PMKY: ఈ పథకంలో చేరితే రైతన్నలకు నెలకు రూ.3 వేల పింఛన్‌

వయసు పైబడిన రైతుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పథకాన్ని అమలు చేస్తోంది.

Updated : 19 Jun 2023 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైతన్నల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు వంటి స్కీమ్‌లు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. అయితే, ఇవన్నీ వారు వ్యవసాయం చేస్తున్నంతకాలం మాత్రమే అండగా నిలుస్తాయి. ఒకసారి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆదాయ వనరు ఉండదు. ఈ నేపథ్యంలో వయసు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన (Pradhan Mantri Kisan Maan Dhan Yojana- PMKMY)’ పేరిట సామాజిక భద్రత పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన రైతులు పింఛన్‌ పొందొచ్చు. నెలకు కనీసం రూ.3 వేల పింఛన్‌ అందుతుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

అర్హులు ఎవరంటే..

దీనికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు అర్హులు. దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డుల్లో పేర్లు ఉండి, 2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమిని కలిగి ఉండాలి. అలాంటి చిన్న, సన్నకారు రైతులందరూ ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవచ్చు. పింఛన్‌ మాత్రం 60 ఏళ్లు నిండిన తర్వాతే అందుతుంది.

వీరికి అర్హత లేదు..

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌), ఈఎస్‌ఐ స్కీమ్‌, ఈపీఎఫ్‌వో పరిధిలో ఉన్నవారు, ఏవైనా ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రత పథకాల పరిధిలో ఉన్నవారు, జాతీయ పెన్షన్‌ పథకాన్ని ఎంచుకున్న రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వర్గాల వారు ‘పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌’ పింఛన్‌ పొందడానికి అనర్హులు.

ప్రీమియం ఇలా..

60 సంవత్సరాల వయసు నిండేవరకు రైతులు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెలా రూ.3 వేల పింఛన్‌ అందుతుంది. పథకంలో చేరేవారికి వయసును బట్టి ప్రీమియం ఉండగా రైతు చెల్లించిన మేరకు ప్రభుత్వం కూడా తనవంతుగా బీమా కంపెనీకి చెల్లిస్తుంది. ఉదాహరణకు 18 సంవత్సరాల రైతు తనవాటాగా నెలకు రూ.55 చెల్లిస్తే కేంద్రం తనవాటాగా రూ.55ను కలిపి బీమా కంపెనీకి రూ.110 చెల్లిస్తుంది. 18 ఏళ్లవారికి ప్రీమియం రూ.55 ఉండగా ఏటా వయసును బట్టి రూ.3 నుంచి రూ.10 వరకు పెరుగుతుంది. 40 ఏళ్లవారికి రూ.200 ప్రీమియం ఉంది.

రైతు మరణిస్తే జీవిత భాగస్వామికి..

పథకంలోని రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామి పథకాన్ని కొనసాగించవచ్చు. 60 సంవత్సరాల వయసు నిండిన తరువాత రూ.3 వేల చొప్పున పింఛన్‌ను అందిస్తారు. వయసు నిండిన తరువాత రైతు మరణిస్తే జీవిత భాగస్వామికి సగం పింఛన్‌ను ఇస్తారు. పథకాన్ని కొనసాగించేందుకుగానూ కనీసం ఐదేళ్లపాటు రైతు తనవాటా ప్రీమియంను నిర్దేశిత తేదీ ప్రకారం చెల్లించాలి. పీఎంకేఎం యోజన పూర్తిగా స్వచ్ఛందం.

ఇవీ కావాల్సినవి..

సాగుదారులు కామన్‌ సర్వీస్‌ సెంటర్లలో తమపేర్లను ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. రైతు ఫొటో, నివాస ధ్రువీకరణ, ఆదాయం, వయసు నిర్ధారణ, సాగు భూమి, ఆధార్‌ తదితర పత్రాలను సమర్పించాలి. అన్ని వివరాలను కేంద్ర పీఎంకేఎం పోర్టర్‌లో నమోదు చేసిన తరువాత రైతుకు సమాచారం వస్తుంది. ప్రత్యేకమైన పింఛన్‌ ఖాతాను తెరచి కార్డును అందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని