Q-A: పీఎఫ్‌ ఖాతాలో పాన్‌ నంబర్‌ తప్పుగా నమోదైంది.. ఇప్పుడెలా?

పాఠకుల సందేహాలకు నిపుణుల సమాధానాలను ఇక్కడ చూడొచ్చు. మీ ప్రశ్న కాలమ్‌లో మీ సందేహాలను నమోదు చేయొచ్చు.

Updated : 17 Oct 2022 14:09 IST

టర్మ్ పాలసీ తీసుకోవడం మంచిదని నా స్నేహితుడు చెప్పాడు. అయితే, ఎంత మొత్తానికి తీసుకోవాలి?

- మాధవ రావు

మీరు ఎంచుకునే టర్మ్ పాలసీలో మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్లు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా భవిష్యత్‌లో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులూ తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ ఆన్‌లైన్‌ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్‌సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.


ఈపీఎఫ్‌ ఖాతాలో పాన్‌ నంబరు తప్పుగా నమోదైంది. దీనివల్ల పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడం కష్టంగా ఉంది. ఇప్పుడేం చేయాలి?

- రమేష్

ఈపీఎఫ్ఓ ప్రకారం.. భవిష్య నిధి ఖాతాలో పేరు, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలు ఆధార్, బ్యాంకు ఖాతాలోని వివరాలతో కచ్చితంగా మ్యాచ్ అయ్యి ఉండాలి. ఒకవేళ పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్) వివరాలతో సరిపోలకపోతే ఖాతాదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖాతాదారులు భవిష్య నిధి ఖాతాలోని తమ వివరాలను మార్చుకోవాలనుకుంటే... యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) సాయంతో ఆన్‌లైన్‌లో లేదా సంస్థ ద్వారా కూడా మార్చుకోవచ్చు.


క్రెడిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నాను. వచ్చే నెల పూర్తి పరిమితి మేరకు కార్డు వాడుకునే వీలుంటుందా?

- నారాయణ

ఈఎంఐ చెల్లించినన్ని రోజులూ కార్డు పరిమితిని గరిష్ఠంగా ఉపయోగించుకోలేరు. ఉదాహరణకు మీ కార్డు గరిష్ఠ పరిమితి రూ. 50 వేలు అనుకుందాం. అందులో రూ .25 వేల మొత్తానికి మూడు నెలల ఈఎంఐ ఉందనుకుందాం.  అప్పుడు మీ కార్డు మీద రూ. 25 వేలు వరకే కొనుగోలు చేసే వీలు ఉంటుంది. ఈఎంఐ చెల్లిస్తున్న కొద్దీ పరిమితి కూడా క్రమంగా పెరుగుతుంది.


ఈపీఎఫ్ నుంచి ఎన్‌పీఎస్‌కు బదిలీ సాధ్యమా?

-విక్రమ్ 

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సభ్యులకు ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఎన్‌పీఎస్‌కు తమ పదవీ విరమణ పొదుపును బదిలీ చేసే సౌకర్యాన్ని భారత పింఛను నియంత్రణ సంస్థ (PFRDA) కల్పిస్తోంది. చందాదారుడు తన సంస్థ ద్వారా సంబంధిత పీఎఫ్ కార్యాలయాన్ని సంప్రదించి తన పీఎఫ్ ఖాతాలోని సొమ్మును ఎన్‌పీఎస్‌కు బదిలీ చేయడానికి దరఖాస్తు చేయొచ్చు. ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఎన్‌పీఎస్‌కు బదిలీ చేసుకునే వారికి క్రియాశీల ఎన్‌పీఎస్‌ టైర్‌-1 అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. దీన్ని ఉద్యోగి తన సంస్థ ద్వారా లేదా ఎన్‌పీఎస్‌ ట్రస్ట్ వెబ్‌సైట్‌లోని ఈ-ఎన్‌పీఎస్‌ ఆప్షన్‌  ద్వారా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని