ChatGPT CEO: లాభాపేక్షనా? ఆధిపత్య పోరా? ఆల్టమన్‌ తొలగింపు కారణమేంటి?

Sam altman: చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ సీఈఓగా ఆల్టమన్‌ తొలగింపు టెక్‌ వర్గాల్లో సంచలనానికి కారణమైంది. బోర్డు చెప్తున్న కారణం ఒకటైతే.. ఆల్టమన్‌ వైఖరి పట్ల కొందరికి భిన్నాభిప్రాయాలే దీనికి ముఖ్య కారణమని టెక్‌ వర్గాలు కోడైకూస్తున్నాయి.

Updated : 18 Nov 2023 16:41 IST

ChatGPT CEO | ఇంటర్నెట్ డెస్క్‌: చాట్‌జీపీటీ పేరుతో ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ సేవలను ప్రారంభించి టెక్‌ వర్గాల్లో సంచలనానికి వేదికగా నిలిచిన ఓపెన్‌ ఏఐ.. మరోసారి వార్తల్లోకెక్కింది. ఇన్నాళ్లు సీఈఓగా వ్యవహరించిన శామ్‌ ఆల్టమన్‌ను (Sam altman) బోర్డు ఉన్నపళంగా తొలగించడంపై చర్చనీయాంశమైంది. కాసేపటికే ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ (Greg Brockman) కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆల్టమన్‌ను తొలగించిన కారణంగానే గ్రెగ్‌ తన పదవి నుంచి వైదొలిగారు.  బోర్డుతో విషయాలేవీ పంచుకోవడం లేదని, తాము తీసుకునే నిర్ణయాలను ఆల్టమన్‌ అడ్డుకుంటున్నాడన్నది బోర్డు ఆరోపణ. కానీ, ఆల్టమన్‌ తొలగింపునకు వేరే కారణాలున్నాయంటున్నాయి టెక్‌ వర్గాలు.

నాన్ ప్రాఫిట్‌ టు ప్రాఫిట్‌

2015లో ఓపెన్‌ ఏఐని నెలకొల్పినప్పుడు దీన్నొక లాభాపేక్షలేని సంస్థగా తీర్చిదిద్దాలని వ్యవస్థాపకులు అనుకున్నారు. ఆల్టమన్‌తో పాటు సుత్‌స్కేవర్‌, ఎలాన్‌ మస్క్‌, పలువురు వ్యవస్థాపకులుగా ఉన్నారు. మానవాళికి సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఏఐని అందించాలని అనుకున్నారు. అయితే, 2019లో ఆల్టమన్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మారింది. దీన్నో పెద్ద కంపెనీలా మార్చాలన్నది అతడి కల. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌వంటి పెద్ద కంపెనీ నుంచి భారీగా నిధులు సేకరించాడు. అంతేకాదు.. కంపెనీ ఆశయాలకు గండికొడుతూ ఓపెన్‌ ఏఐని లాభాదాయకమైన ఓ వ్యాపారంగా మార్చాలని అనుకున్నాడు. దీనిపట్ల బోర్డులో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు.. ఆ వెంటనే ఓపెన్‌ఏఐ సహ-వ్యవస్థాపకుడి రాజీనామా

దూకుడు..

మరోవైపు ఏఐ వల్ల కలిగే దుష్ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆల్టమన్‌ దూకుడుగా ముందుకెళ్లడమూ మరో కారణమని సిలికాన్‌ వ్యాలీ వర్గాలు పేర్కొంటున్నాయి. చాట్‌జీపీటీ, ఇతర సర్వీసులకు సంబంధించిన భద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా అతడు ముందుకెళ్లేవాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల సొంత జీపీటీలను డెవలప్‌ చేసుకునేలా కొన్ని ప్లగ్‌ ఇన్‌లను చాట్‌జీపీటీలో ఓఎన్‌ఏఐ తీసుకొచ్చింది.దీంతో వెబ్‌సైట్‌కు యూజర్లు పోటెత్తడంతో కొన్ని గంటల పాటు చాట్‌జీపీటీ నిలిచిపోయింది. దీంతో ప్లగ్‌ ఇన్స్‌కు సైనప్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆల్టమన్‌ ట్వీట్‌ చేయాల్సి వచ్చింది. ఇలా ఆల్టమన్‌ దూకుడూ ఉద్వాసనకు మరో కారణమైంది.

సహ వ్యవస్థాపకుడితో పేచీ

ఓపెన్‌ ఏఐ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన కంపెనీ చీఫ్‌ సైంటిస్ట్‌ సుత్‌స్కేవర్‌కు, ఆల్టమన్‌ మధ్య విభేదాలు సైతం మరో కారణమని చెప్పుకొంటున్నారు. భద్రత, కమర్షిలైజ్‌ చేయడం వంటి విషయాల్లో వీరికి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, సూపర్‌ ఇంటిలిజెంట్ పేరిట ఓ కొత్త టీమ్‌ను సుత్‌స్కేవర్‌ ఈ ఏడాది జులైలో ప్రారంభించారు. అయితే, ఓ నెల క్రితం ఆయన బాధ్యతలకు కంపెనీ కోత వేసింది. దీంతో ఆల్టమన్‌, ఆయనకు మద్దతుగా నిలిచిన గ్రెగ్‌ బ్రాక్‌మన్‌కూ, సుత్‌స్కేవర్‌కూ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని, అవే ఆల్టమన్‌ను ఉద్వాసనకు దారితీశాయని సంబంధిత వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, ఇదంతా బోర్డు నిర్ణయమంటూ సుత్‌స్కేవర్‌ కొట్టి పారేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని