Union Budget 2024: మెరుపుల్లేని మధ్యంతరం!

రాయితీల తళుకుల్లేవ్‌.. కొత్త పథకాల చమక్కుల్లేవ్‌! పన్నుల్లో తగ్గింపుల్లేవ్‌.. పీఎం కిసాన్‌ సాయంలో పెంపుల్లేవ్‌! ప్రజాకర్షక ప్రకటనల్లేవ్‌.. ధరలపై ఊరడింపు నిర్ణయాల్లేవ్‌! చూపించిందంతా పదేళ్ల ప్రగతి పథమే.. వినిపించిందంతా వికసిత్‌ భారత్‌ జపమే!!

Updated : 02 Feb 2024 07:13 IST

తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్‌
కొత్త పథకాలేవీ లేవు
పాత స్కీముల విస్తరణకే ప్రాధాన్యం
ఆహారం, ఎరువులపై రాయితీల్లో 8% కోత
ఆదాయపు పన్ను శ్లాబులు యథాతథం
మౌలిక వసతుల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు
ద్రవ్యలోటు తగ్గింపునకే కేంద్రం మొగ్గు
అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్‌ భారత్‌ వర్తింపు
ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన కింద వచ్చే అయిదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం

రాయితీల తళుకుల్లేవ్‌..
కొత్త పథకాల చమక్కుల్లేవ్‌!
పన్నుల్లో తగ్గింపుల్లేవ్‌..
పీఎం కిసాన్‌ సాయంలో పెంపుల్లేవ్‌!
ప్రజాకర్షక ప్రకటనల్లేవ్‌..
ధరలపై ఊరడింపు నిర్ణయాల్లేవ్‌!
చూపించిందంతా పదేళ్ల ప్రగతి పథమే..
వినిపించిందంతా వికసిత్‌ భారత్‌ జపమే!!

సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నా.. హ్యాట్రిక్‌ విజయం ఊరిస్తున్నా.. మోదీ సర్కారు-2 తమ చిట్టచివరి బడ్జెట్‌లో తాయిలాల వర్షం కురిపించలేదు. జనరంజక నిర్ణయాల జోలికెళ్లలేదు. ద్రవ్యలోటు తగ్గింపునకే ప్రాధాన్యమిస్తూ.. గత కొన్నేళ్ల తరహాలోనే దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. సమ్మిళిత అభివృద్ధే తమ ధ్యేయమంటూ.. పెద్దఎత్తున ఉద్యోగాల సృష్టికి బాటలు పరిచింది. గృహనిర్మాణం, పర్యాటకం, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించే ప్రకటనలు చేసింది. గత పదేళ్ల ప్రగతి ఫలాలే వచ్చే ఎన్నికల్లో తమ అఖండ విజయానికి బాటలు పరుస్తాయంటూ ధీమా వ్యక్తం చేసింది. అయితే పీఎం కిసాన్‌ సాయంలో పెంపు లేకపోవడంతో రైతన్నలు, వంటగ్యాస్‌/చమురు ధరల తగ్గింపు ప్రకటనల్లేకపోవడంతో మధ్యతరగతి ప్రజలు, ఆదాయపు పన్నుభారాన్ని తగ్గించకపోవడంతో వేతనజీవులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముంగిట భారీ అంచనాల నడుమ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్‌ సగటు జీవిని ఉసూరుమనిపించింది! పీఎం కిసాన్‌ సాయం పెంపుపై అన్నదాతలు, ఆదాయపు పన్ను భారం తగ్గింపుపై ఉద్యోగులు, ఆయుష్మాన్‌ భారత్‌ బీమా కవరేజీ పెరుగుదలపై పేదలు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. కొత్త పథకాలేవీ ప్రకటించకుండానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో గురువారం ఆచితూచి తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టారు. గత పదేళ్లలో మోదీ సర్కారు సాధించిన విజయాలను బడ్జెట్‌ ప్రసంగంలో ప్రధానంగా ఉటంకించిన ఆమె- 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యంతో తాము ముందుకెళ్తున్నట్లు ఉద్ఘాటించారు. ఆ ప్రణాళికల్లో భాగంగా ద్రవ్యలోటు తగ్గింపుపై దృష్టిపెట్టామని ప్రకటించారు. మౌలిక వసతుల కల్పనకు రూ.11.11 లక్షల కోట్ల భారీ మొత్తం కేటాయించారు. పేదలు, మహిళలు, యువత, రైతుల అవసరాలు తీర్చడం.. వారి ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశమని ఆర్థికమంత్రి నొక్కిచెప్పారు. సమ్మిళిత, సర్వతోముఖాభివృద్ధే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

‘వ్యవస్థను గాడిలో పెట్టాం’

2014లో మోదీ సర్కారు తొలిసారి పగ్గాలు చేపట్టేనాటికి దేశం ముందు అనేక కఠిన సవాళ్లున్నాయని నిర్మల  పేర్కొన్నారు. తాము ఒక్కో మెట్టు ఎక్కుతూ.. తీవ్రంగా శ్రమించి పరిపాలనా వ్యవస్థను గాడిలో పెట్టామని చెప్పారు. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న పదేళ్ల కాలంతో పోలిస్తే.. మోదీ హయాంలో దేశం ఆర్థికంగా గొప్ప పురోగతి సాధించిందని సీతారామన్‌ వ్యాఖ్యానించారు. 2014కు ముందు దేశం ఎలా ఉంది.. ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగిందో తెలియజేసేలా పార్లమెంటులో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు.

పాత పథకాల విస్తరణ

తాజా పద్దులో కేంద్రం కొత్త పథకాలేవీ ప్రకటించలేదు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను విస్తరించే ప్రయత్నం మాత్రమే చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన కింద వచ్చే అయిదేళ్లలో మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించారు. గత నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు హాజరై దిల్లీకి తిరిగొచ్చిన తర్వాత మోదీ సూర్యోదయ పథకాన్ని ప్రకటించారు. ఆ పథకం ద్వారా కోటి ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు అమర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీతారామన్‌ గుర్తుచేశారు. ఫలితంగా ఒక్కో ఇంటికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు లభిస్తుందని, ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.15-18 వేలు ఆదా అవుతాయని పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజల కోసం కొత్తగా గృహనిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పినా.. దాని రూపురేఖలను మాత్రం వివరించలేదు.

వైద్య కళాశాలల ఏర్పాటుపై కమిటీ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఉన్న మౌలిక వసతులను ఉపయోగించుకొని మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ వ్యవహారంలో సాధకబాధకాలను అంచనా వేసి, అవసరమైన సిఫార్సులు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్తగా ఎన్ని వైద్య కళాశాలల్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నదీ, ఏ స్థాయి ఆసుపత్రుల సౌకర్యాలను ఇందుకోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నదీ మాత్రం వివరించలేదు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ప్రస్తుతం కల్పిస్తున్న రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని రెట్టింపు చేస్తారని ఇన్నాళ్లూ జోరుగా వార్తలొచ్చినా.. ఆర్థిక మంత్రి అలాంటి ప్రకటనేదీ చేయలేదు. ఈ పథకాన్ని ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు విస్తరించడంతో సరిపెట్టారు.

నానో డీఏపీ వినియోగానికి ప్రోత్సాహం

అన్నదాతల విషయంలోనూ ఈ పద్దులో విశేష ప్రకటనలేవీ లేవు. పీఎం కిసాన్‌ పథకం కింద అందించే వార్షిక సాయాన్ని పెంచుతారని ఆశించినవారికి నిరాశే ఎదురైంది. నానో యూరియా విజయవంతం కావడంతో ఇకపై నానో డీఏపీ వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు నిర్మల వెల్లడించారు. లఖ్‌పతి దీదీ పథకం కింద 2 కోట్ల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించాలని కేంద్రం గతంలో లక్ష్యం విధించుకోగా.. ఆ సంఖ్యను 3 కోట్లకు పెంచనున్నట్లు తాజాగా ప్రకటించారు. పంటకోతల తర్వాత అవసరమయ్యే ఆధునిక నిల్వ సదుపాయాలు, సరఫరా గొలుసుల ఏర్పాటు కోసం ప్రైవేటు, ప్రభుత్వ పెట్టుబడులను కేంద్రం ప్రోత్సహించనుంది. 2023-24తో పోలిస్తే 2024-25లో ఆహారం, ఎరువులపై రాయితీలను 8% తగ్గించారు.

రైల్వేలో మూడు కొత్త నడవాలు

రైల్వేలో కొత్తగా 3 నడవాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. వాటివల్ల సరకు, ప్రయాణికుల రవాణా మెరుగుపడతాయని పేర్కొన్నారు. మెట్రో, నమోభారత్‌ రైళ్లను పెద్ద నగరాలకు విస్తరిస్తామని చెప్పారు. ఎన్ని నగరాలకు విస్తరిస్తారు, ఎంత వెచ్చిస్తారనే వివరాలను వెల్లడించలేదు. ఇప్పుడున్న విమానాశ్రయాలను విస్తరిస్తూనే, కొత్తవాటి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. అమృతకాలాన్ని ‘కర్తవ్య కాలం’గా ఆమె అభివర్ణించారు.

ద్రవ్యలోటు తగ్గింపునకే ప్రాధాన్యం

2024-25 ఆర్థిక సంవత్సరం చివరికల్లా ద్రవ్యలోటును జీడీపీలో 5.1%కు పరిమితం చేయాలని లక్ష్యంగా విధించుకున్నట్లు సీతారామన్‌ తెలిపారు. 2025-26 కల్లా ఆ లోటును 4.5% కంటే దిగువకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అందుకు తగ్గట్టే ప్రభుత్వం ప్రజాకర్షక ప్రకటనల జోలికి పోలేదు.

‘జీఎస్‌టీతో ధరలు దిగొచ్చాయ్‌’

గత పదేళ్లలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడింతలు, పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేవారి సంఖ్య  2.4 రెట్లు పెరిగినట్లు సీతారామన్‌ వెల్లడించారు. వేతన జీవులకు ఈ పద్దులో ఉపశమనాలేవీ లభించలేదు. ఆదాయపు పన్ను శ్లాబులను యథాతథంగా కొనసాగించారు. జీఎస్‌టీ అమలుతో వినియోగదారులే అత్యధిక ప్రయోజనాలు పొందుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. జీఎస్‌టీతో పన్నుభారం, సరకు రవాణా ఖర్చులు తగ్గి వస్తు, సేవల ధరలు దిగొచ్చాయని చెప్పారు. అందుకే ఇప్పుడున్న పన్నుల్లో మార్పులు, చేర్పులేవీ చేయలేదని వివరించారు. అన్ని ప్రత్యక్ష, పరోక్ష పన్నులను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు.  

మౌలిక వసతులకు పెద్దపీట

రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాల వంటి మౌలిక వసతుల కల్పనపై వ్యయాన్ని కిందటి బడ్జెట్‌తో పోలిస్తే కేంద్రం 11.1% పెంచి.. ఏకంగా రూ.11.11 లక్షల కోట్లు కేటాయించింది. భారీగా ఉద్యోగాల సృష్టికి, ఆర్థిక వృద్ధి పెరుగుదలకు ఈ కేటాయింపులు దోహదపడనున్నాయి. మౌలిక వసతులపై వ్యయం చేసేందుకు రాష్ట్రాలకు రూ.1.3 లక్షల కోట్ల దీర్ఘకాలిక రుణాలను కేంద్రం మంజూరు చేయనుంది.

మళ్లీ వచ్చేది మేమే..

గత పదేళ్లలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని నిర్మలా సీతారామన్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక.. 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన ఆర్థిక విధానాలు రూపొందిస్తామన్నారు. కొత్త సంస్కరణలను తీసుకొచ్చి.. రాష్ట్రాలు, ఇతర భాగస్వామ్య పక్షాల సమ్మతితో వాటిని విజయవంతంగా అమలు చేస్తామని నొక్కిచెప్పారు. రాబోయే అయిదేళ్లలో మునుపెన్నడూ లేనంత అభివృద్ధి చోటుచేసుకోబోతోందని పేర్కొన్నారు.


58 నిమిషాలే..

వరుసగా ఆరోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌- ఈసారి కేవలం 58 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. మొత్తం 32 పేజీల ప్రసంగ పాఠంలో 12 పేజీలు.. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి బుధవారం చేసిన ప్రసంగానికి కొనసాగింపు అన్న భావన కలిగించాయి. ప్రధాని మోదీ పదేపదే చెప్పే సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం, పేదలు/రైతుల సంక్షేమం, యువత సాధికారత, నారీశక్తి, సుపరిపాలన, స్థూల జాతీయోత్పత్తి వృద్ధి, ఆర్థిక నిర్వహణ, ప్రపంచంతో పోటీ వంటి అంశాల గురించి ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. తొమ్మిదిసార్లు వికసిత్‌ (అభివృద్ధి చెందిన) భారత్‌ గురించి, అయిదుసార్లు అమృతకాలం గురించి ప్రస్తావించారు. తమ సామర్థ్యాలకు అనుగుణంగా ఎదగడానికి వీలుగా అన్ని ప్రాంతాల ప్రజలకు అవకాశాలు కల్పించడమే వికసిత్‌ భారత్‌ లక్ష్యమని ప్రకటించారు. అమృతకాలంలో అందరి ఆకాంక్షలను నెరవేర్చే ఆర్థిక విధానాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.


దేశ భవిష్యత్తుకు గ్యారంటీ

అభివృద్ధి చెందిన భారత్‌ పునాదిని బలోపేతం చేసే గ్యారంటీని ఈ బడ్జెట్‌ అందిస్తోంది. యువత, పేదలు, మహిళలు, రైతులు అనే భారత్‌లోని నాలుగు స్తంభాలకు ఇది సాధికారత చేకూరుస్తుంది. యువ భారత్‌ ఆశలను ప్రతిబింబిస్తున్న ఈ బడ్జెట్‌ దేశ భవిష్యత్తుకు రూపకల్పన చేసేలా ఉంది. పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.లక్ష కోట్ల నిధులు ప్రకటించడం చరిత్రాత్మకం.

ప్రధాని మోదీ


ప్రధాని మోదీ హయాంలో దశల వారీగా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ వచ్చాం. ప్రజలకు నమ్మకం కలిగించి, పెట్టుబడులను ఆకర్షిస్తూ, సంస్కరణలు చేస్తూ ముందుకు నడిచాం. అలా ‘దేశం ఫస్ట్‌’ అనే మా బలమైన నినాదాన్ని విజయవంతం చేశాం. అన్ని రంగాల్లో స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించాం.

నిర్మలా సీతారామన్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని