Coffee Badging: కాఫీ బ్యాడ్జింగ్‌.. కార్పొరేట్‌ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్‌!

Coffee Badging: క్వైట్‌ క్విట్టింగ్‌, రేజ్‌ అప్లయింగ్‌, గ్రేట్‌ రెసిగ్నేషన్‌ తరహాలో తాజాగా మరో కొత్త ట్రెండ్‌ వెలుగులోకి వచ్చింది. అదే కాఫీ బ్యాడ్జింగ్‌. అదేంటో చూద్దాం..!

Updated : 17 Nov 2023 11:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19 తర్వాత కార్పొరేట్‌ ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి. పని ప్రదేశం, సమావేశాలు, నియామక విధానం.. ఇలా అన్నీ మారాయి. ఉద్యోగుల పనితీరులోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా మంది ఇంటి నుంచి పనిచేయడానికి (Work from Home) అలవాటు పడ్డారు. ఈ క్రమంలో క్వైట్‌ క్విట్టింగ్‌, రేజ్‌ అప్లయింగ్‌, గ్రేట్‌ రెసిగ్నేషన్‌.. ఇలా అనేక కొత్త ధోరణలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఉద్యోగులందరినీ కంపెనీలు ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. దీంతో తాజాగా మరో కొత్త పోకడ తెరపైకి వచ్చింది. అదే కాఫీ బ్యాడ్జింగ్‌ (Coffee Badging).

ఆఫీసుకు కచ్చితంగా రావాలని (Return to office) కంపెనీలు ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది ఉద్యోగులు ఈ కాఫీ బ్యాడ్జింగ్‌ (Coffee Badging) అనే విధానాన్ని అవలంబిస్తున్నారు. దీని ప్రకారం.. ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి తొలుత తమ ఐడీని స్వైప్‌ చేస్తారు. తర్వాత సహచరులతో కలిసి కాఫీ ఉండే ప్రదేశానికి వెళతారు. అక్కడే వారితో మాట్లాడుతూ.. కాఫీ తాగుతూ కొంత సమయం గడుపుతారు. ఇతరుల దృష్టిలో పడేలా అలా అటూఇటూ తిరుగుతారు. ముఖ్యంగా తమ మేనేజర్లు లేదా హెచ్‌ఆర్‌లు తమని గమనించేలా చూస్తారు. తర్వాత నేరుగా డెస్క్‌కు వచ్చి ఇంటికి బయలుదేరతారు. ఆఫీసులకు రావడాన్ని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ కొంత మంది ఉద్యోగులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

ఆఫీసుకు రావడానికి అయ్యే సమయం, డబ్బును వెచ్చించడానికి WFHకు అలవాటుపడ్డ ఉద్యోగులు ఇష్టపడడం లేదని తాము నిర్వహించిన సర్వేలో తేలిందని ‘ఓల్‌ ల్యాబ్స్‌’ అనే సంస్థ తెలిపింది. పైగా ఇంకా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఒత్తిడిలేని, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం లేదని పేర్కొంది. ఇది కూడా ఒక కారణమని వివరించింది. సమావేశాలు, చర్చలు, నివేదికలు.. ఇలా అన్ని పనులు ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో సమర్థంగా చేయగలుగుతున్నామని ఉద్యోగులు సర్వేలో పేర్కొన్నారు. ఆఫీసుకు వెళ్లడం వల్ల వీటి విషయంలో ఉత్పాదకత తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ కాఫీ బ్యాడ్జింగ్‌ (Coffee Badging) వల్ల ప్రతికూల ప్రభావమూ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తవారు, కచ్చితంగా ఆఫీసు నుంచి పనిచేయాల్సిన వారిలో ఒకరకమైన నైరాశ్యం ఆవహిస్తుందని తెలిపారు. ఇతరులతో పోల్చినప్పుడు తమకు సౌకర్యవంతమైన అవకాశాలు లేవని వారు భావించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీర్ఘకాలంలో ఇది ఒక ప్రతికూల పని సంస్కృతికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఆఫీసుకు వెళ్లడం ఒక పెద్ద పనిభారం అనే భావన ఉద్యోగుల్లో పాతుకుపోతుందని పేర్కొన్నారు. మరోవైపు కాఫీ బ్యాడ్జింగ్‌ దీర్ఘకాలం కొనసాగితే.. కంపెనీలు దీన్ని తీవ్రంగా పరిగణించే ప్రమాదం ఉందని తెలిపారు. వారిపై క్రమశిక్షణ చర్యలకూ దారి తీయొచ్చని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని