SBI రుణాలు ఇక మరింత ప్రియం.. పెరిగిన MCLR

స‌వ‌రించిన రేట్లు జులై 15 నుంచి అమ‌ల‌వుతాయ‌ని ఎస్‌బీఐ త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

Updated : 15 Jul 2022 12:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ అతిపెద్ద దిగ్గ‌జ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (MCLR)ను స‌వ‌రించింది. అన్ని కాల‌ప‌రిమితుల‌పై ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) మేర పెంచింది. స‌వ‌రించిన రేట్లు జులై 15 నుంచి అమ‌ల‌వుతాయ‌ని ఎస్‌బీఐ త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఏడాది కాల‌వ్య‌వ‌ధి గ‌ల ఎంసీఎల్ఆర్‌ను 7.40 శాతం నుంచి 7.50 శాతానికి, ఆరు నెల‌ల కాల‌వ్య‌వ‌ధికి 7.35 నుంచి 7.45 శాతానికి, రెండేళ్ల కాల‌వ్య‌వ‌ధికి 7.60 శాతం నుంచి 7.70 శాతానికి, మూడేళ్ల కాల‌ప‌రిమితి 7.70 శాతం నుంచి 7.80 శాతానికి  పెంచారు. దీంతో గృహ‌, వాహ‌న‌, ఇత‌ర వ్య‌క్తిగ‌త రుణ ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. మ‌రోవైపు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ కూడా జులైలో ఎంసీఎల్ఆర్‌ను పెంచాయి. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా నిర్ధిష్ట కాల‌ప‌రిమితుల‌పై ఎంసీఎల్ఆర్‌ను 10-15 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. జులై 12 నుంచి ఈ రేట్లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. అలాగే, ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ కూడా వివిధ కాల‌ప‌రిమితుల‌పై ఎంసీఎల్ఆర్‌ను 10-15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ రేట్లు జులై 8 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి.

ప్ర‌స్తుతం ఎస్‌బీఐ గృహ రుణాల‌ను 7.05 శాతం నుంచి 7.55 శాతం వ‌డ్డీతో, వాహ‌న రుణాల‌ను 7.45 శాతం నుంచి 8.15 శాతం వ‌డ్డీతో అందిస్తోంది. రుణ‌గ్ర‌హీత‌ల వ్య‌క్తిగ‌త క్రెడిట్ స్కోరు ఆధారంగా రుణంపై వ‌ర్తించే వ‌డ్డీ రేటును ఎస్‌బీఐ నిర్ణ‌యిస్తుంది.

ఎంసీఎల్ఆర్ అంటే..?
ఎంసీఎల్ఆర్ అనేది ప్రామాణిక‌ రుణ రేటు. నిధుల సేక‌ర‌ణ‌కు బ్యాంకుల‌కు అయ్యే (మార్జిన‌ల్) వ్య‌యం, నిర్వ‌హ‌ణ వ్య‌యం, క్యాష్ రిజ‌ర్వు రేషియో (సీఆర్ఆర్‌), కాల‌ప‌రిమితి ప్రీమియంల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎంసీఎల్ఆర్‌ను లెక్కిస్తారు. కాబ‌ట్టి, బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే త‌క్కువ‌కు రుణం అందించే అవ‌కాశం ఉండ‌దు. వివిధ కాల‌ప‌రిమితుల‌కు (ఓవ‌ర్ నైట్ నుంచి మూడేళ్ల వ‌ర‌కు) ఎంసీఎల్ఆర్ వేర్వేరుగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని