Stock Mrket: భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

అమెరికాలో ద్రవ్యోల్బణం మందగించిందనే కబురు దేశీయ మార్కెట్లలో ఉత్సాహం నింపింది. సూచీలు లాభాల జోష్‌లో ఉన్నాయి.

Published : 13 Jul 2023 09:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.17 సమయంలో నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో 19,488 వద్ద, సెన్సెక్స్‌ 360 పాయింట్లు పెరిగి 65,754 వద్ద ఉన్నాయి. ప్రైమో కెమికల్స్‌, జెన్‌ టెక్నాలజీస్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, పాలిమెడిక్యూర్‌, లాయిడ్‌ మెటల్స్ లాభాల్లో ఉండగా.. కేపీఐ గ్రీన్‌ ఎనర్జీ, ఎజిస్‌ లాజిస్టిక్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మ్యాక్స్‌ ఫినాన్స్‌ షేర్ల విలువ కుంగింది. నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మరింత బలపడి 81.99 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

అమెరికా వినిమయ ద్రవ్యోల్బణం నెమ్మదించినట్లు గణాంకాలు వెల్లడించడం ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపింది. అమెరికా మార్కెట్లు నిన్న సానుకూలంగా ట్రేడింగ్‌ను ముగించాయి. డోజోన్స్‌ 0.2 5శాతం, నాస్‌డాక్‌ 1.15 శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.74శాతం విలువ పెరిగాయి. ఆసియా మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్‌ 1.42శాతం, షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ 0.87 శాతం, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ 2.58 శాతం, జపాన్‌ నిక్కీ 1.29 శాతం, తైవాన్‌కు చెందిన టీసీఎస్‌సీ 1.62 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో ఏకీకృత లాభం 16.83% వృద్ధి సాధించడం ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెంచింది. వాస్తవానికి విశ్లేషకులు అంచనా వేసిన రూ.10,886 కోట్ల లాభంతో పోలిస్తే ఇది ఎక్కువ. ప్రస్తుతం తమ వద్ద 10.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83,700 కోట్ల) ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. మరో టెక్‌ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.3,534 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 7.6% అధికం. ఈ ఏడాది జూన్‌లో ప్రయాణికుల వాహనాల (కార్లు, స్పోర్ట్స్‌ వినియోగ వాహనాలు, వ్యాన్లు-పీవీ) టోకు అమ్మకాలు 2% పెరిగి 3,27,487కు చేరినట్లు వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్‌) వెల్లడించింది. ఆటో షేర్లపై దీని సానుకూల ప్రభావం పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని