Income Tax: మీరు తీసుకున్న రుణానికి ప‌న్ను ప్ర‌యోజ‌నం ల‌భిస్తుందా? తెలుసుకోండి..

ఇంటి కొనుగోలు, విద్య కోసం అయితే వ్య‌క్తిగ‌త రుణం కాకుండా ఆయా కేట‌గిరిలో రుణం తీసుకోవ‌డం వ‌ల్ల త‌క్కువ వ‌డ్డీకే రుణం ల‌భిస్తుంది.

Updated : 09 Jul 2022 17:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకులు తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల రుణాలను ఇస్తుంటాయి. ఇల్లు కొనుగోలు చేసేవారికి గృహరుణం, కారు కొనుగోలుకు కారు రుణం, ఉన్నత చదువుల కోసం విద్యా రుణం, వ్యక్తిగత కారణాలతో డబ్బు అవసరమైన వారికి వ్యక్తిగత రుణం, బంగారంపై ఇలా.. అనేక రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. ఇలా తీసుకున్న కొన్ని రకాల రుణాలకు ఆదాయపు పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. ఇవి అన్ని రుణాలకూ వర్తించవు. అయితే, బ్యాంకుల నుంచి ఎక్కువ మంది విద్యా, గృహ‌, కారు, వ్య‌క్తిగ‌త రుణాల‌ను తీసుకుంటుంటారు. మ‌రి వీటిపై ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయో.. లేదో తెలుసుకుందాం.

విద్యా రుణం (Education Loan)పై పన్ను మినహాయింపులు: ప్రస్తుతం అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయింది. ఈ పోటీని తట్టుకుని మంచి సంస్థలో మంచి జీతంతో ఉద్యోగం సాధించాలన్నా, సొంతంగా వ్యాపారం చేసి విజ‌య‌వంతం కావాల‌న్నా, తాము ఎంచుకున్న కోర్సులో నైపుణ్యం సాధించడం ఎంతో అవసరం. కాబట్టి, విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నారు. కానీ, పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఉన్నత విద్యకు చాలా ఖర్చవుతుంది. ఇక విదేశాలకు వెళ్లే వారైతే మరింత ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు విద్యా రుణాలను మంజూరు చేస్తుంటే.. ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విద్యారుణంపై పన్ను మినహాయింపు ప్ర‌యోజ‌నాన్ని అందిస్తోంది. వీటికి కొన్ని నియమనిబంధనలు వర్తిస్తాయి.

  • విద్యారుణం పై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80-ఈ కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
  • బ్యాంకులు, ఆమోదం పొందిన ఆర్థిక సంస్థలు, ఛారిటబుల్ ట్రస్టుల నుంచి పొందిన విద్యా రుణాలకు మాత్రమే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. స్నేహితులు, బంధువుల వద్ద తీసుకున్న రుణాలకు పన్ను మినహాయింపు ఉండదు.
  • విద్యార్థులు.. తమ సీనియర్ సెకండరీ స్థాయిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఉన్నత విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. అటువంటి కోర్సులను దేశంలో లేదా విదేశాలలో అభ్యసించేందుకు బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకోవచ్చు.
  • రుణం పూర్తిగా చెల్లించేంత‌ వ‌ర‌కు లేదా గరిష్ఠంగా 8 ఏళ్లు.. ఈ రెండింటిలో ఏది తొందరగా పూర్తవుతుందో అంత వరకు పన్ను ప్రయోజనం లభిస్తుంది.
  • విద్యా రుణంపై చెల్లించే వడ్డీకి మాత్రమే పన్ను మినహాయింపు ప్రయోజనం వర్తిస్తుంది. దీనికి గరిష్ఠ పరిమితి లేదు. అందువల్ల పన్ను మినహాయింపు పొందే వారు ఈఎంఐలో వడ్డీ, అసలు భాగాలను తెలిపే సర్టిఫికెట్‌ను బ్యాంకు నుంచి పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే, విద్యారుణం అసలు మొత్తంపై ఈ మినహాయింపు వర్తించదు. 
  • ఒక వ్యక్తి తన కోసం గానీ, భార్య/పిల్లల చదువుల కోసం గానీ, గార్డియన్‌గా వ్యవహరిస్తున్నవారి ఉన్నత చదువుల కోసం గానీ రుణం తీసుకోవచ్చు. అలాగే, చెల్లింపులపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. 
  • రుణ గ్రహీత రుణ చెల్లింపులను ప్రారంభించిన తర్వాత మాత్రమే పన్ను ప్రయోజనాలను పొందే వీలుంది.
  • భారత్‌లో దాదాపు అన్ని విద్యా రుణాలకు మారటోరియం పిరియడ్ అందుబాటులో ఉంటుంది. విద్యార్థి చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరేందుకు కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో వడ్డీ లెక్కిస్తారు. కానీ, రుణం తీసుకున్న వెంట‌నే చెల్లింపులు చేయ‌వ‌నవ‌స‌రం లేదు. విద్యార్థి చ‌దువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన త‌ర్వాత నుంచి చెల్లింపులు ప్రారంభించ‌వ‌చ్చు. అప్ప‌టి వ‌ర‌కు చెల్లించాల్సిన వ‌డ్డీని రుణ చివరి వాయిదాతో కలిపి లెక్కిస్తారు. సాధారణంగా కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక ఏడాదికి వరకు సమయం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఈఎంఐ చెల్లించడం మొదలు పెట్టాలి.

గృహ రుణం (Home Loan)పై పన్ను మినహాయింపులు: భారత్‌లో అందుబాటులో ఉన్న అతిపెద్ద రుణాల్లో గృహ రుణం ఒకటి. రుణ విలువ, చెల్లింపుల కాలవ్యవధి రెండూ ఎక్కువగానే ఉంటాయి. దీర్ఘకాలిక రుణం కాబట్టి ఈ రుణంతో పన్ను చెల్లింపుదారులు స్థిరాస్తిని ఏర్పాటు చేసుకోవచ్చు. మరోవైపు పన్ను మినహాయింపులను పొందొచ్చు. 

  • గృహ రుణానికి సంబంధించి అసలు, వడ్డీ చెల్లింపులు రెండింటిపైనా పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
  • అసలు చెల్లింపులై సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు ప‌న్ను మిన‌హాయింపు లభిస్తుంది. అయితే, ఇల్లు కొనుగోలు చేసిన 5 సంవత్సరాల్లోపు ఇంటిని అమ్మకూడదు. ఒకవేళ అమ్మితే, ఈ ప్రాపర్టీ అమ్మిన ఏడాది, పన్ను మినహాయింపు పొందిన (అసలు మాత్రమే) మొత్తాన్ని వార్షిక ఆదాయానికి జత చేసి పన్ను లెక్కిస్తారు.
  • వడ్డీ చెల్లింపులపై సెక్షన్ 24(బి) కింద గరిష్ఠగా రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. గృహ కొనుగోలు, పునరుద్ధరణ, పునర్నిర్మాణం, మరమ్మతు, నిర్మాణ ప్రయోజనాల కోసం, సెక్షన్ 24 కింద అనుమతించిన గరిష్ఠ మినహాయింపు పొందొచ్చు.
  • నిర్మాణం పూర్తయిన గృహాలకు తీసుకున్న రుణంపై మాత్రమే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. నిర్మాణంలో ఉంటే మినహాయింపు వర్తించదు.
  • నిర్మాణంలో ఉన్న ఇంటి కోసం రుణం తీసుకున్న వారు నిర్మాణం పూర్తైయ్యేంత వరకు పన్ను ప్రయోజనాలను పొందలేరు. రుణ ఈఎంఐ చెల్లింపులు వెంట‌నే ప్రారంభించిన‌ప్ప‌టికీ, నిర్మాణం పూర్తయిన త‌ర్వాత వ‌డ్డీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఈ వ‌డ్డీని ఐదు సమాన‌ భాగాలుగా విభ‌జించి నిర్మాణం పూర్తయిన త‌ర్వాత ఐదేళ్ల పాటు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

కారు/ఆటో (Car/Auto Loans) రుణాలు: కారు అనేది లగ్జరీ వస్తువుల జాబితాలోకి వస్తుంది. అందువల్ల కారు/ఆటో రుణాల కొనుగోలుపై పన్ను ప్రయోజనాలు లభించవు. అయితే, వాణిజ్య వినియోగం కోసం కొనుగోలు చేసి స్వీయ ఉపాధి పొందే వారికి మాత్రం మినహాయింపు లభిస్తుంది.

వ్యక్తిగత రుణాలపై: ఉన్నత విద్య, వైద్య ఖ‌ర్చులు, విహార‌యాత్ర, వివాహ ఖ‌ర్చులు, ఇంటి కొనుగోలు, మ‌ర‌మ్మ‌తులు.. వివిధ అవ‌స‌రాల కోసం వ్య‌క్తిగ‌త రుణం తీసుకోవ‌చ్చు. స్వ‌ల్ప నిబంధ‌న‌ల‌తో ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. కాబ‌ట్టి, ఇత‌ర సెక్యూర్డ్ రుణాల‌తో పోలిస్తే వ‌డ్డీ రేటు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టి చాలా మంది ఈ రుణాల‌ను తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. వ్యక్తిగత రుణాలపై కూడా పన్ను మినహాయింపులు వర్తించవు. కానీ కొన్ని నిర్ధిష్ట కార‌ణాల‌తో రుణం తీసుకున్న‌ప్పుడు మాత్రం కొంత వ‌ర‌కు మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. అది కూడా రుణ వ‌డ్డీ చెల్లింపుల‌కు మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త రుణం తీసుకున్న‌ప్పుడు ఏ కార‌ణంతో రుణం తీసుకుంటున్నారో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కానీ ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవాలంటే మాత్రం ఎందుకు ఉప‌యోగించారో తెల‌పాలి. ఇందుకు సంబంధించిన రుజువులను ఇవ్వాల్సి ఉంటుంది.

వ్యాపార నిమిత్తం: వ్యాపారం ప్రారంభించేందుకు గానీ, వ్యాపార విస్త‌ర‌ణ‌కు గానీ వినియోగించిన‌ప్పుడు.. రుణం కోసం చెల్లించే వ‌డ్డీపై ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. అయితే, ఇక్క‌డ వ్యాపారం నుంచి వ‌చ్చిన లాభాల‌ను వ‌డ్డీ నుంచి తీసివేసిన త‌ర్వాత మిగిలిన మొత్తంపై మాత్ర‌మే డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం కోసం: వ్యక్తిగ‌త రుణంతో ఇల్లు కొనుగోలు చేసినా లేదా నిర్మించినా, రుణ వ‌డ్డీ చెల్లింపులపై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్షన్ 24 ప్రకారం రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు (అదే ఇంటిలో నివ‌సిస్తున్న‌ట్ల‌యితే) ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. ఇందుకోసం రుణం తీసుకున్న సంస్థ నుంచి ఇంటిని కొనుగోలు/నిర్మించేందుకు రుణం తీసుకున్నట్లుగా స‌ర్టిఫికెట్‌ తీసుకురావ‌ల‌సి ఉంటుంది.

ఇత‌ర ఆస్తులు కొనుగోలు చేస్తే: వ్య‌క్తిగ‌త రుణాన్ని ఉప‌యోగించి బంగారం, షేర్లు, ఇత‌ర‌ ఆస్తులు కొనుగోలు చేసిన‌ప్పుడు నేరుగా ప‌న్ను ప్రయోజ‌నాల‌ను పొంద‌లేరు. కానీ, ఆస్తి అమ్మిన‌ప్పుడు ప్ర‌యోజ‌నం పొందొచ్చు. మీరు కొనుగోలు చేసిన ఆస్తి విలువ‌కు, రుణ మొత్తంపై చెల్లించిన వ‌డ్డీని జోడించి క్యాపిట‌ల్ గెయిన్ ప్రయోజ‌నాన్ని పొందొచ్చు. అంటే, అమ్మిన ఏడాది మూలధన లాభం లెక్కింపులో కాస్ట్ అఫ్ యాక్విజిషన్ (కొనుగోలు ఖర్చు) కింద పరిగణించి తద్వారా మూలధన పన్ను తగ్గించుకోవచ్చు.

చివ‌రిగా: తీసుకున్న రుణం ఏదైనా స‌మ‌యానికి చెల్లింపులు చేయాల‌ని గుర్తుంచుకోండి. వ్య‌క్తిగ‌త రుణం వంటివి తీసుకుంటుంటే ఏ కార‌ణంతో రుణం తీసుకుంటున్నారో స్ప‌ష్ట‌త ఉండాలి. ఒక‌వేళ ఇంటి కొనుగోలు, విద్య కోసం అయితే వ్య‌క్తిగ‌త రుణం కాకుండా ఆయా కేట‌గిరీలో రుణం తీసుకోవ‌డం వ‌ల్ల త‌క్కువ వ‌డ్డీకే రుణం ల‌భిస్తుంది. అలాగే, ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు. కానీ, కేవ‌లం ప‌న్ను మిన‌హాయంపు కోస‌మే రుణం తీసుకోవ‌డం మంచిది కాదు. బ్యాంకులు, అధీకృత ఆర్థిక సంస్థ‌ల వ‌ద్ద తీసుకున్న రుణాల‌కు మాత్ర‌మే ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. స్నేహితులు, బంధువుల ద‌గ్గ‌ర తీసుకున్న రుణాల‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను క్లెయిమ్ చేయ‌లేర‌ని మ‌ర్చిపోవ‌ద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని