Adhaar-PAN: ఆధార్‌- పాన్ లింక్‌ అవ్వడం లేదా? ఇదే కారణం కావొచ్చు!

Adhaar-PAN: ఆధార్‌- పాన్ అనుసంధానానికి గడువు దగ్గర పడింది. నెలాఖరుతో ఈ గడువు ముగియనుంది. ఒకవేళ మీరు అనుసంధానానికి ప్రయత్నిస్తున్నా కావడం లేదా? కారణం ఇదే కావొచ్చు.

Published : 24 Jun 2023 15:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆధార్‌-పాన్‌ (Adhaar-PAN) అనుసంధానానికి గడువు దగ్గర పడింది. జూన్‌ 30తో ఈ గడువు ముగియనుంది. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం పాన్‌ ఉన్న ప్రతి వ్యక్తీ దాన్ని ఆధార్‌తో జత చేయాల్సిందే. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించారు. ఇప్పుడైతే రూ.1,000 అపరాధ రుసుము చెల్లించి ఆధార్‌-పాన్‌ లింక్‌ చేసుకునేందుకు నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది. ఆ గడువు కూడా ముగిశాక పాన్‌ కార్డు చెల్లుబాటు కాదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.  పాన్‌-ఆధార్‌ అనుసంధానం చేసేందుకు ప్రయత్నించినా కొందరికి ఈ ప్రక్రియ పూర్తి కావడం లేదు. ఇందుకు డెమోగ్రఫిక్‌ వివరాలు సరిపోలకపోవడమే కారణం కావొచ్చని ఆదాయపు పన్ను శాఖ శనివారం ట్వీట్‌ చేసింది.

పేరు, పుట్టిన తేదీ, జెండర్‌ విషయంలో ఎందులో తప్పులు ఉన్నా ఆధార్‌-పాన్‌ అనుసంధానం అవ్వదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. కాబట్టి పాన్‌ కార్డు, ఆధార్‌ వివరాలు సరిచేసుకోవాలని సూచించింది. పాన్‌-ఆధార్‌ పరిశీలించి రెండింట్లో ఏదో ఒక దాంట్లో మార్పులు చేసుకోవాలంది. పాన్‌లో కరెక్షన్‌ చేయదలుచుకుంటే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో మార్చుకునే వెసులుబాటు ఉంది. ఆధార్‌లో తప్పుల కోసం దగ్గర్లోని ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రానికి వెళ్లి సరిచేయించొచ్చు. సరిచేశాక మరోసారి ఐటీ పోర్టల్‌లో అనుసంధానానికి ప్రయత్నించాలని ఐటీ శాఖ సూచించింది. అప్పటికీ అనుసంధానం అవ్వకపోతే పాన్‌ సర్వీసు కేంద్రాల్లో రూ.50 చెల్లించి బయోమెట్రిక్‌ అథంటికేషన్‌ ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.
Also Read: పాన్‌- ఆధార్‌ లింక్‌ ఇలా.. 

మరోసారి గడువు పొడిగిస్తారా? 

ఆధార్‌ కార్డు-పాన్‌ కార్డులను జత చేయని పక్షంలో జులై నుంచి పాన్‌ కార్డు చెల్లుబాటు కాదని ఆదాయపన్నుశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విషయాన్ని చాలా రోజుల నుంచి చెబుతూ వస్తున్నా 13 కోట్ల మంది (2023 ఫిబ్రవరి నాటికి) పాన్‌ కార్డు హోల్డర్లు అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయకపోవడం గమనార్హం. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పాన్‌-ఆధార్‌ అనుసంధానం చేసుకోకపోతే ఐటీ రిటర్నులు ఫైల్‌ చేయడం సాధ్యపడదు. ఐటీ రిటర్నుల దాఖలుకు జులై 31 వరకు గడువు ఉంది. కాబట్టి ఆ మేర మరో నెల రోజులైనా గడువు పొడిగించే అవకాశం లేకపోలేదని ఇంకొందరు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అనుసంధానం చేసుకోకపోవడంతో అపరాధ రుసుముతో మరో 3-5 నెలలు గడువు ఇవ్వొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చూడాలి.. కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని