Swiggy- HDFC: స్విగ్గీ నుంచి క్రెడిట్‌ కార్డ్‌.. ఫుడ్‌, గ్రాసరీలపై 10% క్యాష్‌బ్యాక్‌

Swiggy- HDFC Credit card: ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సంయుక్తంగా ఓ క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చాయి. ఫుడ్‌, గ్రాసరీ డెలివరీలపై ఈ కార్డుపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

Published : 26 Jul 2023 18:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ (Swiggy) ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC bank) కలిసి కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును (Credit card) తీసుకొచ్చాయి. మాస్టర్‌ కార్డ్‌ పేమెంట్‌ నెట్‌వర్క్‌పై ఈ కార్డు పనిచేస్తుంది. స్విగ్గీ ఫుడ్‌, గ్రాసరీ డెలివరీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తుండడం ఈ కార్డు ప్రత్యేకత. ఇతర కొనుగోళ్లపైనా రివార్డులు, ప్రయోజనాలు లభిస్తాయి. స్విగ్గీ నుంచి ఈ తరహా క్రెడిట్‌ కార్డు రావడం ఇదే తొలిసారి.

ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా స్విగ్గీలో ఫుడ్‌, గ్రాసరీ, డైనౌట్‌ కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అంటే స్విగ్గీలో ఫుడ్‌, ఇన్‌స్టా మార్ట్‌లో గ్రాసరీ, డైనౌట్‌లో జరిపిన ప్రతి లావాదేవీపై  10 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అలాగే, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, నైకా, ఓలా, ఉబర్‌, ఫార్మాఈజీ, నెట్‌మెడ్స్‌, బుక్‌ మై షోలో లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఇతర కొనుగోళ్లపై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఈ మొత్తం స్విగ్గీ మనీలో జమ అవుతుంది. దాన్ని స్విగ్గీలో ఇతర లావాదేవీలకు వినియోగించుకోవచ్చు.

వీసాతో అదానీ గ్రూప్‌ జట్టు.. త్వరలో క్రెడిట్‌ కార్డ్‌..!

ఈ కార్డు జాయినింగ్‌ ఫీజు రూ.500. వార్షిక రుసుముగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో రూ.2 లక్షలు కంటే ఎక్కువ కొనుగోళ్లు జరిపితే వార్షిక రుసుము రద్దు చేస్తారు. రెంట్‌ పేమెంట్‌, యుటిలిటీ బిల్స్‌, ఫ్యూయల్‌, ఇన్సురెన్స్‌, ఈఎంఐ, జ్యువెలరీ కొనుగోళ్లకు క్యాష్‌ బ్యాక్‌ వర్తించదు. ఒక నెలలో 10 శాతం క్యాష్‌బ్యాక్‌ కింద రూ.1,500 లభిస్తుంది. 5 శాతం క్యాష్‌బ్యాక్‌కూ అదే పరిమితి వర్తిస్తుంది. 1 శాతం క్యాష్‌బ్యాక్‌కు నెలలో గరిష్ఠ పరిమితి రూ.500గా నిర్ణయించారు. 

ఈ కార్డు వెల్‌కమ్‌ బెన్‌ఫిట్‌ కింద మూడు నెలల పాటు స్విగ్గీ వన్‌ మెంబర్‌షిప్‌ లభిస్తుంది. ఇది స్విగ్గీ అందించే ప్రైమ్‌ మెంబర్‌షిప్‌. ఈ మెంబర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ కింద ఫుడ్‌, గ్రాసరీ, డైనింగ్‌ ఔట్‌, పికప్‌ అండ్‌ డ్రాప్‌ సర్వీసెస్‌లో కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. వీటితో పాటు ఫ్రీ స్టే, డైన్‌, కాంప్లిమెంటరీ లాయల్టీ మెంబర్‌షిప్‌ వంటి మాస్టర్‌ కార్డు ప్రయోజనాలూ ఈ కార్డుదారులకు లభిస్తాయి. స్విగ్గీ యాప్‌లో వారం పది రోజుల్లో దశలవారీగా ఈ క్రెడిట్‌ కార్డు అందుబాటులోకి రానుంది. అర్హత గల కస్టమర్లు క్రెడిట్‌ కార్డు కోసం అప్లయ్‌ చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెబ్‌సైట్ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌తో కలిసి జొమాటో సైతం కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చింది. కొన్నిరోజుల తర్వాత నిలిపివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని