Life Insurance: ధూమపానం జీవిత బీమా ప్రీమియంను ఎలా ప్రభావితం చేస్తుంది?

ధూమపానం చేసేవారు జీవిత బీమాను కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

Published : 12 Jan 2024 01:15 IST

జీవిత బీమా గురించి తెలియని వారుండరు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం సమయంలో, జీవిత బీమా అతని కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రతను అందించే కీలకమైన ఆర్థిక సాధనం. అయితే, జీవిత బీమా కోసం దరఖాస్తు చేసినప్పుడు, ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించడానికి అనేక అంశాలు అమల్లోకి వస్తాయి. పాలసీదారుడు ధూమపానం చేస్తున్నారా లేదా అనేది కీలకమైన అంశాలలో ఒకటి. బీమా సంస్థలు ఎక్కువ వయసు ఉన్నవారినే కాకుండా, పొగతాగే వారిని హై-రిస్క్‌ వ్యక్తులుగా పరిగణిస్తాయి. పొగాకు వాడకంతో పెరిగిన ఆరోగ్య ప్రమాదాల కారణంగా ధూమపానం చేసేవారు అధిక ప్రీమియం ఖర్చులను ఎదుర్కొంటారు. ఇక్కడ ధూమపానం జీవిత బీమా ప్రీమియంలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.

ధూమపానం

సిగరెట్లు, బీడీలు, చుట్టలు, వేప్‌లు తాగితే బీమా కంపెనీ స్మోకింగ్‌ అలవాటుగా పరిగణిస్తుంది. గుట్కా, పాన్‌ మసాలా, నికోటిన్‌ పాచెస్‌, నికోటిన్‌ చూయింగ్‌ గమ్స్‌, గంజాయి ఉపయోగించే వ్యక్తులు కూడా అదే కోవలోకి వస్తారు. అప్పుడప్పుడు ధూమపానం చేసేవారు, రోజువారి అలవాటు అనే తేడా లేకుండా ఒకే విధంగా బీమా సంస్థ పరిగణిస్తుంది. బీమా సంస్థలు సాధారణంగా కొన్ని ప్రశ్నలు అడుగుతాయి. ఎ) మీరు నికోటిన్‌/పొగాకు ఉత్పత్తులను తీసుకుంటారా? బి) మీరు ధూమపానం చేస్తారా? సీ) మీరు గత 5 ఏళ్లలో పొగాకు ఉత్పత్తిని వినియోగించారా?డి) మీరు ఎప్పుడైనా పొగాకు ఉత్పత్తులను వినియోగించారా?ఈ ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే, మీరు ధూమపానం చేసేవారుగా బీమా సంస్థ పరిగణిస్తుంది. బీమా కంపెనీ మిమ్మల్ని ధూమపానం చేసేవారిగా ట్యాగ్‌ చేసినట్లయితే, మీరు హై-రిస్క్‌ కేటగిరీలో ఉన్నట్టే. మీకు బీమా ప్రీమియం కూడా ఎక్కువే ఉంటుంది.

అధిక ప్రీమియం

వ్యక్తులు జీవిత బీమాను ఎంచుకున్నప్పుడు తగిన ప్రీమియం ధరను నిర్ణయించడానికి దరఖాస్తుదారుడికి సంబంధించిన రిస్క్‌ ప్రొఫైల్‌ను నిశితంగా అంచనా వేస్తారు. శాస్త్రీయ ఆధారాలు, గణాంక అధ్యయనాల ప్రకారం ధూమపానం చేయనివారితో పోలిస్తే పొగతాగే వారి జీవితకాలం గణనీయంగా తక్కువ ఉంటుందని నిరూపణ అయ్యింది. ఈ అలవాటుతో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, శ్వాసకోశ సమస్యలతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీవిత బీమా ప్రొవైడర్ల దృష్టిలో ఈ అలవాటు ఉన్న వ్యక్తులు ఆరోగ్య సమస్యలు, తక్కువ ఆయుర్ధాయాన్ని కలిగి ఉంటారు. సగటున ధూమపానం అలవాటు లేనివారితో పోలిస్తే ఉన్నవారు జీవిత బీమా ప్రీమియంల కోసం 50-80% ఎక్కువ చెల్లించాలి. ఈ ప్రీమియం ఒక బీమా కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతూ ఉంటుంది.

అలవాటు దాచకూడదు

జీవిత బీమా కోసం దరఖాస్తు చేసేటప్పుడు, ధూమపాన అలవాట్ల గురించి నిజాయితీగా సమాచారం అందించాలి. బీమా ప్రీమియం ఎక్కువ ఉంటుంది అని అలవాటును దాచకూడదు. ఒకవేళ నిజాన్ని దాస్తే, భవిష్యత్తులో పాలసీదారుడికి వ్యతిరేక పరిణామాలు ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియలో ధూమపాన అలవాట్లను తప్పుగా సూచించారని లేదా తప్పుడు సమాచారాన్ని అందించారని బీమా కంపెనీ గుర్తిస్తే, అది క్లెయిం చేసేటప్పుడు తిరస్కరణకు లేదా పాలసీని రద్దు చేయడానికి దారి తీయొచ్చు. పాలసీని ధ్రువీకరించే ప్రక్రియలో బీమా కంపెనీ గత 12 నెలల్లో ధూమపాన అలవాటు, పొగాకు వినియోగం గురించి ఆరా తీస్తుంది. బీమా సంస్థలు వయసును బట్టి మెడికల్‌ ఫిట్‌నెస్‌ సరిఫికెట్లు కూడా అడుగుతాయి. వైద్య పరీక్షల ద్వారా నికోటిన్‌కు సంబంధించిన జాడను సులభంగా కనుక్కోవచ్చు. పాలసీ తీసుకున్న 3 ఏళ్ల లోపు డెత్‌ క్లెయిం సెటిల్‌మెంట్‌ను, అలవాట్లను తప్పుగా సూచించిన కారణంగా తిరస్కరించే హక్కు బీమా సంస్థలకు ఉందని గమనించాలి. కాబట్టి, ఈ అలవాట్ల సమాచారాన్ని బీమా సంస్థ వద్ద దాచకూడదు.

అలవాటును మానేస్తే

జీవిత బీమా ప్రీమియంలపై స్మోకింగ్‌ ప్రభావం గణనీయంగా ఉన్నప్పటికీ, ఈ అలవాటును మానుకున్నవారికి కొన్ని బీమా కంపెనీలు వైద్య పరీక్షలు చేసిన అనంతరం నిర్దిష్ట కాలానికి తక్కువ ప్రీమియంలను వసూలు చేయొచ్చు. అయితే, సాధారణంగా 1-5 సంవత్సరాల వరకు స్మోకింగ్‌ను వదులుకుంటే తప్ప కొన్ని బీమా సంస్థలు ధూమపానరహిత స్థితిని అంగీకరించవు. ఈ అలవాటు ఉన్న వ్యక్తి విజయవంతంగా ధూమపానం మానేసి, పొగాకు రహిత జీవనశైలిని కొనసాగించిన తర్వాత, జీవిత బీమా ప్రీమియంకు సంబంధించిన రీవాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, పాలసీదారుడి వయసు పెరగడంతో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలు ప్రతికూలకంగా ఉన్నట్లయితే.. బీమా కంపెనీ ఇలాంటి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రీమియంను నిర్ణయిస్తుంది.

చివరిగా: ఈ అలవాట్లే కాకుండా జీవిత బీమా రకం, బీమా మొత్తం, వయసు, ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా బీమా ప్రీమియం మారుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని