురానుంది.

Published : 30 Dec 2022 22:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్‌ వాహన విభాగంలో దూసుకెళుతున్న ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) రాబోయే రోజుల్లో మరిన్ని వాహనాలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. స్కూటర్లతో పాటు కొన్ని మోటార్‌ సైకిళ్లను తీసుకొచ్చేందుకూ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం ఎస్‌1, ఎస్‌1 ప్రో పేరిట విద్యుత్‌ స్కూటర్లను ఆ సంస్థ విక్రయిస్తోంది. ఎస్‌1 ఎయిర్‌ పేరిట మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తీసుకొచ్చినా.. ఇంకా విక్రయాలు మాత్రం ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రణాళికలను సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ బయటపెట్టారు.

2024 నాటికి అంటే రాబోయే రెండేళ్లలో మరిన్ని విద్యుత్‌ స్కూటర్లు, మోటార్‌ సైకిళ్లు తీసుకురానున్నట్లు భవీశ్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. మాస్‌ మార్కెట్‌తో పాటు ప్రీమియం సెగ్మెంట్‌లోనూ పలు మోడళ్లను తీసుకురానున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది ప్రజల్ని ఆకట్టుకోవడంలో భాగంగా 2023లో ఓ స్కూటర్‌ రాబోతోందని అందులో పేర్కొన్నారు. అయితే, ఎస్‌ 1 ఎయిర్‌నుద్దేశించే అలా అన్నారా? కొత్తగా మరో స్కూటర్‌ ఏదైనా తేబోతున్నారా? అనేదానిపై స్పష్టత లేదు.

విద్యుత్‌ స్కూటర్లతో పాటు విద్యుత్‌ మోటార్‌ సైకిళ్ల గురించీ ప్రజల నుంచి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఓలా సైతం ఇ-బైక్‌ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా క్రూయిజర్‌, అడ్వెంచర్‌, స్పోర్ట్స్‌ పేరిట ప్రీమియం మోడళ్లతో పాటు సాధారణ విద్యుత్‌ బైక్‌ను సైతం ఓలా తీసుకురానుంది. అయితే, 2023 చివర్లో గానీ, 2024 లోగానీ ఓలా మోటార్‌ సైకిల్‌ మార్కెట్లో సందడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అల్ట్రావైలట్‌ ఎప్‌77, టార్క్‌ క్రటోస్‌ ఆర్‌, రివోల్ట్‌ ఆర్‌వీ 400 వంటి విద్యుత్‌ మోటార్‌ సైకిళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. విద్యుత్‌ మోటార్‌ సైకిళ్లతో పాటు 2024లో ఓలా ఓ విద్యుత్‌ కారును సైతం మార్కెట్లోకి తీసుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని