Post office: ఈ పోస్టాఫీసు పథకంతో నెలకు ₹9 వేలు ఆదాయం

Monthly Income Scheme: ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వచ్చే పథకం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ పోస్టాఫీసు పథకంపై లుక్కేయండి...

Updated : 14 Mar 2024 15:19 IST

Post office scheme| ఇంటర్నెట్‌ డెస్క్‌: కష్టపడి సంపాదించిన సొమ్ముపై ఎంతో కొంత రాబడి అందరూ కోరుకుంటారు. కొందరేమో రిస్క్‌ చేసి అధిక ఆదాయం వచ్చే పెట్టుబడుల్ని ఆశ్రయిస్తారు. మరికొందరు మాత్రం ఎలాంటి రిస్క్‌ లేకుండా స్థిరమైన ఆదాయం ఆశిస్తారు. అలాంటి వారికోసం పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (MIS) మంచి ఎంపిక. పెట్టుబడికి భద్రత.. స్థిరమైన నెలవారీ ఆదాయం పొందాలనుకొనేవారు ఈ స్కీమ్‌ను పరిశీలించొచ్చు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు ఉద్యోగ విరమణ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం కచ్చితమైన ఆదాయం పొందాలనుకొంటే ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది.

పోస్టాఫీసు అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (Monthly Income Scheme) ఒకటి. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు నెలవారీ ఆదాయం పొందొచ్చు. పెట్టుబడిదారులు డిపాజిట్‌ చేసిన సొమ్ముకు మార్కెట్‌తో సంబంధం ఉండదు. అంటే మీ డిపాజిట్‌ సేఫ్‌ అన్నమాట. స్థిరమైన ఆదాయం అందించే పథకంగా మంచి ప్రజాదరణ పొందింది. ఈ పథకంలో డిపాజిట్‌ చేయాలనుకుంటే ఈ స్కీమ్‌ అర్హతలు, వడ్డీ, మెచ్యూరిటీ.. తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఖాతాను ఎవరైనా సరే వ్యక్తిగతంగా, జాయింటుగా (గరిష్ఠగా ముగ్గురు వ్యక్తులు) తెరవొచ్చు. 10 ఏళ్లు నిండిన పిల్లల పేరుపై గార్డియన్‌ (మైనర్‌ ఖాతా) ఖాతా తెరవొచ్చు.
  • ఈ పథకంలో క‌నీసం రూ.1,000 పెట్టుబ‌డిగా పెట్టొచ్చు. సింగిల్‌ ఖాతాలో గ‌రిష్ఠంగా రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్ఠంగా రూ.15 లక్షలు పెట్టుబ‌డి పెట్టొచ్చు.
  • ప్రస్తుతం ఈ పథకంపై 7.4 శాతం వడ్డీ ఇస్తున్నారు. మెచ్యూరిటీ పూర్తయ్యేవరకు ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు. ఈ పథకం కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.
  • ఎంఐఎస్‌ ఖాతా తెరిచిన తర్వాత ఐదేళ్లకు మెచ్యూరిటీ పూర్తవుతుంది. ముందస్తు ఉపసంహరణ చేస్తే నిబంధనల ప్రకారం వడ్డీపై కొంత శాతాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. 
  • ఉదాహరణకు.. మీకు నెలవారీ రూ.5,550 ఆదాయం రావాలనుకుంటే రూ.9 లక్షలు ఎంఐఎస్ స్కీమ్‌లో డిపాజిట్‌ చేయాలి.
  • ఇక జాయింట్‌ ఖాతా తెరిచి రూ.15 లక్షలు డిపాజిట్‌ చేసిన వారికి రూ.9,250 నెలవారీ డబ్బు వస్తుంది. మీ నెలవారీ ఖర్చు, కావాలనుకొనే ఆదాయం ఆధారంగా మదుపు చేయొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని