Credit Score: క్రెడిట్‌ స్కోరును పెంచుకోవడం ఎలా?

సరైన క్రెడిట్‌ స్కోరును నిర్వహించడానికి గడువులోగా చెల్లింపులే కాకుండా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, అవేంటో చూడండి.

Published : 23 Dec 2022 18:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  క్రెడిట్‌ స్కోరును (Credit Score) వేగంగా మెరుగుపరచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ కారణం చేతనైనా క్రెడిట్‌ స్కోరు తగ్గినా, సంతృప్తికరమైన స్థితిలో లేకపోయినా.. ఒక రోజులోనే ఈ స్కోరును మెరుగుపర్చుకోలేం. దీనికి కొంత వ్యవధి పడుతుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలి. 750, అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే.. రుణాలపై తక్కువ వడ్డీ రేటు, కొత్త క్రెడిట్‌ కార్డులకు ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే, తక్కువ స్కోరు ఉంటే దాన్ని మెరుగుపరచుకోవచ్చు. మరి మెరుగైన క్రెడిట్‌ స్కోరును నిర్వహించడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించాలి

మీ క్రెడిట్‌ స్కోరును లెక్కించేటప్పుడు క్రెడిట్‌ బ్యూరోలు (గడువు తేదీలోగా) మీరు చెల్లించే బకాయిలపై దృష్టి పెడతాయి. ఈ చెల్లింపుల్లో క్రమశిక్షణ పాటించేవారికి ప్రాధాన్యం ఇస్తాయి. అందువల్ల, మీరు క్రెడిట్‌ కార్డు బకాయిలు, రుణ ఈఎంఐలు, బిల్లులను సకాలంలో పూర్తిగా చెల్లించడం చాలా ముఖ్యం. మీకు ఎక్కువ రుణాలు, క్రెడిట్‌ కార్డులు ఉన్నట్లయితే వాటిపై ఆటో-పే సెట్‌ చేసుకోవాలని లేదా ప్రతి దానికీ గడువు తేదీకి రిమైండర్‌లను సెట్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఎల్లప్పుడూ క్రెడిట్‌ కార్డు బకాయిలను పూర్తిగా చెల్లించాలి. కనీస మొత్తాన్ని చెల్లించే ఆప్షన్‌ అనుకూలమైన ఎంపికగా కనిపించవచ్చు. చెల్లించని మిగిలిన మొత్తంపై వడ్డీ భారీగానే పడుతుందని గమనించాలి.

బహుళ విచారణలు చేయొద్దు

మీరు రుణం లేదా క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకులు మీ క్రెడిట్‌ యోగ్యతను అంచనా వేయడానికి బ్యూరోల నుంచి మీ క్రెడిట్‌ రిపోర్టును పొందుతాయి. తక్కువ వ్యవధిలో అనేక విచారణలు చేస్తే, అది మీ క్రెడిట్‌ స్కోరును గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే, ఇది మీకుండే రుణ ఆసక్తిని బహిర్గతం చేస్తాయి. 

సహ-దరఖాస్తు రుణాలపై అప్రమత్తత

రుణం కోసం సహ-దరఖాస్తుదారుగా ఉన్నప్పుడు, ఇతర దరఖాస్తుదారులతో పాటు రుణాన్ని తీసుకునే బాధ్యతను మీరు పంచుకుంటారు. ఫలితంగా అవతలి వ్యక్తి రుణ ఎగవేతలకు మీరు కూడా సమానంగా జవాబుదారీగా ఉంటారు. సహ-దరఖాస్తుదారులు చెల్లించని రుణాలు కూడా మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి సహ-దరఖాస్తుదారులందరూ ఈఎంఐలలో తమ భాగాన్ని చెల్లిస్తున్నారని నిర్ధారించుకోవడానికి అటువంటి రుణాలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయడం చాలా ముఖ్యం.

క్రెడిట్‌ పరిమితిని దాటిపోవద్దు

మీ క్రెడిట్‌ కార్డులపై క్రెడిట్‌ పరిమితిని ఎక్కువ సార్లు దాటితే.. అది మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపుతుంది. ఇలా పరిమితి దాటడం తరచుగా క్రెడిట్‌పై ఆధారపడే మీ జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. ఫలితంగా మీ క్రెడిట్‌ స్కోరు ప్రభావితం అవుతుంది. మీ ప్రస్తుత కార్డులలో క్రెడిట్‌ పరిమితి మీ అవసరాలకు సరిపోదని మీరు భావిస్తే.. కార్డు ప్రొవైడర్‌ను పరిమితిని పెంచాలని అభ్యర్థించాలి. క్రెడిట్‌ పరిమితిని పెంచుకోవడానికి కొత్త క్రెడిట్‌ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

సెటిల్‌మెంట్‌ మంచిదా?

మీ కార్డుపై బకాయిని గడువు తేదీలోగా చెల్లించకపోతే.. తర్వాతైనా సాధ్యమైనంత త్వరగా పూర్తి బకాయిని చెల్లించేయాలి. మీరు బకాయిలను చెల్లించలేకపోతే బ్యాంకు మీకు వన్‌-టైమ్‌ సెటిల్‌మెంట్‌ సౌకర్యాన్ని అందించవచ్చు. మీరు చెల్లించాల్సిన మొత్తంలో కొంత భాగాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మిగిలినది మాఫీ చేస్తారు. అయితే, మీరు సెటిల్‌మెంట్‌ను ఎంచుకున్నప్పుడు పూర్తి బకాయి మొత్తాన్ని చెల్లించలేరని అంగీకరించినట్టే. ఇది క్రెడిట్‌ బ్యూరోలకు రిపోర్ట్‌గా వెళుతుంది. క్రెడిట్‌ రిపోర్టులో దీన్ని 'సెటిల్డ్‌'గా గుర్తిస్తారు. క్రెడిట్‌ స్కోరు గణనీయంగా తగ్గుతుంది. భవిష్యత్‌లో మీరు రుణాలకు ప్రయత్నించినప్పుడు మీ చెల్లింపుల సామర్థ్యాన్ని క్రెడిట్‌ బ్యూరోలు తక్కువగా అంచనా వేస్తాయి.

చివరిగా: మంచి క్రెడిట్‌ స్కోరును నిర్వహించడానికి పై మార్గాలతో పాటు, ప్రతికూల ప్రభావాన్ని సృష్టించే మీ నివేదికలో లోపాలు లేవని నిర్ధారించుకోవడానికి ప్రతి 2-3 నెలలకు ఒకసారి మీ క్రెడిట్‌ నివేదికను తనిఖీ చేసుకోవాలి. మీ క్రెడిట్‌ స్కోరు ప్రతికూలంగా ప్రభావితమవుతోందని మీరు భావిస్తే.. స్కోరును మెరుగుపరచుకోవడానికి కారణాలు వెతికి వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని